Godavari Pulasa| అదృష్టం..పులస చేపలతో చిక్కింది..ఒకటి 22వేలకుపైనే..!

Godavari Pulasa| అదృష్టం..పులస చేపలతో చిక్కింది..ఒకటి 22వేలకుపైనే..!

అమరావతి: గోదావరి(Godavari) వరదలలో చేపల వేటకు వెలుతున్న మత్స్యకారులకు పులస చేప(Pulasa Fishes)ల రూపంలో అదృష్టం(Luck) దొరుకుతుంది. యానాం గౌతమి గోదావరికి ఎర్ర నీరు పోటెత్తిన సమయంలో మత్స్యకారుల వలలకు పులస చేపలు చిక్కుతున్నాయి. తాజాగా యానాంలో వేటకు వెళ్లిన మత్స్యకారులకు సుమారు రెండు కేజీల బరువున్న పులస చేప చిక్కింది. యానాం బీచ్ వద్ద మార్కెట్ లో పులస చేపను వేలం పాట వేయగా..వేలంపాటలో అక్షరాలా రూ.22,000కు ధర పలికింది. మల్లాడి ప్రసాద్ అనే మత్స్యకారుడి వలకు చిక్కిన ఈ పులసను పొన్నమండ రత్నం అనే మహిళ వేలం పాటలో కొనుగోలు చేసింది.

చిత్రంగా గత ఏడాది కూడా మల్లాడి ప్రసాద్ కు చిక్కిన పులస వేలంలో రూ.23వేలకు అమ్ముడిపోయిందట. మొత్తానికి గోదావరికి ప్రసాద్ కు మధ్య మంచి పులస బంధం కొనసాగుతుంది. వర్షాకాలంలో సముద్రం నుంచి గోదావరి నదిలోకి ప్రవేశించే పులస చేపకు భారీగా డిమాండ్ ఉంటుంది. పులసలు వర్షకాలంలో గోదావరిలోకి వచ్చి సంతానోత్పత్తి తర్వాత తిరిగి సముద్రంలోకి వెళ్లిపోతుంటాయి. సముద్రంలో ఉన్న సమయంలో దీన్ని ‘విలస’ అంటారు… గోదావరిలోకి ప్రవేశించినప్పుడు ‘పులస’ అని పిలుస్తుంటారు. ఆరోగ్యానికి, రోగాల నివారణకు పులస చేపను తినడం మంచిదని నమ్ముతుంటారు. అందుకే పులస కోసం అంతగా ఎగబడుతుంటారు.