BRSకు ఏమైంది! MLC ‘ఎన్నికల’కు ఎందుకు దూరం?

BRSకు ఏమైంది! MLC ‘ఎన్నికల’కు ఎందుకు దూరం?
  • బీఆర్‌ఎస్‌కు వరుస సవాళ్ళు

  • బీఆర్‌ఎస్‌‌పై కాంగ్రెస్, బీజేపీ రాజకీయ విమర్శ

  • ఎవరి ప్రయోజనాల కోసమనే ఆరోపణలు

  • స్పష్టతనివ్వడంలో బీఆరెస్ నేతల మౌనమెందుకు ?

  • మరో వైపు ఉప ఎన్నికకు సిద్ధమంటూ ప్రకటన

(రవి సంగోజు) విధాత ప్రత్యేక ప్రతినిధి: రజతోత్సవ సంబరాలకు సిద్ధమవుతున్న రాజకీయ పార్టీ బీఆరెఎస్ (BRS) .. పద్నాలుగేండ్ల సుదీర్ఘకాలం పోరాటం చేసిన ఉద్యమపార్టీ టీఆరెఎస్ (TRS). .పదేండ్లు అధికారం చెలాయించిన పార్టీ.. అదే ఊపులో ప్రాంతీయ పార్టీగా తెలంగాణ అస్థిత్వ పార్టీగా పురుడు పోసుకుని పెరిగి పెద్దై ప్రత్యేక రాష్ట్ర కలనూ.. అధికారాన్ని కైవసం చేసుకుని అప్రతిహతంగా ‘అభివృద్ధి’ సాగించిన పార్టీ. ప్రాంతీయం నుంచి దేశ రాజకీయాల్లో ‘ఛక్రం’ తిప్పేందుకు అంటిపెట్టుకున్న బంధాన్ని, అప్పటి వరకు ఉన్న సెంటిమెంటును ‘తెగదెంపులు’ చేసుకుని తెలంగాణ రాష్ట్ర సమితి ( టీఆరెస్) నుంచి భారత రాష్ట్ర సమితి (బీఆరెస్)గా రూపాంతరం చెందింది. పక్క రాష్ట్రంలో పాదులు వేసేందుకు అధికారంలో ఉన్నప్పుడే పావులు కదిపింది.

మూడవసారి ముచ్చటగా తమదే అధికారమని కలలుగన్న స్థితి నుంచి అధికారం కోల్పోయి రాష్ట్రంలో ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్ష పార్టీగా కొనసాగుతున్న పార్టీ.. ఎవరికెన్ని భిన్నాభిప్రాయాలున్నప్పటికీ రాష్ట్రంలో ప్రధానమైన రాజకీయ పార్టీగా కొనసాగుతున్న పార్టీ బీఆరెస్. ఎన్నికలనూ.. పోరాటాన్ని కలగలపి జమిలి ఉద్యమాన్ని కొనసాగించిన అనుభవం ఆ పార్టీకి స్వంతం. ఎన్నికలే ఎజెండాగా గులాబీ జెండాలెత్తి ఉప ఎన్నికల్లో మునిగితేలి ఉద్యమాన్నికొనసాగించిన పార్టీగా ప్రత్యేక గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. పార్టీ అధినేత కేసీఆర్ (KCR) కు ఎన్నికల వ్యూహాల్లో ఆరితేరిన వ్యక్తిగా ఆయనకు ఎక్కడలేని కీర్తి పతకాలూ.. కితాబులిచ్చిన విషయం మన కళ్ళ ముందటి విషయమే కావడం గమనార్హం. అలాంటి పార్టీ ఇప్పుడు రాష్ట్రంలో ఎన్నికలంటేనే వణికిపోయే పరిస్థితికి వచ్చింది. ఎన్నికల్లో పోటీకి వెనుకంజ వేస్తోందీ. ఈ వ్యవహారంలో సైతం స్పష్టమైన ప్రకటన చేయకుండా దొడ్డిదారి విధానాలను అనుసరిస్తుందనే విమర్శలను మూటగట్టుకుంటుందీ. రాజకీయ క్షేత్రంలో ‘విశ్వనీయత’ను తగ్గించుకుంటోందనే అభిప్రాయం వ్యక్తమవుతోందీ.

