సెప్టెంబర్ 7 నుంచి తెలంగాణ శాసనసభ సమావేశాలు

తెలంగాణ మూడవ శాసన సభ 8వ సమావేశాలలో భాగంగా రెండో విడత సమావేశాలు సెప్టెంబర్ 7 నుంచి నిర్వహించనున్నారు. సమావేశాల నిర్వహణ సమాచారాన్ని శాసన సభ్యులందరికి అందించామని, ఈ నెల 7నుంచి జరిగే సమావేశాలకు శాసనసభ సభ్యులందరూ హాజరు కావాలని శాసనసభ కార్యదర్శి రెండ్ల తిరుపతి కోరారు.

విధాత, హైదరాబాద్ : తెలంగాణ మూడవ శాసన సభ 8వ సమావేశాలలో భాగంగా రెండో విడత సమావేశాలు సెప్టెంబర్ 7 నుంచి నిర్వహించనున్నారు. సమావేశాల నిర్వహణ సమాచారాన్ని శాసన సభ్యులందరికి అందించామని, ఈ నెల 7నుంచి జరిగే సమావేశాలకు శాసనసభ సభ్యులందరూ హాజరు కావాలని శాసనసభ కార్యదర్శి రెండ్ల తిరుపతి కోరారు. సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలన్న అంశాన్ని బీఏసీలో నిర్ణయించనున్నారు.

హాట్ హాట్ గా సాగనున్న సమావేశాలు…

రాష్ట్రంలో కొన్ని రోజులుగా  22-ఏ నిషేధిత భూముల పంచాయతీ, ఇంకోవైపు కృష్ణా,గోదావరి నీటి హక్కుల వివాదాలు, పెండింగ్ ప్రాజెక్టుల అంశాలు, జీవో 97 రద్దుకు  పాలిటెక్నిక్ విద్యార్ధుల ఆందోళనలు, ఫీజు రీయంబర్స్మెంట్ బకాయిలపై నిరసనలు, ఉద్యోగుల పెండింగ్ డిమాండ్ల పరిష్కారం, రైతు, నిరుద్యోగ సమస్యలు వంటి అంశాలపై ప్రతిపక్షాలు, అధికార పక్షం మధ్య  విమర్శల పర్వం కొనసాగుతున్న సంగతి తెలిసిందే.  ఈ నేపథ్యంలో ఆయా అంశాలపై రానున్న శాసన సభ సమావేశాలలో వాడివేడి చర్చలు కొనసాగే అవకాశం కనిపిస్తుంది.

వాటితో పాటు  ఎలినినో, కాళేశ్వరం ఎత్తిపోతల వినియోగం వివాదం,  హ్యామ్ రోడ్లు, అమృత్ టెండర్ల వివాదాలు, సింగరేణి నిల్వల మాయం, సీఎం రేవంత్ రెడ్డి, పొంగులేటి కుటుంబ సభ్యులకు భూ కేటాయింపులు వంటి అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. సీఎం రేవంత్ రెడ్డి అమెరికా టూర్ రద్దు వ్యవహారం, సర్ ప్రక్రియ అంశాలు  కూడా సమావేశాలలో చర్చకు రావచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వాన్ని ఆయా అంశాలపై నిలదీసేందుకు ప్రతిపక్షాలు..ప్రభుత్వంపై ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టడంపై పాలక పక్షం అన్ని అస్త్రశస్త్రాలతో సిద్దమవుతుండటంతో ఈ సమావేశాలు ఆసక్తికరంగా సాగడం ఖాయంగా కనిపిస్తుంది.

మరో వైపు ప్రభుత్వం లోక్‌సభ, శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల కనీస వయసును 25 ఏళ్ల నుంచి 21 ఏళ్లకు తగ్గించాలని కేంద్రాన్ని కోరతూ సభలో తీర్మానం చేయవచ్చని తెలుస్తుంది. చట్టసభల్లో యువతకు మరింత ప్రాతినిధ్యం కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ మార్పును ప్రతిపాదిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలోనే పేర్కొన్నారు.

Latest News