పరిహారం ప్రకటిస్తే భూములు ఇస్తం!..పెట్రోల్ డబ్బాలతో చెరువు కట్ట‌పై బైఠాయింపు

కొడంగల్ లిఫ్ట్ పనులకు వదలని అడ్డంకులు..భూముల సర్వే‌ను అడ్డుకున్న కానుకుర్తి రైతులు ఎకరాకు 40 లక్షలిస్తేనే సర్వేకు ఒప్పుకుంటాం సర్వే చేయకుండానే వెనుతిరిగిన అధికారులు ప్రభుత్వానికి తలనొప్పి మారిన ప్రాజెక్టు పనులు

  • By: TAAZ |    telangana |    Published on : Aug 30, 2025 11:30 AM IST
పరిహారం ప్రకటిస్తే భూములు ఇస్తం!..పెట్రోల్ డబ్బాలతో చెరువు కట్ట‌పై బైఠాయింపు ఫోటో : కానుకుర్తి చెరువు వద్ద నిరసన తెలుపుతున్న రైతులు
  • కొడంగల్ లిఫ్ట్ పనులకు వదలని అడ్డంకులు
  • భూముల సర్వే‌ను అడ్డుకున్న కానుకుర్తి రైతులు
  • పెట్రోల్ డబ్బాలతో చెరువు కట్ట‌పై బైఠాయింపు
  • ఎకరాకు 40 లక్షలిస్తేనే సర్వేకు ఒప్పుకుంటాం
  • సర్వే చేయకుండానే వెనుతిరిగిన అధికారులు
  • ప్రభుత్వానికి తలనొప్పి మారిన ప్రాజెక్టు పనులు

విధాత, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ప్రతినిధి : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్ఠాత్మకంగా భావించిన నారాయణపేట– కొడంగల్ ఎత్తిపోతల పథకం పనులకు అడుగడుగునా అడ్డంకులే ఎదురవుతున్నాయి. ఈ ఎత్తిపోతల పథకంలో భాగంగా దామరగిద్ద మండలంలో కానుకుర్తి చెరువును జలాశయంగా మార్చాలని ప్రభుత్వం భావించింది. ఈ చెరువు పరిధిలో కొంత మేరకు రైతులు భూములు కోల్పోయే ప్రమాదం ఉంది. శుక్రవారం చెరువును సర్వే చేసేందుకు అధికారులు వచ్చారు. ఇది తెలుసుకున్న గ్రామ రైతులు చెరువు వద్దకు చేరుకుని సర్వే పనులను అడ్డుకున్నారు. సర్వే పనులు నిలిపివేయకపోతే ఆత్మహత్య చేసుకుంటామని అధికారులను హెచ్చరించారు. ముందుగానే పెట్రోల్, డీజిల్ డబ్బాలను తెచ్చుకున్నారు. సర్వే ఆపకుంటే పెట్రోల్ పోసుకుని అంటించుకుని ఆత్మహత్య చేసుకుంటామని భయపెట్టారు. పెట్రోల్ డబ్బాలతో చెరువు కట్ట పై రైతులు బైఠాయించారు. విషయం తెలుసుకున్న నారాయణ పేట అదనపు కలెక్టర్ కానుకుర్తి చెరువు వద్దకు వచ్చి రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. భూ పరిహారం ప్రకటించే వరకు ఎలాంటి సర్వే పనులు చేపట్టవద్దని రైతులు చెప్పారు. సర్వే చేసి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన తరువాత ప్రభుత్వం పరిహారం ప్రకటిస్తుందని అదనపు కలెక్టర్ చెప్పినా రైతులు వినలేదు. గతంలో ఎకరాకు రూ.20 లక్షలు ఇస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం ఆయన రైతులకు చెప్పారు. కాగా, ఎకరాకు రూ.40 లక్షలు ప్రకటిస్తేనే సర్వే పనులు చేయిస్తామని, ప్రభుత్వం ప్రకటించే దాకా సర్వే పనులు చేయనివ్వమని రైతులు కరాఖండిగా చెప్పడంతో అధికారులు సర్వే పనులు నిలిపి వేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఎత్తిపోతల నిర్మాణం ఇలా..
నారాయణపేట–కొడంగల్‌ ఎత్తిపోతల పథకాన్ని రెండు ప్యాకేజీలుగా విడగొట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని నారాయణపేట, కొడంగల్‌, మక్తల్‌ నియోజకవర్గాల్లోని 1.05 లక్షల ఎకరాలకు సాగునీటితో పాటు నారాయణపేట జిల్లాలో తాగునీటి అవసరాలు తీర్చడానికి వీలుగా రెండు దశల్లో ఈ ఎత్తిపోతల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముందుగా ఈ పథకం కింద ఉన్న చెరువుల నిల్వ సామర్థ్యాన్ని 0.9 టీఎంసీలతో ప్రతిపాదించగా తాజాగా నాలుగు టీఎంసీలకు పెంచారు. గత ఏడాది ఫిబ్రవరిలో సీఎం రేవంత్‌ రెడ్డి ఈ లిఫ్టు పనులకు శంకుస్థాపన చేశారు. బీమా ప్రాజెక్టు నుంచి వచ్చే నీటిని భూత్పూరు జలాశయం వరకు తరలిస్తారు. ఇక్కడి నుంచి కనుకుర్తి గ్రామం వరకు మూడు చోట్ల నీటిని లిఫ్ట్‌ చేయాలని, మొత్తం రెండు దశల్లో ఈ ప్రాజెక్టు చేపట్టేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఒకటో ప్యాకేజీని తొలి దశలో భూత్పురు జలాశయం నుంచి ఉట్కూరు చెరువు , రెండో ప్యాకేజీలో జయమ్మ చెరువుకు, అక్కడి నుంచి కానుకుర్తి గ్రామ చెరువు దాకా నీటిని పంపింగ్‌ చేయాలన్నదే ముఖ్య ఉదేశ్యం. దీని నిర్మాణం కోసం రూ.4,350 కోట్లుగా అంచనా వేశారు. పథకంలో మొత్తం 36 కిలోమీటర్ల మేర ప్రెషర్‌ మెయిన్‌లు (టన్నెల్‌కు బదులుగా పైపులు) వాడాలని నిర్ణయించారు. రాజీవ్‌ బీమా ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన భూత్పూరు జలాశయం నుంచి నీటిని తరలించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఈ పథకానికి 2024-25 బడ్జెట్‌లో రూ.610 కోట్లు కేటాయించారు. ఇదివరకే ఈ లిఫ్ట్ నిర్మాణం పనుల కోసం లైడార్ సర్వే పూర్తి అయింది. హెలికాప్టర్ ద్వారా నిర్వహించిన ఈ సర్వే లిఫ్ట్ ల ద్వారా నీటిని తీసుకునే స్థలం నుంచి చివరి పాయింట్ వరకు నీరు సరఫరా అయ్యే విధానాన్ని అధికారులు సమగ్ర సర్వే చేశారు.

