Revanth Reddy : పంచాయతీ ఎన్నికల విజయం..రెండేళ్ల మా పాలన రెఫరెండం
పంచాయతీ ఫలితాలు మా రెండేళ్ల పాలనకు ప్రజలిచ్చిన తీర్పు: సీఎం రేవంత్ రెడ్డి. 66% స్థానాలతో కాంగ్రెస్ జైత్రయాత్ర, గజ్వేల్‌లోనూ కేసీఆర్‌కు ప్రజలు చుక్కెదురు చూపారని సీఎం స్పష్టం చేశారు.
విధాత, హైదరాబాద్ : తెలంగాణలో జరిగిన 12,702 గ్రామ పంచాయతీల ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ 8,335 సర్పంచ్ స్థానాలను గెలుచుకుని 66శాతం విజయాలు నమోదు చేసిందని..ఈ ఎన్నికల ఫలితాలు రెండేళ్ల కాంగ్రెస్ పాలనకు మద్దతుగా ప్రజలు ఇచ్చిన తీర్పుగా భావిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం మీడియా సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రతిపక్ష బీఆర్ఎస్ 3511, బీజేపీ 710స్థానాలు సాధించాయని, ఆ రెండు పార్టీలు కలిసి 33శాతం విజయం మాత్రమే సాధించాయన్నారు. సీపీఐ, సీపీఎం లు 146సర్పంచ్ లతో 1శాతం విజయం సాధించాయని తెలిపారు.
సికింద్రాబాద్ కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలతో పాటు గ్రామ పంచాయతీ ఎన్నికలలో ప్రజలు కాంగ్రెస్ ను గెలిపించి ఆశీర్వదించారన్నారు.
పాలన విజయాలకు ఫలితాలే నిదర్శనం
అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 26 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఒక్క సీటు గెలవలేదని.. ఆ తర్వాతా రెండు ఉప ఎన్నికల్లోను ప్రజలు మమ్మల్ని గెలిపించారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. రాష్ట్రంలో 94నియోజకవర్గాల్లో జరిగిన గ్రామపంచాయతీలో ఎన్నికల్లో 66శాతం విజయాలు సాధించిందని, కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గం పరిధిలో సైతం ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ సర్పంచ్ స్థానాలను గెలిపించి..కేసీఆర్ ను తిరస్కరించారన్నారు. ఈ విజయాలన్ని మా రెండేళ్ల ప్రజా ప్రభుత్వ పాలనకు మద్దతుగా ప్రజలు ఇచ్చిన తీర్పుగా భావిస్తున్నామని తెలిపారు. మేం అమలు చేసిన ఎన్నికల హామీలు, సంక్షేమ పథకాల అమలుకు లభించిన ఆదరణను ఎన్నికల ఫలితాలు చాటుతున్నాయని పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణ, 61వేల ప్రభుత్వ ఉద్యోగాల నియామకం, టీచర్ల నియామకాలు, పేదలకు నాణ్యమైన విద్య కారణంగా ప్రజలు మా పాలనను ఆశీర్వదించారన్నారు. సన్న బియ్యం, రైతు రుణమాఫీ, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్ వంటి కేసీఆర్ చేయలేని పనులు చేస్తున్నామన్నారు. ఆదాయాన్ని, అప్పులను గాడిలో పెట్టుకుంటూ వాటిని అమలు చేస్తున్నామని.. సంక్షేమం, అభివృద్ధి సమపాళ్లలో అమలు చేస్తు ముందుకెలుతున్నామని, ఆరు గ్యారంటీలతో పాటు ఏడో గ్యారంటీగా స్వేచ్చగా వ్యవహారించే ప్రజాస్వామిక వాతావరణం అమలు చేస్తున్నామన్నామని రేవంత్ రెడ్డి తెలిపారు.
