Special Intensive Revision | ‘సర్’ను చూసి భయపడుతున్న సెక్స్ వర్కర్లు.. ఎక్కడ? ఎందుకు?
వాళ్లకు నా అనేవాళ్లు ఉండరు! ఎక్కడ పుట్టారో.. నిరూపించుకునే అవకాశం ఉండదు! బర్త్ సర్టిఫికెట్లు, ఇంటి అడ్రస్‌ల ధృవీకరణ పత్రాలు దొరికే అవకాశం లేదు. వారే సెక్స్ వర్కర్లు. ఇప్పుడు బెంగాల్‌లో చేపట్టిన ఓటర్ల స్పెషల్ ఇన్‌టెన్సివ్ రివిజన్.. వారిలో భయాన్ని కలిగిస్తున్నది. తమ ఓట్లు నమోదు కావేమోనన్న ఆందోళన వెంటాడుతున్నది.
Special Intensive Revision | దేశ వ్యాప్తంగా ఓటర్ జాబితా సవరణ, ఓటర్ల అర్హతను ధృవీకరించడం కోసం భారత ఎన్నికల సంఘం(ఈసీఐ) స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్) ప్రక్రియను ప్రారంభించింది. ఓటర్ల జాబితా సమగ్రంగా ఉండడంతో పాటు ఖచ్చితత్వం కోసం ఈ ప్రక్రియ చేపట్టారు. ఇప్పటికే ఓటర్ల సవరణ జాబితాను బీహార్ లో విజయవంతంగా పూర్తి చేసిన ఈసీ రెండో విడతలో 12 రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియను చేపట్టాలని నిర్ణయించింది. ఈ క్రమంలో ఇప్పటికే బెంగాల్‌లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ ప్రారంభం అయిన విషయం తెలిసిందే. దీనిని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో బెంగాల్ లో ఎస్ఐఆర్ నిర్వహణపై నిరసనలు మొదలయ్యాయి.
అయితే, సెక్స్ వర్కర్లకు కూడా ఎస్ఐఆర్ భయం పట్టుకుంది. ఈసీ అధికారులు ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలు సేకరించడం ప్రారంభించడంతో సోనాగచిలో నివసించే వేశ్య మహిళల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. పుట్టింటి రికార్డులు, చిరునామా ధృవపత్రాలు, తల్లిదండ్రుల వివరాలు లేకపోవడం వల్ల తమ పేర్లు ఓటర్ల జాబితా నుంచి తొలగించబడతాయేమోనని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆసియాలోనే అతిపెద్ద వ్యభిచార ప్రాంతం అయిన సోనాగచిలో దాదాపు 7 వేల మంది మహిళలు వేశ్య వృత్తిపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు. వీరిలో చాలా మంది భారతీయులే అయినా, కొందరు నేపాల్, బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన వారు ఉన్నారు. ఎన్నో దశాబ్దాల క్రితమే జీవనోపాధి కోసం ఇళ్లు విడిచి వచ్చిన మహిళలు తమ కుటుంబాలతో సంబంధాలు కోల్పోయారు.
దీంతో అవసరమైన పత్రాలు సమర్పించడం వారికి దాదాపు అసాధ్యంగా మారింది. ఈ నేపథ్యంలో సెక్స్ వర్కర్లకు సంబంధించిన ఈ సమస్యలను దుర్బార్ మహిళ సమన్వయం కమిటీ, ఆల్ ఇండియా నెట్‌వర్క్ ఫర్ సెక్స్ వర్కర్స్ వంటి సంస్థలు ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయం తీసుకున్నాయి. 2002 తర్వాత కొందరు వేశ్యవృత్తి చేస్తున్న మహిళలు ఓటు హక్కు పొందినప్పటికీ, స్థిర నివాసం లేకపోవడం, తరచూ మకాం మార్చడం వంటి కారణాల వల్ల మరెందరో ఆ జాబితాలో చేరలేకపోయారని ఆ సంస్థలు పేర్కొంటున్నాయి. ‘తమ గ్రామాలు విడిచి ఇక్కడికి వచ్చిన మహిళలు తిరిగి స్వగ్రామానికి వెళ్ళే పరిస్థితి ఉండదు. వాళ్లు ఇక ఇక్కడే ఉంటారు. కుటుంబ సంబంధాలు లేకపోవడంతో తల్లిదండ్రుల ఓటర్ లిస్టులు సేకరించడం అసాధ్యం. ఇక్కడ ఏళ్లుగా ఉంటున్నవారిని కేవలం పత్రాలు లేవనే కారణంతో ఓటర్ జాబితా నుంచి తొలగించడం సరైంది కాదు’ అని ది ఆల్ ఇండియా నెట్‌వర్క్ ఫర్ సెక్స్ వర్కర్స్ కోర్ కమిటీ మెంబర్ భారతీ దే చెప్పారు. అలాగే, ఎన్నికల సంఘం ఈ అంశంపై స్పందించి సరైన చర్యలు చేపట్టాలని ఎన్జీవో సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram