Protests USA| అమెరికాను కుదిపేస్తున్న నో కింగ్స్ నినాదం… అసలేం జరుగుతోంది?

అమెరికాలో ఒక్కసారిగా లక్షల మంది వీధుల్లోకి దిగారు. “No Kings” అనే నినాదాలతో దేశవ్యాప్తంగా భారీ నిరసనలు చెలరేగాయి. ఇది సాధారణ నిరసన కాదు… అమెరికా రాజకీయ వ్యవస్థపై ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తికి సంకేతంగా మారింది. అసలు ఈ ఉద్యమం వెనుక ఏముంది? ప్రజలు ఎందుకు ఇంత ఆగ్రహంగా ఉన్నారు?

Reported by: Y.V. Narsimha Reddy | Latest News | Mar 29, 2026, 6:53 pm IST
Read Time: 4 mins
Protests USA| అమెరికాను కుదిపేస్తున్న నో కింగ్స్ నినాదం… అసలేం జరుగుతోంది?

విధాత : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కు వ్యతిరేకంగా ఆ దేశంలో భారీ నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. ‘లాభాల కోసం యుద్ధమా? మా సైనికులు అమ్మకానికి లేరు’ అంటూ ప్లకార్డులు పట్టుకుని లక్షలాది మంది రోడ్లపై భారీ ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ట్రంప్‌కు వ్యతిరేకంగా అమెరికాలోని 50 రాష్ట్రాల్లో 3 వేల చోట్ల భారీ ప్రదర్శనలు కొనసాగాయి. “నో కింగ్స్” నినాదాలతో 90 లక్షల మందికి పైగా ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేశారు. అమెరికాలో చరిత్రలోనే అతిపెద్ద నిరసనలుగా పేర్కొంటున్నారు.

ట్రంప్ పరిపాలనకు వ్యతిరేకంగా ఇంకా అమెరికాలో నిరసనలు కొనసాగుతున్నాయి. డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న యుద్ధ కాంక్ష, కఠిన వలస చట్టాలు, ఏకపక్ష నిర్ణయాలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ‘నో కింగ్స్’ నినాదం మారుమోగుతోంది. నిరసన ప్రదర్శనలకు అమెరికాలోని మిన్నెసోటా రాష్ట్రం ప్రధాన వేదికగా నిలిచింది. సెయింట్ పాల్‌లోని స్టేట్ క్యాపిటల్ ప్రాంగణంలో లక్షలాది మంది ప్రజలు నిరసన తెలిపారు.

న్యూయార్క్ వంటి మెట్రో నగరాలతో పాటు చిన్న పట్టణాల వరకు నిరసనలు విస్తరించాయి. కేవలం నగరాల నుండే కాకుండా.. రిపబ్లికన్ పార్టీకి పట్టున్న గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా 60 శాతానికి పైగా ప్రజలు ఈ ర్యాలీలకు మద్దతు తెలిపినట్లుగా సమాచారం. అటు ట్రంప్ వ్యతిరేక నిరసనలు అమెరికాలోనే కాకుండా లండన్, పారిస్, రోమ్ వంటి నగరాల్లో కూడా కొనసాగడటం విశేషం. రోమ్‌లో వేలాది మంది నిరసనకారులు ఇరాన్‌పై దాడులను ఆపాలని, యుద్ధం లేని ప్రపంచం కావాలని డిమాండ్ చేశారు. పారిస్‌లో.. అమెరికన్ పౌరులు, కార్మిక సంఘాలు కలిసి ట్రంప్ తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలకు వ్యతిరేకంగా బాస్టిల్ వద్ద ప్రదర్శన చేపట్టారు.

అయితే ట్రంప్ కు వ్యతిరేకంగా కొనసాగుతున్న నిరసనలను ప్రతిపక్షాల కుట్రగా వైట్ హౌస్ కొట్టిపారేసింది. ఇవన్ని ప్రజల మద్దతు లేని వామపక్ష ప్రేరేపిత నిరసనలుగా తీసిపారేసింది. ఇవన్నీ “లెఫ్టిస్ట్ ఫండింగ్ నెట్‌వర్క్” సృష్టించిన కృత్రిమ నిరసనలని, వీటికి ప్రజా మద్దతు లేదని వైట్ హౌస్ ప్రతినిధి అబిగైల్ జాక్సన్ వ్యాఖ్యానించారు.