మూడు పిల్ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చిన జ్వాలా.. కునోలో 20కి చేరిన చిరుత‌ల సంఖ్య

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని కునో నేష‌న‌ల్ పార్కులో జ్వాలా అనే న‌మీబియా చిరుత ముగ్గురు పిల్ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చింది

మూడు పిల్ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చిన జ్వాలా.. కునోలో 20కి చేరిన చిరుత‌ల సంఖ్య

భోపాల్ : మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని కునో నేష‌న‌ల్ పార్కులో జ్వాలా అనే న‌మీబియా చిరుత ముగ్గురు పిల్ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చింది. ఆ మూడు కూన‌లు ఆరోగ్యంగా ఉన్న‌ట్లు కునో నేష‌న‌ల్ పార్కు అధికారులు పేర్కొన్నారు. తాజాగా పుట్టిన మూడు పిల్ల‌ల‌తో క‌లిపి కునోలో మొత్తం చిరుత‌ల సంఖ్య 20కి చేరింది. ఈ విష‌యాన్ని కేంద్ర ప‌ర్యావ‌ర‌ణ శాఖ మంత్రి భూపేంద‌ర్ యాద‌వ్ ట్వీట్ చేశారు. ఆ మూడు చిరుత కూన‌లు సంద‌డి చేస్తున్న వీడియోను కూడా ఆయ‌న షేర్ చేశారు.

నమీబియాకు చెందిన జ్వాలా అనే చిరుత మూడు పిల్లలకు జన్మనిచ్చింది. నమీబియా చిరుత ఆషా తన పిల్లలకు జన్మనిచ్చిన కొన్ని వారాల తర్వాత జ్వాలా కూడా ప్రసవించింది. వన్యప్రాణుల ప్రేమికులందరికీ అభినందనలు. భారత్‌లో వన్యప్రాణులు వృద్ధి చెందాలి అని భూపేంద‌ర్ యాద‌వ్ పేర్కొన్నారు.

దేశంలో చిరుత‌ల‌ జనాభాను పునరుద్దరించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక ప్రణాళికలను అమలు చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇందులో భాగంగానే దక్షిణాఫ్రికా, నమీబియా దేశాల నుంచి చిరుతలను కొనుగోలు చేసి తీసుకొస్తున్నారు. వాటిని కునో నేషనల్ పార్క్‌లో వదులుతున్నారు. ఇందులో భాగంగానే 2022 సెప్టెంబర్ 17న నమీబియా నుంచి 8 మంది చిరుత పిల్లలను తీసుకొచ్చారు. అందులో 5 ఆడ చిరుతలు కాగా.. మూడు మగ చిరుతలు. 2023 ఫిబ్రవరిలో దక్షిణాఫ్రికా నుంచి 12 చిరుతలను తీసుకొచ్చారు. ఇప్ప‌టి వ‌ర‌కు కునో నేష‌న‌ల్ పార్కులో మొత్తం 10 చిరుత‌లు మృతి చెందాయి.