డిస్కంల ప్రైవేటీకరణకు సీఎం రేవంత్ రెడ్డి కుట్ర : కవిత

రైతు డిస్కంను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి..మిగతా రెండు డిస్కంలను ప్రైవేటీకరణ చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నట్లుగా అనుమానాలున్నాయని, దీనిపై సీఎం స్పష్టతనివ్వాలని టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు.

విధాత, హైదరాబాద్ : రైతు డిస్కంను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి..మిగతా రెండు డిస్కంలను ప్రైవేటీకరణ చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నట్లుగా అనుమానాలున్నాయని, దీనిపై సీఎం స్పష్టతనివ్వాలని టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. రైతు డిస్కం గురించి ఆరు నెలల పాటు సీక్రెట్ గా ఉంచిన తర్వాత నిన్న చిట్ చాట్ లో సీఎం రేవంత్ దాని గురించి మాట్లాడారని గుర్తు చేశారు.

24 గంటల కరెంట్ ఎత్తివేయం, మోటార్లకు మీటర్ లు పెట్టం అని రేవంత్ చెబుతున్నారని, అలా చేస్తే ఎన్నికలకే వెళ్లమని అంటున్నారని, కానీ ఈ మాటను ఆయన ప్రెస్ మీట్ ద్వారా చెప్పాలని..లేదంటే తర్వాత నేను అనలేదని మాట మార్చుతారన్నారు. బహిరంగ సభల్లో ఇచ్చిన మాటలు తప్పిన సీఎం రేవంత్ రెడ్డికి ఇది ఒక లెక్క కాదు అన్నారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా, సన్నల బోనస్, ధాన్యం కొనుగోలు, రైతు బీమా, ఆరు గ్యారంటీలు, ఎన్నికల హామీలపై మాయమాటలతో ధాటవేస్తున్న రేవంత్ రెడ్డి మాటలు నమ్మడం కష్టం అన్నారు.

నేనే రేవంత్ రెడ్డికి నేరుగా సవాల్ చేస్తున్నానని…రైతు డిస్కం ఏర్పాటు చేసి మిగతా రెండు డిస్కంలను ప్రైవేట్ పరం చేస్తే ఎన్నికల్లో ప్రజలను ఓట్లు అడగబోమని ప్రజలకు స్పష్టతనివ్వాలని కవిత డిమాండ్ చేశారు.
ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ బిల్లును తిరిగి తీసుకొచ్చేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర చేస్తున్నాయని కవిత ఆరోపించారు. రైతు డిస్కం వల్ల తెలంగాణ రైతుకు నష్టం జరుగుతుందని, దీనిపై న్యాయపోరాటం ప్రారంభించామని తెలిపారు. ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ అన్ని జిల్లాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజాభిప్రాయం తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

హైడ్రాకు నేను ఆరు ఫిర్యాదులు చేస్తే ఒక్కదానిపై చర్యలు తీసుకోలేదని కవిత ఆరోపించారు. సీఎం రేవంత్ ఇంటికి దగ్గరలోనే ఉన్న ప్రభుత్వ పాఠశాలలలో మౌలిక వసతులు లేవు అని కవిత, విద్యాశాఖ పర్యవేక్షిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి పాఠశాలలు, కళాశాలలు, హాస్టల్స్ సమస్యలు పరిష్కరించాలని కోరారు.

Latest News