అహంకారంతో విర్రవీగితే ప్రజలకు మరింత దూరం
గ్రామపంచాయతీ ఎన్నికలు కూడా పూర్తి స్వేచ్చాయుత, ప్రజాస్వామిక వాతావరణంలో జరిగాయని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గెలిస్తే ఆహంకారం, ఓడితే కుంగిపోవడం వంటి వాటికి దూరంగా ప్రజలకు దగ్గరగా ఉండాలనే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఎన్నికల ఫలితాలు మా బాధ్యతను పెంచాయన్నారు. 2029లో కూడా ఇదే తీర్పు పునరావృతమవుతుందన్నారు. ఇప్పటికైనా ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ నేతలు అసూయ, అహంకారాలను తగ్గించుకోవాలని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ది పథకాలకు ప్రతిపక్ష పార్టీగా బాధ్యతగా సహకరించాలన్నారు. అధికారం పోయిన కొందరికి అహంకారం తగ్గడం లేదన్నారు. బరితెగించి ఇబ్బంది పెడుతామంటే వారు మరింతగా ప్రజలకు దూరమవుతారన్నారు. ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ నేతలకు ప్రభుత్వం పట్ల ఉన్న అసూయ, ద్వేషం మూసీ కాలుష్యం కంటే ఎక్కువగా ఉందని విమర్శించారు. జాతీయ ఉపాధి హామీ పథకంను పేరు మార్పు, సోనియాగాంధీ, రాహుల్ గాంధీలపై అక్రమ కేసులతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వైఖరిని ప్రజలు నిరసిస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు కాంగ్రెస్ ను ఆదరిస్తున్నారన్నారు. అంతర్జాతీయంగా 3లక్షల88లవే తలసరి ఆదాయంతో తెలంగాణ పురోగమిస్తుందన్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలపై అసెంబ్లీ సమావేశాలు పెట్టి చర్చించి ప్రతిపక్షాల అభిప్రాయాలు తీసుకుని నిర్ణయం తీసుకుంటామని.. 42శాతం బీసీ రిజర్వేషన్లపై ఎలా ముందుకెళ్లాలన్నదానిపై ప్రతిపక్షాల అభిప్రాయాలు తీసుకుంటామని రేవంత్ రెడ్డి తెలిపారు.
అనర్హత నిర్ణయంపై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
అసెంబ్లీ సమావేశాల్లో 37మంది ఎమ్మెల్యేలు మాకు ఉన్నారని..ఆ మేరకు మాకు ఇంత సమయం కావాలని బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు అడిగారని..అంటే ఆ పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే వారు భావిస్తున్నట్లే కదా అని రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రతినెల బీఆర్ఎస్ పార్టీకి ఆ పది మంది ఎమ్మెల్యేలు రూ.5వేలు చెల్లిస్తున్నారని, ఆ పది మంది ఎమ్మెల్యేల తరపునా మాట్లాడేందుకు సమయం, జీతాల్లో వాటాలు కావాలంటునే వారు మా పార్టీ వారు కాదని బీఆర్ఎస్ వాళ్లు మాట్లాడం విడ్డూరంగా ఉందని చురకలేశారు. సోంత పార్టీ ఎమ్మెల్యేలను మా వాళ్లు కాదని చెప్పుకునే దుస్థితి రావడం విడ్డూరమన్నారు.
గజ్వేల్ ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని తిరస్కరించారు
కేసీఆర్ క్రియాశీలక రాజకీయాల్లో లేరని భావించి గజ్వేల్ నియోజకవర్గం ప్రజలు సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు మెజార్టీ స్థానాలు కట్టబెట్టారని, రేపు ఆయనతో ఇంకేదో అవుతుందనుకోవడం భ్రమే అని రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ ప్రతిపక్ష నేతగా లేఖ రాస్తే..కృష్ణా, గోదావరి జలాలకు సంబంధించి పదేళ్ల వారి పాలనలో, రెండేళ్ల మా పాలనలో తీసుకున్న నిర్ణయాలు, సాధించిన హక్కులపైన అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు పెట్టి రెండు మూడు రోజులైన చర్చిద్దామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఉమ్మడి రాష్ట్రం పాలకుల కంటే కూడా ఎక్కువగా తెలంగాణకు అన్యాయం చేసిందే కేసీఆర్ అన్నారు. బురద చల్లి పారిపోతామంటే ప్రజలు అన్ని గమనిస్తున్నారన్నారు.
కేటీఆర్ వెనుక గోతులు తీస్తున్న హరీష్ రావు
కేటీఆర్ అనే వ్యక్తి ఇవ్వాళ కాంగ్రెస్ గూర్చి ఆలోచన చేయడం లేదని, హరీష్ రావు తన వెనుక తీస్తున్న గోతుల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రయత్నం చేసే పనిలో ఉన్నాడని రేవంత్ రెడ్డి సెటైర్లు వేశారు. కేటీఆర్ నాయకత్వంతో పార్టీ మనుగడ కష్టమని, హరీష్ రావుకు నాయకత్వం అప్పగించాలని ఆ పార్టీ నాయకులు అంటున్నారని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి :
GHMC Elections | జీహెచ్‌ఎంసీ ఎన్నికలు వచ్చే ఏడాది ఆగస్ట్‌లో? 3 లేదా 4 కార్పొరేషన్ల సంగమం!
Scrub Typhus : ఏపీలో స్క్రబ్ టైఫస్ పంజా..15 మందికి పైగా మృతి
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram