MSVPG Collections | బాక్సాఫీస్​ను ముంచెత్తిన ‘మన శంకర వర ప్రసాద్‌గారు’ సునామీ

సంక్రాంతి రేసులో విడుదలైన చిరంజీవి ‘మన శంకర వర ప్రసాద్‌గారు’ మొదటి రెండు రోజుల్లోనే భారత్‌లో ₹50.61 కోట్లు నెట్, వరల్డ్‌వైడ్‌గా ₹84 కోట్లకు పైగా గ్రాస్ దాటింది. రాజా సాబ్ వసూళ్లు పడిపోవడంతో అదనపు బలం తోడై భారీ ఆక్యుపెన్సీ లభించి బ్లాక్‌బస్టర్ రన్ వైపు దూసుకెళ్తోంది.

  • By: ADHARVA |    movies |    Published on : Jan 14, 2026 1:24 AM IST
MSVPG Collections | బాక్సాఫీస్​ను ముంచెత్తిన ‘మన శంకర వర ప్రసాద్‌గారు’ సునామీ

Chiranjeevi Back in Command: MSVPG Registers Stellar Collections 

  • మొదటిరోజే 84 కోట్ల వసూళ్లు
  • ఇంకా సంక్రాంతి ముందే ఉంది
  • భారీ విజయం దిశగా చిరంజీవి చిత్రం
  • కుటుంబ హాస్యమే ప్రధాన కారణం

సంక్రాంతి 2026 పోటీలో మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం మన శంకర వర ప్రసాద్‌గారు’ (MSVPG) బాక్సాఫీస్‌ను అదరగొడుతోంది. సోమవారం విడుదలైనప్పటికీ సినిమా మొదటి రోజే అసాధారణమైన ఆరంభాన్ని నమోదు చేసింది. మొదటిరోజు ప్రీవ్యూలతో కలిపి భారత్‌లో రూ.41.6 కోట్ల నెట్, వరల్డ్‌వైడ్‌గా రూ.71 కోట్ల గ్రాస్ అందుకోవడం పరిశ్రమ దృష్టిని ఆకర్షించింది. ప్రబాస్ నటించిన ది రాజా సాబ్ విడుదలైన మూడు రోజుల్లోనే కలెక్షన్లు పడిపోవడంతో, ఇక అందరి దృష్టీ మన శంకర వర ప్రసాద్‌గారువైపు మళ్లింది. దీంతో ఇంకా దీనికి అదనపు బలం చేకూరింది. మామూలుగానే చిరంజీవి చిత్రం అనగానే దేశం మొత్తం బాక్సాఫీసు వైపు చూస్తుంది.

తొలిరోజే రూ.84 కోట్లకు పైగా వసూళ్లు

Chiranjeevi posing with a newspaper celebrating the ₹84 crore worldwide premiere of Mana Shankara Vara Prasad Garu

మొదటి రోజు Sacnilk రిపోర్ట్ ప్రకారం, ఇండియా మొదటి రోజు నెట్​  రూ.32.25 కోట్లు, ఆదివారం ప్రీవ్యూలు రూ.9.35 కోట్లతో కలిపి మొత్తం రూ.41.6 కోట్లు నమోదు అయ్యాయి. భారత్‌లో తొలిరోజు గ్రాస్ కలెక్షన్లు రూ.50 కోట్లు, ఓవర్సీస్ రూ.21 కోట్లు చేరడంతో తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా గ్రాస్ రూ.71 కోట్లు దాటింది. ఇది చిరంజీవి కెరీర్‌లో రెండవ అతిపెద్ద ఓపెనింగ్‌గా నిలిచింది. ముఖ్యంగా ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో సినిమా సునామీలా పోటెత్తింది. రాష్ట్రాల వారీగా చూసుకుంటే, ఆంధ్ర, తెలంగాణల్లోనే మొదటి రోజు రూ.35 కోట్ల గ్రాస్ తెచ్చింది. కర్ణాటక రూ.2.85 కోట్లు, తమిళనాడు రూ.37 లక్షలు, కేరళ రూ.3 లక్షలు, మిగతా భారతదేశం రూ.50 లక్షలు వసూలు కావడంతో మొత్తం భారత గ్రాస్ రూ.38.75 కోట్లకు చేరింది.

ఆక్యుపెన్సీ కూడా అదిరిపోయింది

అలాగే ఆక్యుపెన్సీ వైపు చూస్తే, డే 1 తెలుగు ఆక్యుపెన్సీ మొత్తం 64.66%, కానీ రాత్రి షోలలో ఇది 78.87 శాతానికి ఎగబాకడం సినిమా వసూళ్లను ఇంకా పెంచింది. వైజాగ్ 87%, కాకినాడ 85.75%, వరంగల్ 83.50%, గుంటూరు 80.25%, విజయవాడ 73.50%, హైదరాబాద్ 70 శాతాలు దాటిన ఆక్యుపెన్సీతో సినిమా సెంటర్లన్నిటిలోనూ అద్భుతంగా నడిచిందని తెలుస్తోంది.

ఇక మరోవైపు ప్రబాస్ నటించిన ది రాజా సాబ్ Day 1లో రూ.53.75 కోట్లు దాటినా, మౌత్‌టాక్ కారణంగా మూడు రోజుల్లోనే కలెక్షన్లు గణనీయంగా పడిపోయాయి. మంగళవారం ఈ చిత్రం కేవలం రూ.3.44 కోట్లు మాత్రమే సాధించడంతో ప్రేక్షకుల ఆసక్తి పూర్తిగా MSVPG వైపు తిరిగింది. అదీకాక, ఈ చిత్రం పూర్తిగా కుటుంబ హాస్య కథా చిత్రంగా పేరు రావడంతో పండుగ సందర్భంగా ఫ్యామిలీలన్నీ ఇటే దారిపట్టాయి. ఇక రాజా సాబ్ ఇండియా నెట్​ మొత్తం రూ.118 కోట్ల వరకు చేరినా, దాని రెండో రోజు క్షీణత MSVPGకి భారీ ప్రయోజనాన్ని చేకూర్చింది.

రెండోరోజు కూడా MSVPG ధృడంగా నిలబడింది. Sacnilk early estimates ప్రకారం సినిమా రూ.13.11 కోట్లు వసూలు చేసి, రెండు రోజుల్లో మొత్తం రూ.50.61 కోట్ల ఇండియా నెట్​ను దాటింది. సంక్రాంతి ఇంకా రాకముందే సినిమా ఇంత గట్టిగా పర్ఫార్మ్ చేయడం పరిశ్రమలో అరుదైన విషయం. సాయంత్రం, రాత్రి షోలలో జంప్ రావడం రెండో రోజు వసూళ్లను మరింత బలపరిచింది. ఇక పండుగ మూడు రోజులు జాతరే ఉంటుందని ట్రేడ్ వర్గాల అంచనా.

అనిల్​ మార్క్​ “నో లాజిక్​ – ఓన్లీ మ్యాజిక్​” వర్కవుటయింది

Chiranjeevi and Nayanthara in an emotional confrontation scene from Mana Shankara Vara Prasad Garu

అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో చిరంజీవి నటన ప్రధాన బలం. నయనతార, కేథరిన్ ట్రెసా, జరినా వహాబ్​లు తమ పరిధి మేరకు నటించి మెప్పించారు. వెంకటేశ్ చేసిన ఎక్స్‌టెండెడ్ కామియో కూడా ప్రేక్షకులకు సర్‌ప్రైజ్‌గా మారి మంచి స్పందన తెచ్చుకుంది. వర ప్రసాద్ అనే నేషనల్ సెక్యూరిటీ ఆఫీసర్ పాత్రలో చిరంజీవి భావోద్వేగం, కుటుంబ సంబంధాల మీద నడిచే డ్రామా, కామెడీ టైమింగ్​, యాక్షన్ ఎపిసోడ్లు ప్రేక్షకులను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. సమీక్షలు కూడా పాజిటివ్​గా రావడంతో సినిమా బ్లాక్​బస్టర్​ దిశగా పయనిస్తోంది.

ప్రస్తుతం ట్రేడ్ వర్గాలు “3 రోజుల్లో 100 కోట్ల వరల్డ్‌వైడ్ మార్క్, 4 రోజుల్లో 120–130 కోట్లు, సంక్రాంతి వారం ముగిసేలోపే 150 కోట్లను దాటే అవకాశం” ఉన్నట్లుగా అంచనా వేస్తున్నాయి. ఇదే వేగం కొనసాగితే MSVPG ‘వాల్తేరు వీరయ్య’  వసూలు చేసిన 236 కోట్లను దాటేస్తుందని విశ్లేషకులు అంటున్నారు. రాజాసాబ్​  మందగించటం, సంక్రాంతి సీజన్, కుటుంబ ప్రేక్షకుల బలమైన మద్దతు — ఇవన్నీ మన శంకరవరప్రసాద్​ గారికి అనుకూలంగా మారాయి.

MSVPG తొలి రెండు రోజుల్లోనే చూపిన నిలకడ, ఆక్యుపెన్సీ గ్రాఫ్, బాక్సాఫీస్ సునామీ చూసి ట్రేడ్ వర్గాలు ఇది 2026 సంక్రాంతి విజేతగా నిలిచే అవకాశాలు అధికంగా ఉన్నాయని చెబుతున్నాయి.