Sigachi Statement| సిగాచీ పేలుడు ఘటనలో 40 మంది మృతి: సిగాచి ప్రకటన

మృతులకు కోటి చొప్పున పరిహారం
90రోజుల పాటు ఫ్యాక్టరీ మూత
వైస్ చైర్మన్ ను అడ్డుకున్న కార్మికుల కుటుంబాలు
కంపెనీపై నాలుగు సెక్షన్ల కింద కేసులు
యాజమాన్యం నిర్లక్ష్యంతోనే పేలుడు
కాలం చెల్లిన మిషనరీని మార్చాలన్న సూచనలను పట్టించుకోలేదు
విధాత: సిగాచీ కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన పేలుడు ఘటనలో 40మంది కార్మికులు మృతి చెందినట్లుగా కంపెనీ యాజమాన్యం ప్రకటించింది. ఘటనలో మరో 30 మంది గాయపడినట్లు ప్రకటనలో కంపెనీ పేర్కొంది. మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం ఇస్తామని వెల్లడించింది. ఇందుకోసం నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ కి లేఖ రాసినట్లుగా పేర్కొంది. క్షతగాత్రులకు పూర్తి స్థాయిలో వైద్యం అందిస్తామని, అండగా ఉంటామని స్పష్టం చేసింది. ఈ మేరకు కంపెనీ తరఫున సెక్రెటరీ వివేక్ కుమార్ ప్రకటన విడుదల చేశారు. 90 రోజులపాటు కంపెనీ మూసివేతకు నిర్ణయించినట్లుగా తెలిాపరు.
వైస్ చైర్మన్ ను అడ్డుకున్న కార్మికుల కుటుంబాలు
సిగాచీ కంపెనీ వైస్ చైర్మన్ చిదంబరనాథన్ ను కార్మికుల కుటుంబాలు అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది. పేలుడులో గాయపడిన వారిని పరమార్శించేందుకు ఆయన పటాన్ చెరువు ఏరియా ఆసుపత్రి వద్దకు రాగా బాధితుల కుటుంబాల సభ్యులు ఒక్కసారిగా ఆయనను అడ్డుకోవడంతో ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు ఆయనను సురక్షితంగా అక్కడి నుంచి తరలించారు. ఈ సందర్భంగా వైస్ చైర్మన్ చిదంబర నాథన్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి కంపెనీ యాజమాన్యం రాలేదా అని ఎందుకు అన్నారో తమకు తెలియదన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే మా వాళ్లు జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఉన్నతాధికారులతో టచ్ లో ఉన్నారని తెలిపారు. నేను అనారోగ్య కారణంతో రాలేకపోయానన్నారు. ప్రమాద సమయంలో 60 మంది కార్మికులు ఉన్నట్లుగా సమాచారం ఉందన్నారు. ఇలాంటి ప్రమాదం ఎన్నడూ జరగలేదని.. ప్రమాదం ఎలా జరిగిందో మాకు తెలియాల్సి ఉందన్నారు.
సిగాచీ కంపెనీపై నాలుగు సెక్షన్ల కింద కేసులు
సిగాచీ కంపెనీ పేలుడు ఘటనపై కంపెనీ ఉద్యోగి యశ్వంత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు భానూరు పోలీసులు కేసు నమోదు చేశారు. కంపెనీ యాజమాన్యంపై నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ లో పేర్కొన్న కీలక అంశాలలో పేలుడుకు కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యం కారణమని పేర్కొన్నారు. పేలుడు సమయంలో కంపెనీలో 145 మంది పని చేస్తున్నారని పోలీసులు పేర్కొన్నారు. వారిలో కొంతమంది అక్కడికక్కడే చనిపోయారని.. చాలామంది మంటల్లో కాలిపోతూ కనిపించారని తెలిపారు. కంపెనీలో భారీ పేలుడుకు పాత మిషనరీయే కారణమని..కాలం చెల్లిన మిషనరీని మార్చాలని కార్మికులు కోరినా..వారిపై ఒత్తిడి తెచ్చి అలాగే పనిచేయించారని ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. మిషనరీలో సమస్యలు ఉన్నాయని తెలిసినా యాజమాన్యం పట్టించుకోలేదని ఆరోపించారు. 1980లో ప్రారంభమైన సిగాచీ పాత మిషనరీ తో పలుమార్లు ఇబ్బంది తలెత్తిన యాజమాన్యం పట్టించుకోలేదని, డైరెక్టర్ ఆఫ్ కంపెనీస్ అధికారులు తనిఖీలు చేయలేదని నిర్ధారించారు. కంపెనీ ప్రారంభించినప్పటి నుంచి ఒకే డ్రైయర్లతో పని చేస్తున్నారని..మిషనరీ మొత్తం మార్చాలని చెప్పిన పట్టించుకోలేదని పేర్కొన్నారు. కంపెనీకి ఎన్ వోసీ కూడా లేనట్లుగా అనుమానిస్తున్నామని తెలిపారు. కంపెనీలో ఫైర్ మేనేజ్మెంట్ కూడా సరిగా లేదని..ఫైర్ ఎస్కేప్ రూట్ కూడా సక్రమంగా లేదని..మంటలు అర్పేందుకు తగిక సిలిండర్లు కూడా లేవని పేర్కొన్నారు. ప్రమాదం జరిగినప్పుడు పక్కనే ఉన్న మరో పరిశ్రమ నుంచిఫైర్ ఫైటర్స్ వచ్చారని తెలిపారు.