చిందరవందరగా పడిన వస్తువులను రోజూ సర్దిపెడుతున్న ఎలుక.. వైరలవుతున్న వీడియో
తన షెడ్‌లో చిందరవందరగా పడేసిన వస్తువులు... ఉదయం వచ్చి చూసేసరికి నీట్‌గా ఎవరో సర్దినట్లు ఉండటం చూసి ఓ వ్యక్తి ఆశ్చర్యపోయాడు

విధాత: తన షెడ్‌లో చిందరవందరగా పడేసిన వస్తువులు… ఉదయం వచ్చి చూసేసరికి నీట్‌గా ఎవరో సర్దినట్లు ఉండటం చూసి ఓ వ్యక్తి ఆశ్చర్యపోయాడు. ఒకటీ రెండు రోజులు కాదు రెండు నెలల పాటు ఇలా జరిగే సరికి అక్కడేం జరుగుతుందో తెలుసుకోవాలనుకున్నాడు. ఒక నైట్ విజన్ కెమెరాను తన షెడ్‌లో పెట్టి.. తర్వాత అందులో రికార్డు అయినదాన్ని చూశాడు. అందులో విజువల్స్ చూసి తన కళ్లను తానే నమ్మలేకపోయాడు.
ఒక చిట్టి ఎలుక (Mouse) .. ఎంతో పద్ధతిగా.. నెమ్మదిగా చిందరవందరగా పడిపోయి ఉన్న వస్తువులను ఒక ట్రేలో సర్దుతూ కనిపించింది. వేల్స్ (Wales) లోని బులిత్ వెల్స్ అనే ప్రాంతంలో రోడ్నీ హోల్డ్‌బ్రూక్ అనే వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ నివాసంలోనే ఈ అద్భుతం జరుగుతోంది. రోజూ చీకటి పడ్డాక షెడ్‌లోకి వస్తున్న ఆ ఎలుక.. అక్క ఉన్న గుడ్డ ముక్కలు, నట్లు, బోల్టులు, చిన్న చిన్న వస్తువులను సైతం నోటితో తీసుకుని.. అవి ఎక్కడ ఉండాలో అక్కడ పెడుతోంది.
దానిని పరీక్షిద్దామని అనుకున్న బ్రూక్.. పై వస్తువులను కాక.. అంతకుముందెప్పుడూ దానికి పరిచయం లేని కేబుళ్లు, టేపులను అక్కడ పడేసినట్లు పెట్టాడు. వాటిని కూడా ఆ ఎలుక ఒద్దికగా సర్దేసి వెళ్లిపోయేది. ఇలా కొన్ని నెలలుగా జరుగుతోంది. ‘ఆ ఎలుకకు నేను వెల్ష్ టైడీ మౌజ్ అనే పేరు పెట్టాను. ఒకసారి పక్షుల కోసం నేను బయట పెట్టిన ఆహారం.. షెడ్‌లో ఉన్న నా పాత షూలోకి వచ్చింది. అప్పుడు మొదటిసారి అనుమానం వచ్చింది’ అని బ్రూక్ గుర్తు చేసుకున్నాడు.
ఒక ఎలుక రోజూ ఇలా ఎందుకు చేస్తోందో తనకు అర్థం కావడం లేదని.. చాలా వింతగా ఉందని చెప్పుకొచ్చాడు. ‘అది ఎలాంటి వస్తువునైనా దాని యథాస్థానంలోకి తీసుకెళ్లి పెట్టేస్తోంది. ఇప్పుడిక నా షెడ్ బాధ్యతను చూసుకోవాల్సిన అవసరం లేదు. అన్నీ అదే చేసేస్తోంది’ అని వివరించాడు. 100 సందర్భాల్లో కనీసం 99 సార్లు అది తన విధులను నిర్వర్తిస్తోందని తెలిపాడు. అయితే బ్రూక్‌కు ఇలా ఓ ఎలుక సాయం చేయడం ఇదే తొలిసారి కాదు.
2019లో అతడి స్నేహితుడి షెడ్‌లో ఎలుక కూడా నట్లు, బోల్టులను సర్ది పెట్టేది. 2019లో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే అప్పుడు అతడి స్నేహితుడు స్టీవ్ మెక్‌కియర్ష కానీ.. బ్రూక్ గానీ ఈ విషయాన్ని నమ్మలేదు. ప్రస్తుతం వీడియో సాక్ష్యం ఉండటం, వీరు పెట్టిన పరీక్షలో ఆ ఎలక నెగ్గడంతో అది ఉద్దేశపూర్వకంగానే షెడ్డును శుభ్రపరుస్తున్నట్లు వారికి అర్థమయింది. ప్రస్తుతం ఆ నైట్ విజన్ కెమెరాలో రికార్డయిన వీడియో నెట్‌లో వైరల్‌గా మారింది.