క‌ట్నం కాటు మ‌రో యువ‌తి బ‌లి

వ‌ర‌క‌ట్న‌ దాహం మ‌రో యువ‌తిని బ‌లి. అడిగినంత కట్నం ఇవ్వ‌డం లేద‌ని ఆమె ప్రియుడు పెండ్లికి నిరాక‌రించ‌డంతో మ‌న‌స్తాపానికి గురై వైద్యురాలు ఆత్మహత్యకు పాల్పడింది,

క‌ట్నం కాటు మ‌రో యువ‌తి బ‌లి
  • కేర‌ళ‌లో ఉరేసుకొని వైద్యురాలు ఆత్మ‌హ‌త్య‌
  • క‌ట్నంగా 150 తులాల‌ బంగారం, 15 ఎకరాల
  • భూమి, బీఎమ్‌డబ్ల్యూ కారు ఇవ్వాల‌ని డిమాండ్
  • అంత ఇవ్వ‌లేమ‌న్న యువ‌తి కుటుంబ స‌భ్యులు
  • పెండ్లి ర‌ద్దు చేసుకున్న‌ వ‌రుడి కుటుంబం
  • మ‌న‌స్తాపంతో డాక్ట‌ర్ యువ‌తి ఆత్మ‌హ‌త్య‌
  • విచార‌ణ‌కు ఆదేశించిన వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి



విధాత‌: వ‌ర‌క‌ట్న‌ దాహం మ‌రో యువ‌తిని బ‌లి తీసుకున్న‌ది. అడిగినంత కట్నం ఇవ్వ‌డం లేద‌ని ఆమె ప్రియుడు పెండ్లికి నిరాక‌రించ‌డంతో మ‌న‌స్తాపానికి గురై కేరళలోని తిరువనంతపురంలో 26 ఏండ్ల‌ వైద్యురాలు ఆత్మహత్యకు పాల్పడింది, తిరువనంతపురంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో సర్జరీ విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సు చదువుతున్న డాక్టర్ షహానా మృతిపై రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ విచారణకు ఆదేశించారు. ప్రియుడిపై వరకట్న నిరోధక చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. మహిళ బంధువుల వాంగ్మూలాలను రికార్డు చేశారు.


పోలీసుల వివ‌రాల ప్ర‌కారం.. డాక్టర్ షహానా తన తల్లి, ఇద్దరు తోబుట్టువులతో తిరువనంతపురంలో నివసించారు. గల్ఫ్‌లో ఉద్యోగం చేస్తున్న ఆమె తండ్రి రెండేండ్ల‌ క్రితమే చనిపోయాడు. డాక్టర్ షహానా, డాక్టర్ ఈఏ రువైస్ ప్రేమించుకున్నారు. ఇద్దరూ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్ర‌మంలో కొంత‌కాలంగా రిలేష‌న్‌షిప్‌లో ఉన్నారు.


డాక్టర్ రువైస్ కుటుంబం కట్నంగా 150 తులాల బంగారం, 15 ఎకరాల భూమి, బీఎమ్‌డబ్ల్యూ కారు ఇవ్వాల‌ని డిమాండ్ చేసింది. డాక్టర్ షహానా కుటుంబం డిమాండ్‌ను తీర్చలేమని చెప్పడంతో ప్రియుడి కుటుంబం పెళ్లిని రద్దు చేసింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన వైద్యురాలు ఉరేసుకొని ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ది. ఆమె అపార్ట్‌మెంట్‌లో సూసైడ్ నోట్ ల‌భించింది. ‘అందరికీ డబ్బు మాత్ర‌మే కావాలి’ అని సూసైడ్ నోడ్‌లో రాసింది. వరకట్న డిమాండ్ ఆరోపణలపై నివేదిక సమర్పించాలని రాష్ట్ర మహిళా శిశు అభివృద్ధి శాఖను కోరినట్టు ఆరోగ్య మంత్రి తెలిపారు.