నేతలకు.. గడ్డుకాలం  

బీఆరెస్ పార్టీ వ్యవస్థాపక అధ్య-క్షుడిగా ఎన్నికల వ్యూహంలో ఆరితేరిన వ్యక్తిగా ప్రత్యేక గుర్తింపునూ , కీర్తి కిరిటాలను అందుకున్న నేతగా గుర్తింపు పొందిన కేసీఆర్, ఆ పార్టీ అధికారం కోల్పొయిన తర్వాత గడ్డుకాలాన్ని ఎదుర్కొంటోంది. ఉప ఎన్నికల విజయాల్లో ఛక్రం తిప్పిన నేతలుగా పేరొందిన ఆపార్టీ నాయకులు హరీష్ రావు (HARISH RAO), కేటీఆర్ (KTR) ఇప్పుడు విషమ పరిస్థితిని అనుభవిస్తున్నారు. ఒక్క ఓటమికే ఈ పార్టీ చతికిల పడిందా? అధికారం కోల్పోతే అంతే సంగతులా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పార్టీని, జాగృతిని ఏకకాలంలో రెండు భుజాలపై మోస్తున్న కేసీఆర్ కుమార్తె కవిత (KAVITHA) కూ ఈ పరిస్థితి నుంచి మినహాయింపేమీలేదు. పైకి ఎంత మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నా రాజకీయ క్షేత్రంలో బీఆరెస్ ఇప్పుడు సవాళ్ళను ఎదుర్కొంటుందనడంలో సందేహంలేదు. ఈ జాబితాలో నిత్యం అధికార కాంగ్రెస్ పై విమర్శనాస్త్రాలు, దాడిని ఎక్కుపెడుతున్న ఆ పార్టీ ద్వితీయ శ్రేణి ‘ముఖ్య’ నేతలకు తప్పడం లేదు. కళ్ళముందున్న ఎమ్మెల్సీ ఎన్నికల ఎజెండాను కాదని దాటవేత ధోరణి ప్రదర్శిస్తున్నారనే విమర్శ సాగుతోంది.

అసలు బీఆరెస్ నేతలకు ఏమైంది?

25 సంవత్సరాలలో తమదైన ‘చరిత్ర’నూ.. అనుభవాన్నీ.. ఆటుపోట్లనూ పోగేసుకున్న భారత రాష్ట్ర సమితికీ, ఆ పార్టీ ముఖ్యనేతలకు అసలిప్పుడేమైందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎన్నికల్లో అరితేరిన పార్టీకీ, నేతలకు ఇప్పుడు ఎన్నికలంటేనే ఎందుకు వణుకొస్తున్నది. రాజకీయ రంగంలో రోజువారీగా ఎదురవుతున్న ఈ ప్రశ్నలు తొక్కిపట్టి, రాజకీయ విమర్శలనూ, సవాళ్ళను క్షేత్రంలో ఉన్న కేటీఆర్, హరిష్ రావు, కవిత సమాధానం చెప్పకుండా వ్యవహరిస్తుండగా.. మిగిలిన నేతలు ముఖం చాటేస్తున్నారు. ఇక పార్టీ నేత, ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ పద్నాలుగు నెలలుగా కేవలం ఫాం హౌజ్ కే పరిమితం కావడం రాజకీయ చతురతగా అభివర్ణించుకోవడం ఆ పార్టీకి చెల్లుబాటు కావచ్చేమోగానీ? నిజమైన రాజకీయ విధానం మాత్రం కాదనే విమర్శలు ఇప్పటికీ వ్యక్తమవుతున్నాయి. చదువుకున్న వారు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి దూరంగా బీఆరెస్ ఉండడంలో ఏదో రాజకీయ ప్రయోజనం ఉందనే అపవాదును మూటగట్టుకోవాల్సి వస్తోంది. ఎవరి ప్రయోజనం కోసం ఈ దూరం పాటిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

అన్నీ.. ప్రత్యేక సందర్భాలుండవూ!

నిజమే రాజకీయాల్లో అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉండకపోవచ్చూ….ప్రత్యేక సందర్భాల్లో ఎన్నికల్లో పోటికీ దూరంగా ఉండాల్సి రావచ్చూ.. దీనికి అనేక కారణాలుంటాయీ.. పోటీకి ఆ పార్టీకి శక్తి లేకపోవడం, అభ్యర్ధులు లేక పోవడం, తాము పోటీ చేయడం వల్ల తమ ప్రత్యర్ధికి లాభం జరిగే సందర్భాలుంటాయి. ఇందులో చివరి అంశం తప్ప ప్రస్తుతం రాష్ట్రంలో బీఆరెస్ కు మిగిలిన అవకాశాలున్నాయి. ఇక ఎన్నికలన్న తర్వాత గెలుపోటములుంటాయి. ప్రతీ పార్టీ, వ్యక్తి గెలుపే లక్ష్యంగా పోటీలో ఉంటారు. ఇక ఎన్నికల గీటురాయిగా భావించే పార్టీలో ఎన్నికల్లో ఏ ఫలితాలొచ్చినా.. ఓటమి తప్పదనీ తెలిసి కూడా పోటీ చేయాల్సిన పరిస్థితి ఎదురవుతోందీ. కానీ, దీనికి భిన్నంగా బీఆరెస్ వ్యవహరిస్తుందనే విమర్శలున్నాయి.

ద్వంద వైఖరి ఎంత కాలం?

బీఆరెస్ నాయకులు తాజాగా ఎన్నికల అంశంలో ద్వంద వైఖరి అనుసరిస్తున్నారనే విమర్శలున్నాయి. ఈ సాకుతో ఎంత కాలం వెల్లదీస్తారనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఒక వైపు తమ ముందుకు వచ్చిన కరీంనగర్, నిజామాబాద్, నల్లగొండ, వరంగల్ ఉపాధ్యాయ, గ్రాడ్యయేట్ ఎమ్మెల్సీలకు సంబంధించి మూడు స్థానాల్లో పోటీకి దూరంగా ఉంటున్నారు. పార్టీకి బలమైన ప్రాంతాలు, ఆ పార్టీ నేతలు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవితలు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతాల్లో సైతం ఎందుకు పోటీ చేయడంలేదో ‘స్పష్టమైన’ ప్రకటన చేయడంలో దోబూచులాడుతున్నారు. దీంతో ఆ పార్టీ నాయకుడు, వరంగల్ కు చెందిన మాజీ కుడా చైర్మన్ సుందర్ రాజ్, కరీంనగర్ కు చెందిన మాజీ మేయర్ సింగ్ లు స్వతంత్రులుగా బరిలో నిలిచారు. పార్టీ మాత్రం మౌన ముద్ర వహిస్తున్నది.
ఇదిలా ఉండగా మరో వైపు బీఆరెస్ నుంచి కాంగ్రెస్ లోకి ఫిరాయించిన ఎమ్మెల్యే స్థానాల్లో ఉప ఎన్నికలొస్తాయని, అక్కడ పోటీకి సిద్ధమంటూ సవాల్ విసురుతున్నారు.. పైగా సీఎం రేవంత్ కొడంగల్లో రేవంత్ రాజీనామా చేసి ఉప ఎన్నికకు సిద్ధం కావాలని, ఇక్కడ తమ పార్టీ భారీ మెజార్టీతో గెలుస్తుందని సవాళ్ళు విసురుతున్నారు. ఇంకో వైపు స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమంటూ ప్రకటిస్తున్నారు. మరి తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక వహించిన నిరుద్యోగులు, గ్రాడ్యుయేట్లు, టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికులకు ఎందుకు దూరంగా ఉంటున్నారనేది ప్రశ్నార్ధకంగా మారింది. నిజమే పార్లమెంటు ఎన్నికల్లో ఆపార్టీకి ఒక్క స్థానం కూడా దక్కలేదు. దీనిపై ఆరోపణలున్నాయి. తర్వాత నల్లగొండ, వరంగల్ గ్రాడ్యయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిపాలైంది. బీజేపీ నుంచి బీఆరెస్ లో చేరిన వ్యక్తికి అవకాశం కల్పించారనే విమర్శలున్నాయి. గెలిచే అవకాశాలుంటనే పోటీచేస్తారా? ఉద్యమ సమయంలో కూడా పోటీచేసిన పార్టీకి ఇప్పుడు అన్ని హంగులున్నా ఎందుకు వెనుకంజ వేస్తుందనేది ప్రశ్నార్ధకంగా మారింది.

కాంగ్రెస్, బీజేపీ, బీఆరెస్ పరస్పర విమర్శలు

ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, బీఆరెస్ లు పరస్పరం తీవ్ర విమర్శలు చేసుకుంటున్నాయి. బీఆరెస్ తాజా ఎన్నికలకు దూరంగా ఉండటం ఎవరి ప్రయోజనాల కోసమనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ విజయానికి సహకరించేందుకే బీఆరెస్ ఈ విధంగా వ్యవహరిస్తుందనే విమర్శలు కాంగ్రెస్ చేస్తుండగా కాంగ్రెస్ కోసమే పోటీకి దూరంగా ఉంటున్నారనేది బీజేపీ ఆరోపణ. ఆరోపణలు ఎలా ఉన్నా? రాష్ట్రం బీఆరెస్, కాంగ్రెస్ మధ్య సయోధ్య అనేది ప్రశ్నార్ధకమైనా అంశమే.. ఇక బీఆరెస్, బీజేపీ మధ్య ఏదో ఉందనే విమర్శలు పార్లమెంటు ఎన్నికల నుంచి తలెత్తుతున్నాయి. దీనికి సమాధానం చెప్పాల్సిన బీఆరెస్ రాజకీయ విమర్శలు చేస్తూనే పోటీలో లేక పోవడం అనుమానాలకు తావిస్తోందీ.

రాజకీయ విశ్వసనీయతకు సమస్య

తాజా రాజకీయాల్లో విలువలూ.. విషయాలపై అంతగా చర్చ జరుగని అంశం వాస్తమే అయినప్పటికీ ఇలాగే రాజకీయాలు కొనసాగితే రానున్న రోజుల్లో రాజకీయ పక్షాల ఉనికి, నేతల విశ్వనీయత, అంకితభావం ప్రశ్నార్ధకంగా మారుతోంది. అన్ని రాజకీయ పక్షాలు, నాయకులు వీటిని కాపాడేందుకూ.. కనీస విలువలను నిలబెట్టేందుకు ప్రయత్నించకపోతే రానున్న రోజుల్లో ‘రాజకీయం’ మరింతగా మార్కెట్ సరుకుగా మారేందుకు ఎక్కువ కాలం పట్టకపోవచ్చూ. ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టుగా మారే ప్రమాదం ఉంది. ఈ విషయాన్ని పార్టీలూ.. నేతలు గుర్తెంచాల్సి ఉంది. ప్రజలూ, ప్రజాస్వామిక వాదులు అప్రమత్తంగావాల్సిన అవసరం ఉంది.