ఐదేండ్ల బాలుడికి క్యాన్సర్.. నయమవుతుందని గంగా నదిలో ముంచారు..
ఓ ఐదేండ్ల బాలుడు క్యాన్సర్ బారినపడ్డాడు. గంగా నదిలో అతన్ని ముంచితే క్యాన్సర్ నయమవుతుందని అతని తల్లిదండ్రులు భావించారు

డెహ్రాడూన్ : ఓ ఐదేండ్ల బాలుడు క్యాన్సర్ బారినపడ్డాడు. గంగా నదిలో అతన్ని ముంచితే క్యాన్సర్ నయమవుతుందని అతని తల్లిదండ్రులు భావించారు. దీంతో గంగా నదిలో ముంచగా, ఆ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. మూఢనమ్మకాలకు నిండు ప్రాణం బలైంది. ఈ ఘటన ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో వెలుగు చూసింది.
ఢిల్లీకి చెందిన ఐదేండ్ల బాలుడు బ్లడ్ క్యాన్సర్‌తో పోరాడుతున్నాడు. ఆ వ్యాధి మరింత ముదరడంతో బాబును ఎలాగైనా బతికించుకోవాలని పేరెంట్స్ సిద్ధపడ్డారు. ఈ క్రమంలో మూఢనమ్మకాల వైపు వెళ్లారు. గంగా నదిలో బాలుడిని ముంచితే క్యాన్సర్ నయమవుతుందని బాబు తల్లిదండ్రులతో పాటు అతని అత్త నమ్మారు. దీంతో ఢిల్లీ నుంచి ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌కు బయల్దేరారు.
ఇక హరిద్వార్ వద్ద గంగా నదిలో క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడిని అత్త ముంచింది. తల్లిదండ్రులేమో గంగా నదికి ప్రార్థనలు నిర్వహించారు. బాలుడిని నీటి నుంచి బయటకు తీయకపోవడంతో స్థానికులు ఆమెను నిలదీశారు. బలవంతంగా బాలుడిని బయటకు తీశారు. బాలుడు అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయాడు. బాబును ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.
ఈ ఘటనపై హరిద్వార్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ సందర్భంగా హరిద్వార్ సీపీ స్వతంత్ర కుమార్ మాట్లాడుతూ.. ఢిల్లీలోని ఓ పెద్దాసుపత్రిలో బాలుడు క్యాన్సర్‌కు చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. అయితే డాక్టర్లు బాలుడిని బతికించడం కష్టమని చెప్పడంతో ఈ చర్యకు పాల్పడినట్లు అతని పేరెంట్స్ చెప్పారని పేర్కొన్నారు. ఢిల్లీ హాస్పిటల్ నుంచి నివేదిక కోరామని సీపీ తెలిపారు. ఆ నివేదిక రాగానే చర్యలు తీసుకుంటామన్నారు. అయితే గంగా నదిలో బాలుడిని ముంచితే క్యాన్సర్ నుంచి ఉపశమనం పొందొచ్చని బాలుడి కుటుంబ సభ్యులు భావించారని పేర్కొన్నారు.