అంతరిక్షంలో త‌ప్పిపోయిన ట‌మాటా దొరికింది.. శాస్త్రవేత్త‌లు ఫుల్ ఖుష్‌ !

ఇంట్లో ఒక ట‌మాటా ( Tomato) క‌నిపించ‌క‌పోతే ఏమ‌నుకుంటాం? ఏదో ఎల‌క ప‌ట్టుకుపోయి ఉంటుందిలే అని ఊరుకుంటాం.

  • By: Somu    latest    Dec 07, 2023 10:16 AM IST
అంతరిక్షంలో త‌ప్పిపోయిన ట‌మాటా దొరికింది.. శాస్త్రవేత్త‌లు ఫుల్ ఖుష్‌ !

విధాత‌: ఇంట్లో ఒక ట‌మాటా ( Tomato) క‌నిపించ‌క‌పోతే ఏమ‌నుకుంటాం? ఏదో ఎల‌క ప‌ట్టుకుపోయి ఉంటుందిలే అని ఊరుకుంటాం. అదే ఎక్క‌డో ఆకాశం (Space) లో తిరుగుతున్న అంత‌రిక్ష కేంద్రం (ఐఎస్ఎస్‌)లో క‌నిపించ‌కుండా పోతే…? భ‌ద్ర‌తా ప‌రంగా చాలా ప్ర‌మాదం. అందుకే శాస్త్రవేత్త‌లు ఎనిమిది నెల‌లుగా దాని కోసం ఐఎస్ఎస్‌లో వెతుకుతూనే ఉన్నారు. ఆ ప‌రిస్థితుల్లో అది కుళ్లిపోయి వాయువులు విడుద‌లైనా.. ఎక్క‌డైనా ఇరుక్కుపోయినా ప్ర‌మాదం సంభ‌వించే అవ‌కాశం ఉండ‌ట‌మే దీనికి కార‌ణం.


తాజాగా ఆ ట‌మాటా దొర‌క‌డంతో అక్క‌డి శాస్త్రవేత్త‌లతో పాటు నాసా (NASA) కూడా ఊపిరి పీల్చుకుంది. అంత‌రిక్షంలో మొక్క‌లు, పళ్లు పెంచే వెజ్‌-05 అనే ప‌రిశోధ‌న‌లో భాగంగా రాబిన్ డ్వార్ఫ్ టొమాటో ర‌కానికి చెందిన ట‌మాటాల‌ను పండించారు. వాటిల్లో ఒక్కో పండును ప‌రిశోధ‌నల కోసం ఒక్కో వ్యోమ‌గామి తీసుకున్నారు. అలా ఫ్రాంక్ రుబియో అనే వ్యోమ‌గామికి ఒక టొమాటో వ‌చ్చింది. దానిని జిప్ లాక్ బ్యాగ్‌లో పెట్టారు.


ఆ త‌ర్వాత ఈ ఏడాది మార్చి 29న అది అనుకోకుండా అది చేయి జార‌డంతో గాలిలో తేలి.. ఐఎస్ఎస్‌లోనే దూరంగా వెళ్లిపోయింది. ఆ త‌ర్వాత ఎంత వెతికినా ఆ 2.5 సెం.మీ. ట‌మాటా క‌నిపించ‌క‌పోవ‌డంతో సెప్టెంబ‌రు 13న ఆ ట‌మాటా క‌నిపించ‌కుండా పోయిన‌ట్లు అధికారికంగా ధ్రువీక‌రించారు. తాజాగా అది దొర‌క‌డంతో.. ‘మా స్నేహితుడు ఫ్రాంక్ రుబియో ఐఎస్ఎస్‌లో ట‌మాటా దొంగత‌నం చేసి తినేశాడ‌ని ఇప్ప‌టి వ‌ర‌కు ఒక అప‌వాదు ఉండేది. ఇక మేము అత‌డిని నిర్దోషిగా ప్ర‌క‌టిస్తున్నాం.


ఆ ట‌మాటా దొరికేసింది’ అని ప్ర‌స్తుతం ఐఎస్ఎస్‌(ISS) లో ఉన్న ఆస్ట్రోనాట్ జాస్మిన్ మోగ్‌బిలి బుధ‌వారం (డిసెంబ‌రు 6) ఒక స‌ర‌దా ప్ర‌క‌ట‌న చేశారు. డిసెంబ‌రు 6తో ఐఎస్ఎస్‌ను ఏర్పాటు చేసి 25 ఏళ్లు పూర్త‌వ‌డంతో ఆ రోజును ఈ స‌ర‌దా ప్ర‌క‌ట‌నకు ఎన్నుకొన్నారు. సెప్టెంబ‌రులోనే భూమిపైకి వ‌చ్చేసిన ఫ్రాంక్.. ట‌మాటా దొర‌క‌డంపై స్పందించాడు.


దేవుడా దానిని వెత‌క‌డానికి నేను చాలా శ్ర‌మించాను అని గుర్తుచేసుకున్నాడు. తాను బ‌తికి ఉండ‌గానే ఆ ట‌మాటా దొరుకుతుంద‌ని న‌మ్మ‌క‌ముండేద‌ని అది నెర‌వేరింద‌ని చెప్పుకొచ్చాడు. అది చేజారిపోయాక తాను సుమారు 18 నుంచి 20 గంట‌ల పాటు నిర్విరామంగా వెతికాన‌ని అయినా దొర‌క‌లేద‌ని పేర్కొన్నాడు. అంత‌రిక్షంలో 371 గంట‌ల‌పాటు సుదీర్ఘంగా గ‌డిపిన వ్య‌క్తిగా రికార్డు సాధించింది ఫ్రాంకే కావ‌డం విశేషం.