అయోధ్యకు ఐదు లక్షల లడ్డూలు
మధ్యప్రదేశ్ రాష్ట్రం ఉజ్జయిని నుంచి అయోధ్యకు ఐదు లక్షల లడ్డూలు శుక్రవారం చేరనున్నాయి

- ఉజ్జయిని నుంచి రామాలయానికి
- చేరనున్న 250 క్వింటాళ్ల లడ్డూలు
విధాత: మధ్యప్రదేశ్ రాష్ట్రం ఉజ్జయిని నుంచి అయోధ్యకు ఐదు లక్షల లడ్డూలు శుక్రవారం చేరనున్నాయి. ఉజ్జయినిలోని మహాకాళేశ్వరాలయంలో ఇప్పటికే నాలుగు లక్షల లడ్డూలను సిబ్బంది ప్యాక్ చేశారు. అయోధ్యలోని రామమందిరంలో బాల రాముడి విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా నిర్వహించే వేడుకలో భక్తులకు పంచేందుకు లడ్డూలను ఆలయానికి పంపనున్నట్టు పుణ్యక్షేత్రం అధికారి తెలిపారు. ఒక్కో లడ్డూ 50 గ్రాముల బరువు ఉంటుందని, మొత్తం సరుకు 250 క్వింటాళ్లు ఉంటుందని పేర్కొన్నారు.
“మేము నాలుగు లక్షల లడ్డూలను ప్యాక్ చేసాం. గురువారం మరో లక్ష లడ్డూలు ప్యాక్ అవుతున్నాయి. అవి శుక్రవారం మూడు నుంచి నాలుగు ట్రక్కులలో అయోధ్యకు బయలుదేరుతాయి” అని మహాకాళేశ్వర దేవాలయం అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటర్ మూల్‌చంద్ జున్వాల్ మీడియాకు తెలిపారు.
తియ్యటి లడ్డూలను 900 కిలోమీటర్ల దూరంలోని అయోధ్యకు బాబా మహాకాల్ ప్రసాదంగా పంపుతామని ఎంపీ ముఖ్యమంత్రి మోహన్‌యాదవ్ గతంలో ప్రకటించారు. ఐదు రోజులపాటు 150 మంది ఆలయ సిబ్బంది, సామాజిక సంస్థలకు చెందిన వ్యక్తులు లడ్డూలను సిద్ధం చేశారని జున్వాల్ తెలిపారు. మహాకాళ్ మందిరం ఆవరణలో లడ్డూలను తయారు చేసే ప్రత్యేక యూనిట్ ఉన్నట్టు పేర్కొన్నారు. పొరుగున ఉన్న ఛత్తీస్‌గఢ్ కూడా అయోధ్య రామ మందిర ప్రతిష్టాపన వేడుక కోసం 300 టన్నుల సుగంధ భరిత బియ్యాన్ని పంపింది.