CM Revanth Reddy | తుమ్మిడిహట్టి, సుందిళ్ల ప్రాజెక్టులపై సీఎం సమీక్ష.. అధికారులకు కీలక సూచనలు
తుమ్మిడిహట్టి వద్ద చేపట్టాల్సిన ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి మంగళవారం రాష్ట్ర సచివాలయంలో నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
విధాత, హైదరాబాద్ :
తుమ్మిడిహట్టి వద్ద చేపట్టాల్సిన ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి మంగళవారం రాష్ట్ర సచివాలయంలో నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. తుమ్మిడిహట్టి నుంచి సుందిళ్ల వరకు 80 టీఎంసీల నీటిని తరలించేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సాగు నీరు, తాగు నీరు అందించేందుకు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. ఇందుకు పాత పనులను ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్లేందుకు అంచనాలను తయారు చేయాలన్నారు. సుందిళ్ల ప్రాజెక్టును రిపేరు చేసి వినియోగంలోకి తీసుకురావాలని, దీని ద్వారా శ్రీపాద ఎల్లంపల్లికి నీటిని తెచ్చేందుకు అవసరమైన ప్రణాళికలు, అంచనాలు సిద్ధం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.
కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ లేఖపై చర్చ..
అలాగే, కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ కు సీఎం రేవంత్ రెడ్డి రాసిన లేఖపై సమీక్షలో ఉన్నతాధికారులతో చర్చించారు. ఇటీవల ముఖ్యమంత్రి కేంద్ర మంత్రికి రాసిన లేఖలోని అంశాలను అధికారులకు వివరించారు. వీటిపై ఏ విధంగా ముందుకెళ్లాలనే అంశంపై అధికారులకు సీఎం పలు సూచనలు చేశారు. లేఖలో పేర్కొన్న ప్రాజెక్టులకు సంబంధించి.. ప్రాజెక్టువారీగా అనాలసిస్ చేసి పూర్తిస్థాయి నివేదికలను తయారు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని డ్యామ్ లపై స్టేటస్ రిపోర్ట్ తయారు చేయాలని సీఎం అజ్ఞాపించారు. వీటితో పాటు సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ బ్యారేజీల పరిస్థితిపైనా సీఎం సమీక్షలో చర్చించారు. బ్యారేజీల రిపేర్లకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని, ఇందుకు సంబధిత ఏజెన్సీలే బాధ్యత వహించేలా చూడాలని అధికారులకు సూచించారు. ప్రాజెక్టులవారీగా పూర్తిస్థాయి నివేదికల ఆధారంగా తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై నవంబర్ రెండో వారంలో మరోసారి సమీక్ష సమావేశం నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఈ సమావేశానికి సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి, సెక్రటరీ మాణిక్ రాజ్, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram