Income Tax : గుజరాత్ ను మించిన జార్ఖండ్ మధ్యతరగతి ప్రజల ఆదాయం

మధ్యతరగతి ఆదాయంలో గుజరాత్‌ను జార్ఖండ్ అధిగమించింది. జార్ఖండ్‌లో 20% పన్ను చెల్లింపుదారుల ఆదాయం ₹12 లక్షల నుంచి ₹50 లక్షల మధ్య ఉంది, గుజరాత్‌లో ఇది 7% మాత్రమే. ₹25 లక్షల పైబడిన ఆదాయంలో మహారాష్ట్ర (1.4 లక్షల మంది) దేశంలోనే అగ్రస్థానంలో ఉంది.

Income Tax : గుజరాత్ ను మించిన జార్ఖండ్ మధ్యతరగతి ప్రజల ఆదాయం

న్యూఢిల్లీ, అక్టోబర్ 15 (విధాత ప్రతినిధి)భారతదేశంలో మధ్యతరగతి ప్రజల ఆదాయంలో గుజరాత్ ను జార్ఖండ్ మించిపోయింది. ఇండియాలో ఆదాయపన్ను రిటర్న్స్ దాఖలు చేసే వారిలో ఎక్కువ మంది ఏడాదికి రూ. 2.5 లక్షల నుంచి రూ. 7. 5 లక్షల మధ్య ఆదాయం ఉన్నట్టుగా గణాంకాలు చెబుతున్నాయి.

జార్ఖండ్‌లో 20 శాతం ట్యాక్స్ పేయర్స్ ఆదాయం పెరుగుదల

‌ 2024-25 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి ఆదాయ పన్ను శాఖకు దాఖలు చేసిన రిటర్న్స్ ఆధారంగా ఈ అంశాలు వెలుగు చూశాయి. జార్ఖండ్ రాష్ట్రంలో 20 శాతం పన్ను చెల్లింపుదారుల వార్షిక ఆదాయం రూ. 12 లక్షల నుంచి రూ. 50 లక్షల మధ్య ఉన్నట్టు ప్రకటించారు. గుజరాత్ రాష్ట్రంలో రూ. 25 నుంచి రూ. 50 లక్షల మధ్య ఆదాయం ఉన్న వారి సంఖ్య ఏడు శాతంగానే ఉందని గణాంకాలు చెబుతున్నాయి. మధ్యతరగతి ప్రజల్లో ఎక్కువ మంది రూ. 7.5 లక్షల ఆదాయం సంపాదిస్తున్నారు. మధ్య తరగతిలో సగానికి పైగా ఈ పరిధిలోకే వస్తున్నారు. ఇక రూ.25 లక్షలకు పైగా ఆదాయం కలిగిన వారు కేవలం 2.5 శాతం మాత్రమేనని గణాంకాలు చెబుతున్నాయి. అత్యధిక ఆదాయం ఉన్నట్టు రిటర్న్స్ దాఖలు చేసిన జాబితాలో కూడా గుజరాత్ కు స్థానం దక్కలేదు.

మహారాష్ట్రలో లక్షన్నర మందికి వార్షిక ఆదాయం రూ. 25 లక్షలకు పైనే

మహారాష్ట్రలో దాదాపు 1.4 లక్షల మందికి వార్షిక ఆదాయం రూ. 25 లక్షల నుంచి రూ. 50 లక్షల మధ్య ఉంది. ఈ విషయాన్ని ఆదాయ పన్ను శాఖకు తెలిపారు. ఇది దేశంలోనే అత్యధికం. మహారాష్ట్ర తర్వాతి స్థానాల్లో కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు నిలిచాయి. అత్యధికంగా లక్షాధికారులు ఈ ఆర్ధిక సంవత్సరంలో కర్ణాటక నుంచి ఉన్నారు. ఈ ఆర్ధిక సంవత్సరంలో రూ.12 నుంచి 50 లక్షలు సంపాదిస్తున్న వారిలో 20 శాతం కర్ణాటక నుంచే ఉన్నారు. ఆర్ధికంగా ఎక్కువ సంపాదిస్తున్నట్టు రిటర్న్స్ దాఖలు చేసిన రాష్ట్రాల జాబితాలో గుజరాత్ చివరలో నిలిచింది.

ఢిల్లీ నుంచి అత్యధికంగా పన్ను చెల్లింపుదారులు

మహారాష్ట్ర నుంచి అత్యధికంగా 46 లక్షలకు పైగా పన్ను రిటర్నులు దాఖలయ్యాయి. ఢిల్లీ జనాభాలో అత్యధికంగా పన్ను చెల్లింపుదారులు ఉన్నారు. రాష్ట్ర జనాభాలో దాదాపు 3% మంది పన్ను చెల్లిస్తున్నారు. భారతదేశంలో అత్యధిక జనాభా కలిగిన ఉత్తరప్రదేశ్‌లో రెండవ అత్యధిక రిటర్నులు ఉన్నప్పటికీ ఆ రాష్ట్ర వాటా 1.5% మాత్రమే. ఈ గణాంకాలు భారత్‌లోని మధ్యతరగతిలో అంతరాన్ని తెలుపుతున్నాయి. జార్ఖండ్, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో సంపన్నుల సంఖ్య పెరుగుతోంది. ఆర్ధికంగా బలంగా ఉన్న రాష్ట్రంగా పేరున్న గుజరాత్ మాత్రం ఈ విషయంలో వెనుకబడిపోతోంది.