అపార్ట్‌మెంట్లో చెలరేగిన మంటలు.. ఆరుగురు సజీవదహనం
దేశ రాజధాని ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. అపార్ట్‌మెంట్‌లో చెలరేగిన మంటలకు ఆరుగురు సజీవదహనం అయ్యారు

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. అపార్ట్‌మెంట్‌లో చెలరేగిన మంటలకు ఆరుగురు సజీవదహనం అయ్యారు. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు.
వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీలోని పీతాంపుర ఏరియాలో గురువారం రాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. జడ్‌పీ బ్లాక్ అపార్ట్‌మెంట్‌లోని మొదటి అంతస్తులో మంటలు చెలరేగాయి. ఈ మంటలు మూడో అంతస్తు వరకు వ్యాపించాయి. మంటలను గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.
ఘటనాస్థలానికి చేరుకున్న 8 ఫైరింజన్లు మంటలను అదుపు చేశాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు సజీవదహనం అయ్యారని పోలీసులు తెలిపారు. మృతుల్లో నలుగురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. మరొకరు తీవ్రంగా గాయపడగా, చికిత్స నిమిత్తం బాబు జగ్జీవన్ రామ్ హాస్పిటల్‌కు తరలించారు.
ఈ అగ్నిప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది దృష్టి సారించారు. మృతులు రెండు కుటుంబాలకు చెందిన వారని తెలిసింది. మృతులంతా 25 నుంచి 60 ఏండ్ల వయసులోపు వారేనని పేర్కొన్నారు.