పరిహారం కోసం రైతుల ఉద్యమం
కొడంగల్ లిఫ్ట్ నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు నష్ట పరిహారం విషయంలో ప్రభుత్వం క్లారిటీ ఇవ్వలేదు. ఎకరాకు రూ.14 లక్షలు ఇస్తామని ముందుగా ప్రకటించింది. ఇంత తక్కువ నష్ట పరిహారాన్ని అంగీకరించేది లేదంటూ రైతులు ఆందోళన బాట పట్టారు. ఈ ఏడాది సీఎం రేవంత్ రెడ్డి నారాయణ పేట నియోజకవర్గంలో పర్యటనకు వచ్చిన సమయంలో రైతుల ఆందోళనపై స్పందించారు. ఎకరాకు రూ.20 లక్షలు ఇస్తామని, రైతులను కడుపులో పెట్టుకుని చూసుకునే బాధ్యత తనదని హామీ ఇచ్చారు. అయితే, ఎకరాకు రూ.40 లక్షలు ఇస్తేనే భూములు ఇస్తామని రైతులు డిమాండ్ చేస్తున్నారు. కానీ ఇప్పటివరకు రైతుల డిమాండ్‌పై సర్కార్ స్పందించలేదు. దీంతో కొడంగల్ లిఫ్ట్ పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఇన్నేళ్లు గా లిఫ్ట్ పట్టిన గ్రహణం ఎప్పుడు వీడుతుందో అని ఈ మూడు నియోజకవర్గం ప్రజలు ఎదురు చూస్తున్నారు. వెంటనే నష్ట పరిహారం ప్రకటిస్తే ఈ ఎత్తిపోతల పనులు ముందుకు సాగే అవకాశం ఉంది.