నాలుగు రోజుల వ్యవధిలో బీహార్‌లో కూలిన మరో వంతెన

బీహార్‌లోని అరారియాలో వంతెన కూలిన నాలుగు రోజులకే సివాన్‌ జిల్లా దుర్యోంధ ప్రాంతంలో మరో వంతెన కూలిపోయింది. దీంతో గడిచిన రెండు సంవత్సరాల వ్యవధిలోనే బీహార్‌లో కూలిపోయిన వంతెనల సంఖ్య ఐదుకు చేరింది.

నాలుగు రోజుల వ్యవధిలో బీహార్‌లో కూలిన మరో వంతెన

పాట్నా: బీహార్‌లోని అరారియాలో వంతెన కూలిన నాలుగు రోజులకే సివాన్‌ జిల్లా దుర్యోంధ ప్రాంతంలో మరో వంతెన కూలిపోయింది. దీంతో గడిచిన రెండు సంవత్సరాల వ్యవధిలోనే బీహార్‌లో కూలిపోయిన వంతెనల సంఖ్య ఐదుకు చేరింది. దురోంధ్య బ్లాక్‌లోని రాంగఢ పంచాయతీ కాలువపై ఉన్న 100 మీటర్ల బ్రిడ్జి ఒకవైపు కూలిపోయిందని అధికారులు తెలిపారు. ఈ వంతెనను 30 ఏళ్ల క్రితం నిర్మించారు. వంతెన కూలిపోయిన ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం లేదని పేర్కొన్నారు. ఇటీవల కాలువను తవ్వడంతో ఇటుక గోడ, పిల్లర్లు బలహీనపడ్డాయని సివాన్‌ అధికారులు తెలిపారు. వంతెన కూలిపోవడానికి కారణాలపై దర్యాప్తు చేస్తామని చెప్పారు.

జూన్‌ 18, 2024న అరారియాలోని సిక్తిలో 182 మీటర్ల పొడవైన వంతెన కూలిపోయింది. కేంద్ర సంస్థ ఆధ్వర్యంలో ఇటీవలే నిర్మించిన ఈ వంతెనకు 12 కోట్లు ఖర్చు చేశారు. దీనిని ఇంకా ప్రారంభించనూ లేదు. వంతెనకు రెండువైపులా అప్రోచ్‌ రోడ్లను వేయాల్సి ఉన్నది. మార్చి 22, 2024న సుపౌల్‌లోని కోసి నదిపై నిర్మాణంలో ఉన్న వంతెన మూడు స్లాబులు కూలిపోవడంతో ఒక కార్మికుడు చనిపోయాడు. మరో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. 10.5 కిలోమీటర్ల పొడవైన ఈ వంతెనను 1200 కోట్ల ఖర్చుతో మధుబనిలోని భేజా, సుపౌల్‌లోని బాకౌర్‌ మధ్య నిర్మిస్తున్నారు.

2023 జూన్‌లో అగౌని, సుల్తాన్‌గంజ్‌ మధ్య గంగానదిపై నిర్మిస్తున్న వంతెనలో 200 మీటర్ల భాగంలో మూడు పిల్లర్లు కూలిపోయాయి. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ ఏమీ కాలేదు. 3.1 కిలోమీటర్ల పొడవున నిర్మిస్తున్న ఈ బ్రిడ్జి అంచనా వ్యయం 1,710 కోట్లు. వాస్తవానికి 2019నాటికే ఇది పూర్తికావాల్సి ఉన్నది. నిర్మాణపనులు నత్తనడకన సాగడంతో ఈ ఏడాది నవంబర్‌ వరకు గడువు పొడిగించారు.
2022 ఏప్రిల్‌లో భాగల్‌పూర్‌లోని సుల్తాన్‌గంజ్‌లో నిర్మాణంలో ఉన్న ఒక వంతెన బలమైన గాలుల ధాటికి కూలిపోయింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరుగలేదు.