Cyber Crime |
దేశంలోనే అతిపెద్ద డేటా చోరీని సైబరాబాద్ పోలీసులు (Cyberabad Police) బట్టబయలు చేశారు. దేశ వ్యాప్తంగా 16 కోట్ల 80 లక్షల మంది వ్యక్తిగత డేటా (Personal Data)ను చోరీ చేసినట్లు సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర (Stephen Ravindra) వెల్లడించారు. మరో 10 కోట్ల మంది డేటాను దొంగిలించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ డేటా చోరీ కేసులో మొత్తం ఆరుగురు సభ్యుల ముఠాను అరెస్టు చేసినట్లు సీపీ స్పష్టం చేశారు.
హైదరాబాద్( Hyderabad ) నగరంలోని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలో వందల కేసులు నమోదైన క్రమంలో విచారణ చేపట్టి.. ఆరుగురు సభ్యులను అరెస్టు చేసినట్లు తెలిపారు. ఈ ముఠా సభ్యులు ఢిల్లీ, ముంబై, నాగ్‌పూర్‌కు చెందిన వారిగా గుర్తించినట్లు పేర్కొన్నారు.
దేశ భద్రతకు భంగం కలిగేలా సైబర్ నేరగాళ్లు( Cyber Criminals ) వ్యక్తిగత డేటాను అపహరించినట్లు పేర్కొన్నారు. బీమా, లోన్లకు దరఖాస్తు చేసుకున్న నాలుగు లక్షల మంది డేటాను చోరీ చేసినట్లు తెలిపారు. ఆర్మీకి చెందిన రెండున్నర లక్షల మంది డేటా కూడా చోరీ అయినట్లు నిర్ధారించారు.
అంతే కాకుండా కోట్లాది మంది సోషల్ మీడియా ఐడీలు, పాస్‌వర్డ్‌లను దొంగిలించినట్లు తెలిపారు. ఈ డేటాను ఆయా కంపెనీల్లోని ఉద్యోగులు సైబర్ నేరగాళ్లకు అమ్ముకుంటున్నట్లు స్పష్టం చేశారు. బ్యాంక్ ఆఫ్ బరోడాకు చెందిన క్రెడిట్ కార్డు ఏజెన్సీ ఉద్యోగి వ్యక్తిగత డేటాను అధికంగా అమ్ముకున్నట్లు తేలింది.
దీంతో సైబర్ నేరగాళ్లు ప్రజలను ఈజీగా మోసం చేస్తున్నట్లు తేలిందన్నారు. దీని వల్ల వ్యక్తిగత భద్రతకే కాకుండా, దేశ భద్రతకు ముప్పు ఉందన్నారు. దేశ ప్రజల వ్యక్తిగత డేటాను అమ్ముకున్న ఉద్యోగులతో పాటు సైబర్ నేరగాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.