Medaram Jatara : మేడారానికి ప్రత్యేక ఆకర్షణ ఈ బొమ్మలు

మేడారంలో ఆదివాసీ కళల విందు! చిలుకలగుట్ట దారిలో కోయ సంస్కృతిని ప్రతిబింబించే గోడచిత్రాలు, విగ్రహాలు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. సెల్ఫీ పాయింట్లుగా మారిన జాతర సెంటర్లు.

Medaram Jatara : మేడారానికి ప్రత్యేక ఆకర్షణ ఈ బొమ్మలు

విధాత,ప్రత్యేక ప్రతినిధి: ఈ సారి మేడారం జాతరను భక్తులను ఆకర్షించే విధంగా అన్ని హంగులూ, రంగులతో ఆదివాసీ సంస్కృతీ, సంప్రదాయాలకు ప్రతీకగా తీర్చదిద్దుతున్నారు. ఇప్పటికే ప్రధానమైన గద్దెల ప్రాంగణాన్ని ఉన్నతీకరిస్తున్నారు. దీనికి తోడు మేడారంలోని ప్రధాన సెంటర్లను అందమైన, ఆకర్షణీయమైన బొమ్మలతో తీర్చిదిద్దుతున్నారు. జాతరలోని విశాలమైన ప్రాంతంలోని ప్రధాన గోడలకు ఆదివాసీల సంస్కృతి ఉట్టిపడే విధంగా బొమ్మలు, చిత్రాలు చిత్రించారు. ముఖ్యంగా చిలుకల గుట్టకు వెళ్ళే దారిలోని గోడలను ఆదివాసీ కోయల చారిత్రక వారసత్వాన్ని ప్రతిబింబించే రంగురంగుల బొమ్మలు చిత్రించారు. సెంటర్లలోని ఆదివాసీ నృత్యాలు, డోలు, వ్యవసాయం, ఎడ్లబండ్లు, ధాన్యాన్ని దంచే దృశ్యాలు, రకరకాలైన పులి, సింహం, జింకలు, ఏనుగు,అడవిదున్నలు, నెమళ్ళు, కొంగలు తదితర జంతువుల బొమ్మలు ఎంతో ఆకర్షణీయంగా రూపొందించి ప్రధాన సెంటర్లలో ఫౌంటెన్ల మధ్య ఏర్పాటు చేశారు. ఇందులో ఆదివాసీ మహిళలు సామూహిక నృత్య భంగిమలు, డోలు డ్యాన్సులు, కొమ్ము, బూర ఊదడం తదితర చిత్రాలున్నాయి. థింసా, గుస్సాడి చిత్రాలున్నాయి. వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన మహిళల చిత్రాలు చిత్రీకరించారు. మేడారంలోనే కాకుండా ములుగు, జంగాలపల్లి, తాడ్వాయి, పస్రా తదితర ప్రాంతాల్లోని ప్రధాన సెంటర్లలో కూడా ఈ బొమ్మలు ఏర్పాటు చేశారు. జాతరకు వచ్చే భక్తులు వీటిని చూసి సంతోషం వ్యక్తం చేస్తుండగా దాదాపు ప్రతీ ఒక్కరు ఏదో ఒక చోట ఈ బొమ్మలతో సెల్ఫీలు, కుటుంబాలతో కలిసి ఫోటు దిగుతున్నారు. మేడారం జాతరకు వచ్చినందుకు ఇదొక గుర్తుగా మారిపోయాయి.

ఇవి కూడా చదవండి :


Medaram Jatara : మేడారం జాతరకు మూడు కోట్ల మంది వస్తారని అధికారుల ప్రాథమిక అంచనా
Telangana Gram Panchayat Funds : గ్రామ పంచాయతీలకు తీపి కబురు.. రూ.277 కోట్లు విడుదల చేసిన ఆర్ధిక శాఖ