Sigachi Explosion| సిగాచీ పేలుడులో 36మంది మృతి..11మంది గల్లంతు : మంతి దామోదర రాజనర్సింహ

విధాత : సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు పాశమైలారం సిగాచీ కెమికల్ ఫ్యాక్టరీ పేలిన ఘటనలో ఇప్పటివరకు 36మంది మృతి చెందినట్లుగా రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ తెలిపారు. బుధవారం రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ బి.మహేష్ కుమార్ గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డిలతో కలిసి పేలుడు జరిగిన సిగాచీ పరిశ్రమను సందర్శించారు. సంఘటన వివరాలను మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్, జగ్గారెడ్డిలకు రాజనరసింహ వివరించారు. సహాయక సిబ్బందిని అడిగి ప్రమాదం వివరాలు తెలుసుకున్నారు. బాధితుల బంధువులను పరామర్శించి అండగా ఉంటామని వారికి భరోసా ఇచ్చారు.
అనంతరం రాజనరసింహ మీడియాతో మాట్లాడారు. పేలుడు ఘటనలో మృతి చెందిన వారిలో 16 మృతదేహాలను ఇప్పటికే బంధువులకు అప్పగించామని తెలిపారు. 18 మృతదేహాలను గుర్తించేందుకు డీఎన్ఏ టెస్టు జరుగుతుందన్నారు. గల్లంతైన మరో 11 మంది ఆచూకీ లభించడం లేదని..వారు కూడా బతికి ఉండే అవకాశం లేదన్నారు. గాయపడినవారు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని తెలిపారు. ప్రభుత్వం మృతుల కుటుంబాలకు, గాయపడిన వారికి ఇప్పటికే తక్షణ సహాయాన్ని ప్రకటించిందని..కంపెనీ నుంచి కూడా కోటీ రూపాయల చొప్పున పరిహారం అందించేలా ప్రభుత్వం ప్రయత్నిస్తుందని వెల్లడించారు. క్షతగాత్రుల వైద్య ఖర్చులను ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు.