ముఖంపై పేడ వేసిన బర్రె.. ఊపిరాడక ఆరు నెలల చిన్నారి మృతి
ఓ ఆరు నెలల చిన్నారి ముఖంపై బర్రె పేడ వేయడంతో.. ఊపిరాడక ఆ పసిపాప ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మహోబా జిల్లాలో చోటు చేసుకుంది

లక్నో : ఓ ఆరు నెలల చిన్నారి ముఖంపై బర్రె పేడ వేయడంతో.. ఊపిరాడక ఆ పసిపాప ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మహోబా జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కుల్పహార్ పోలీసు స్టేషన్ పరిధిలోని సతారి గ్రామానికి చెందిన ముఖేశ్ యాదవ్, నికిత దంపతులు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ దంపతులకు యాదవేంద్ర(3), ఆయుష్(6 నెలలు) అనే ఇద్దరు మగపిల్లలు ఉన్నారు.
అయితే నిన్న సాయంత్రం నికిత బర్రెలకు మేత వేసేందుకు వెళ్లింది. అదే సమయంలో ఆయుష్ ఏడ్వడంతో.. బర్రెల కొట్టంలో ఉన్న ఊయలలో పడుకోబెట్టింది. అనంతరం తిరిగి ఇంట్లోకి వచ్చింది నికిత. బాలుడు ఎలాంటి శబ్దం చేయకపోవడంతో తిరిగి బర్రెల షెడ్డులోకి వెళ్లింది. బాలుడి ముఖంపై బర్రె పేడ వేయడంతో, అపస్మారకస్థితిలోకి వెళ్లిన అతడిని చూసి తల్లి ఆందోళనకు గురైంది. దీంతో బాలుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా, అప్పటికే ఊపిరాడక మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.