మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు హిడ్మాకు తల్లి విజ్ఞప్తి
మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ నేత హిడ్మా తల్లి జనజీవన స్రవంతిలో కలవాలని లొంగిపోవాలని కొడుకుకు కన్నీళ్లతో విజ్ఞప్తి చేసింది. దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శిగా పీఎల్‌జీఏ కమాండర్‌గా ఉన్న హిడ్మా, భద్రతా బలగాలకు చిక్కడం లేదు.
విధాత : జనజీవన స్రవంతిలో కలవాలని కోరుతూ మోస్ట్ వాంటెట్ మావోయిస్టు హిడ్మాకు తల్లి విజ్ఞప్తి చేసింది. కొడుకు కోసం కన్నీళ్లతో ఎదురుచూస్తున్న హిడ్మా తల్లి..“నీవు ఎక్కడ ఉన్నా ఇంటికి రా బిడ్డ ప్రజలతో కలిసి ఉంటూ కష్టపడి పని చేసి జీవనం సాగిద్దాం అంటూ పిలుపునిచ్చింది. పోలీసులు ఏర్పాటు చేసిన సమావేశంలో హిడ్మా తల్లి మీడియాతో మాట్లాడుతూ తన కొడుకు లొంగిపోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే హిడ్మా కుమార్తె వంజెం కేషా అలియాస్ జిన్నీ వరంగల్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. కేషా భర్త రమేష్ ను 2020లో మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శిగా, కేంద్ర కమిటీ సభ్యుడిగా, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పీఎల్‌జీఏ) ప్లాటూన్-1 కమాండర్‌గా ఉన్న హిడ్మా కొన్నేళ్లుగా భద్రతా బలగాలకు చిక్కడు దొరకడుగా మారి ముప్పుతిప్పలు పెడుతున్నాడు. చత్తీస్ గఢ్ మావోయిస్టుల్లో 80శాతంగా ఉన్న గొండు వర్గం నుంచి పార్టీ కేంద్ర కమిటీలో తొలి సభ్యుడిగా, మిలటరీ అపరేషన్ స్పెషలిస్టుగా హిడ్మాకు ప్రాధాన్యత ఉంది.
హిడ్మా టీమ్ టార్గెట్ గా స్పెషల్ ఆపరేషన్ షురు
హిడ్మా టీమ్ టార్గెట్ గా చత్తీస్ గడ్ భద్రతా బలగాలు ఆపరేషన్ ముమ్మరం చేశాయి. ఏప్రిల్, మేనెలలో కర్రెగుట్టలలో జరిగిన ఆపరేషన్ నుంచి తప్పించుకున్న హిడ్మా టీమ్ సహా, దేవ, ఎర్ర, కేసా నాయకత్వంలోని గెరిల్లా దళాలను లక్ష్యంగా చేసుకుని స్పెషల్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. చత్తీస్ గఢ్ లోని బీజాపూర్, దంతెవాడ, సుక్మా జిల్లాల పరిధిలో అబూజ్ మడ్ అడవుల్లో ఈ ఆపరేషన్ కొనసాగుతుంది. కేంద్ర, రాష్ట్ర భద్రతా బలగాలు, డీఆర్ జీ బలగాలతో సంయుక్తంగా హిడ్మా సహా మావోయిస్తు అగ్రనాయకత్వం ఉన్న ప్రాంతాల వైపుగా ముందడుగు వేస్తున్నాయి. హెలికాప్టర్లు, డ్రోన్లు సహా అధునిక టెక్నాలాజీతో వేట కొనసాగిస్తున్నారు ఈ నేపథ్యంలో తన కొడుకు లొంగిపోవాలంటూ హిడ్మా తల్లితో పోలీసులు పిలుపునిప్పించడం విశేషం.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram