ఓవర్ స్పీడ్.. పశ్చిమగోదావరి జిల్లాలో ముగ్గురు మృతి
వేగం కన్నా ప్రాణం మిన్నా.. అనే సూత్రాన్ని ఆ కారు డ్రైవర్ పాటించలేదు. ఓవర్ స్పీడ్‌లో కారుపై నియంత్రణ కోల్పోయాడు

- పలువురికి తీవ్ర గాయాలు
- నియంత్రణ కోల్పోయి డివైడర్ దాటి
- మరో రోడ్డుపై కారును ఢీ కొట్టిన కారు
- ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లాలో ప్రమాదం
విధాత: వేగం కన్నా ప్రాణం మిన్నా.. అనే సూత్రాన్ని ఆ కారు డ్రైవర్ పాటించలేదు. ఓవర్ స్పీడ్‌లో కారుపై నియంత్రణ కోల్పోయాడు. డివైడర్‌ను దాటి ఎదురుగా ఉన్న రోడ్డుపైకి దూసుకెళ్లాడు. అదే సమయంలో మరో కారు వేగంగా రావడంతో ఆ కారునూ బలంగా ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో ఓ పసిబిడ్డతోపాటు ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. పలువురు గాయపడ్డారు.
నల్ల కారు రాంగ్ సైడ్ నుంచి ఢీ కొనగా రెండు కార్ల ముందు భాగాలు నుజ్జునుజ్జయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లోని దేవరపల్లి మండలంలో మంగళవారం మధ్యాహ్నం ఈ భయానక ఘటన జరిగింది. ఈ ప్రమాద ఘటన తీరు అక్కడి సీసీలో రికార్డయింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఒక కారులో ఏడుగురు ప్రయాణికులు వెళుతుండగా, మరో కారులో నలుగురు ఉన్నారని పోలీసులు తెలిపారు. ముగ్గురు వ్యక్తులు మృతి చెందగా, గాయపడిన మరి కొందరిని చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించినట్టు పేర్కొన్నారు. అతివేగం కారణంగా ఈప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా నిర్దారించారు. కేసు నమోదు చేసి తదుపరి విచారణ జరుపుతున్నారు.