ఖైరతాబాద్ గణేశుడికి గవర్నర్ దంపతుల తొలి పూజలు

దేశ వ్యాప్తంగా వినాయక చవితి పర్వదినం వేడుకలు వైభవోపేతంగా ప్రారంభమయ్యాయి. తెలుగు రాష్ట్రాలలో వాడవాడల...ఇంటింటా వినాయకుడి నవరాత్రి పూజల సందడి కొనసాగుతుంది. ప్రఖ్యాత ఖైరతాబాద్‌లో వినాయక చవితి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 69 అడుగుల ఎత్తులో కొలువుదీరిన పంచముఖ సంకటహర మహాగణపతిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు.

విధాత, హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా వినాయక చవితి పర్వదినం వేడుకలు వైభవోపేతంగా ప్రారంభమయ్యాయి. తెలుగు రాష్ట్రాలలో వాడవాడల…ఇంటింటా వినాయకుడి నవరాత్రి పూజల సందడి కొనసాగుతుంది. రకరకాల ఆకృతులలో కొలువుతీరిన గణనాధులతో వినాయక మండపాలను సర్వంగా సుందరంగా ముస్తాబు చేశారు.

తెలంగాణలో ప్రఖ్యాత ఖైరతాబాద్‌లో వినాయక చవితి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 69 అడుగుల ఎత్తులో కొలువుదీరిన పంచముఖ సంకటహర మహాగణపతిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. ఈ గణపతికి సంబంధించిన అద్భుతమైన డ్రోన్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఖైరతాబాద్ విఘ్నేశ్వరుడికి తొలి పూజను తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా దంపతులు నిర్వహించారు. మంత్రి పొన్నం ప్రభాకర్, స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ సహా పలు పార్టీలు ప్రముఖులు ఖైరతాబాద్ గణపయ్యను దర్శించుకున్నారు.

హైదరాబాద్ మహానగరంలో ఎన్ని వినాయక విగ్రహాలు ప్రతిష్టించినా ఖైరతాబాద్ వినాయకుడి విశిష్టత, వైభవం ప్రత్యేకమైనవిగా నిలుస్తాయి. 1954లో ఒక అడుగు ఎత్తు విగ్రహంతో మొదలుపెట్టిన ఖైరతాబాద్ మహాగణేశుడి ఉత్సవాలు 60ఏళ్ళు వరకు ఒక్కో అడుగు పెంచుతూ క్రమంగా పెరుగుతూ 70 అడుగుల వరకు చేరింది. ఈ ఏడాది ఖైరతాబాద్ మహా గణపతి 72వ సంవత్సరంలోకి అడుగుపెట్టడం విశేషం. ఒక్క అడుగు ఎత్తుతో ప్రారంభమైన ఈ గణేశుడి విగ్రహం ఎత్తును.. కరోనా మహమ్మారి తదనంతర పరిణామాల నేపథ్యంలో 2014 నుండి ఒక్కో అడుగు తగ్గిస్తూ వస్తున్నారు.

పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తూ గత కొన్నేళ్లుగా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి పూర్తి మట్టితోనే ఈ భారీ విగ్రహాన్ని రూపొందిస్తుండటం గమనార్హం. ఈసారి ఖైరతాబాద్‌లో 69 అడుగుల భారీ ఎత్తులో “పంచముఖ సంకటహర మహాగణపతి”గా బడా గణేష్ కొలువుదీరాడు. ఈ ఏడాది బడా గణేష్ తో పాటు కాళీమాత, సోమనాథ్ జ్యోతిర్లింగం, విశ్వ కర్మ, విష్ణుమూర్తి విగ్రహాలు కూడా ఏర్పాటు చేశారు.

ఖైరతాబాద్ బడాగణేశుడి మండపం వద్ద నవరాత్రి వేడుకలకు ప్రభుత్వం తరపున పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది. మండపం దగ్గర భక్తుల కోసం నలువైపులా క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.  ఒక్కో రోజు లక్ష మంది భక్తులు దర్శించుకునేలా అధికారులు, ఖైరతాబాద్ ఉత్సవ సమితి ఏర్పాట్లు చేసింది.

 

Latest News