Political funding Scham | పొలిటికల్ ఫండింగ్.. కొత్త ట్రెండ్!  సోదిలో లేని పార్టీలకు వేల కోట్ల విరాళాలు!

Political funding Scham | పొలిటికల్ ఫండింగ్.. కొత్త ట్రెండ్!  సోదిలో లేని పార్టీలకు వేల కోట్ల విరాళాలు!

Political funding Scham | హిందీ పత్రిక దైనిక్‌ భాస్కర్‌ సంచలన విషయాలు బయటపెట్టింది. గుజరాత్‌లోని పది చిన్నాచితక పార్టీలు ఏకంగా 4,300 కోట్ల విరాళాలు పొందాయని తేల్చింది. ఈ విరాళాలన్నీ ఆ పార్టీలకు 2019–2020, 2023–2024 సంవత్సరాల మధ్య అందాయి. పోనీ ఇవేమైనా ప్రభావవంతమైన పార్టీలా? అంత పెద్ద మొత్తంలో విరాళాలు పొందాయని అనుకునేందుకు? కాదు.. రాష్ట్రవ్యాప్తంగా ఈ పది పార్టీలు 43 మంది అభ్యర్థులను నిలిపితే.. అందరికీ కలిపి వచ్చిన ఓట్లు 54,069 ఓట్లు మాత్రమే. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. అధికారికంగా 39 లక్షలు ఖర్చు చేస్తే.. 3500 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు ఆడిట్‌ రిపోర్టులు పేర్కొంటున్నాయి. దీంతో ఇందులో భారీ మనీలాండరింగ్‌ కోణం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఎలక్టోరల్‌ బాండ్స్‌ పేరిట బీజేపీ, కొన్ని రాష్ట్రాల్లోని అధికార పార్టీలు ఇబ్బడిముబ్బడిగా విరాళాలు అందుకోవడం సంచలనం రేపిన విషయం తెలిసిందే. భారీ స్థాయిలో విరాళాలు ఇచ్చిన కంపెనీలన్నీ ఆయా ప్రభుత్వాల నుంచి భారీ కాంట్రాక్టులు అందుకున్నవో, లేక వివిధ కేసులలో ఇరుకున్నవో కావడం తీవ్ర చర్చలకు దారి తీసింది. ఎలక్టోరల్‌ బాండ్ల పూర్తి వివరాలు బయటపెట్టాలని లోక్‌సభ ఎన్నిలకు ముందు ఎస్‌బీఐని సుప్రీంకోర్టు ఆదేశిస్తే.. వాటిని బయటకు వెల్లడించడానికి ఎస్‌బీఐ ఎన్ని సాకులు చెప్పిందో కూడా చూశాం. చివరకు ఆ వివరాలు బయటపెట్టక తప్పలేదు. ఇదంతా క్విడ్‌ ప్రో కో లో భాగంగానే జరిగిందన్న అభిప్రాయాలు బలంగా ఉన్నాయి.

తాజాగా కాంగ్రెస్‌ నేత రాహుల్ గాంధీ గత ఎన్నికల్లో కాంగ్రెస్‌, ఎన్నికల సంఘం కుమ్మక్కయి ఓట్ల చోరీకి పాల్పడ్డాయంటూ కర్ణాటకలోని మహదేవపురలో జరిగిన తతంగాన్ని విడమర్చి చెప్పిన విషయం తెలిసిందే. దీనిని గుజరాత్‌ నమూనాగా ఆయన అభివర్ణిస్తున్నారు. తాజాగా విరాళాల విషయంలో గుజరాత్‌ కొత్త మోడల్‌గా దీనిని రాజకీయవర్గాల అభివర్ణిస్తున్నాయి.

గుజరాత్‌లో 1995 నుంచి బీజేపీ అధికారంలో ఉన్నది. నరేంద్రమోదీ ప్రభావవంతమైన నేతగా ఇక్కడి నుంచే ప్రధాని అయ్యారు. తరచూ మోదీ గుజరాత్‌ మోడల్‌ అని చెబుతూ ఉంటారు. ఇక్కడ రాజకీయ నిధుల అంశంలో పారదర్శకత లేదనే విమర్శలు ఉన్నాయి. ప్రతిపక్షాన్ని బలహీనపర్చేందుకు బీజేపీ ప్రభుత్వం వివిధ మార్గాలను ఎంచుకుంటున్నదనే ఆరోపణల మధ్య సోదిలోని పార్టీలకు వేల కోట్లు విరాళాలు అందిన విషయం రాజకీయంగా సంచలనం రేపుతున్నది.

ఈ కథనం ప్రకారం.. ఎల్‌ఎస్‌పీ అనే పార్టీకి 1045వేల కోట్లకుపైగా నిధులు విరాళంగా అందాయి. బీఎన్‌జేడీకి 962 కోట్లు, ఎస్‌ఏపీకి 663 కోట్లు, ఎన్‌ఐయూపీకి 608 కోట్లు విరాళాలుగా వచ్చాయి. అదే సమయంలో ఎల్‌ఎస్‌పీ 1031 కోట్లు, బీఎన్‌జేడీ 961 కోట్లు, ఎస్‌ఏపీ 467 కోట్లు, ఎన్‌ఐయూపీ 416 కోట్లు ఖర్చు చేసినట్టు ఆడిట్‌ రిపోర్ట్‌లో వెలుగు చూసింది. కానీ.. అవి వాస్తవానికి ఖర్చు చేసిన మొత్తాలు 34 లక్షల మేరకే ఉండటం గమనార్హం. వీటిని గమనిస్తుంటే ఇదొక పెద్ద కుంభకోణం అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అధికారికంగా ఒక్కో ఎన్నికకు 34 లక్షలు ఖర్చు చేస్తే ఇన్ని వేల కోట్లు ఏ పార్టీకి చేరాయన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరో కీలక అంశం ఏమిటంటే.. ఈ అన్ని పార్టీలు ఎన్నికల సంఘానికి సమర్పించిన ఖర్చు లెక్క 352 కోట్లే ఉంది. సోదిలో లేని పది పార్టీలు ఇంత మొత్తం ఎన్నికల ప్రచారానికి, ఇతర అవసరాలకు ఖర్చుపెట్టాయంటే నమ్మశక్యంగా లేదని పరిశీలకులు అంటున్నారు. ఆ మిగిలిన మొత్తాలు ఎక్కడికి పోయాయని ప్రశ్నిస్తున్నారు. దేశంలో 29 పార్టీలు ఉంటే.. ఎక్కడా లేని విధంగా గుజరాత్‌లోనే ఈ పరిస్థితి ఎందుకు ఉంది? ఇది గుజరాత్‌ ‘కొత్త’ నమూనా అనుకోవాలా? అన్న ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. ఇంత జరుగుతుంటే ఎన్నికల సంఘం ఇన్నేళ్లుగా ఎందుకు కళ్లు మూసుకుందని ప్రశ్నిస్తున్నారు. ఇది మరో ఓటు చోరీ తరహా కుంభకోణమా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ఎన్నికల సంఘం విచారణ జరపాలి : రాహుల్‌ గాంధీ

గుజరాత్‌లో గుర్తు తెలియని, సోదిలో లేని పది పార్టీలకు 4300 కోట్ల విరాళాలు అందిన వ్యవహారంలో విచారణ జరపాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కాంగ్రెస్‌ నేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌ గాంధీ బుధవారం (ఆగస్ట్‌ 27, 2025) డిమాండ్‌ చేశారు. లేక దీనిపైనా అఫిడవిట్‌ కోరుతారా? అని సెటైర్‌ వేశారు. ఈ మేరకు పత్రికల్లో వచ్చిన కథనాన్ని తన ఎక్స్‌ ఖాతాలో షేర్‌ చేశారు. ‘గుజరాత్‌లో కొన్ని గుర్తు తెలియని పార్టీలు ఉన్నాయి. వాటి పేర్లను కూడా ఎవ్వరూ విని ఉండలేదు. కానీ.. వాటికి 4,300 కోట్ల రూపాయల విరాళాలు వచ్చాయి’ అని రాహుల్‌ రాశారు. ‘వీటికి అంత పెద్ద మొత్తంలో విరాళలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరు ఈ పార్టీలను నడుపుతున్నారు? ఈ సొమ్ము అంతా ఎక్కడికి పోతున్నది? ఎన్నికల సంఘం విచారణ చేస్తుందా? లేక దీనిపైనా అఫిడవిట్‌ కోరుతుందా? లేదంటే మొత్తంగా ఎన్నికల చట్టాన్నే మార్చేస్తారా? అలా చేయడం ద్వారా ఈ డాటా ఎవరికీ కనిపించకుండా దాచి పెడతారా?’ అని రాహుల్‌ గాంధీ హిందీలో ప్రశ్నించారు.