చంద్రబాబు రిమాండ్ ఆక్టోబర్ 5 వరకు పొడిగింపు

- రెండో రోజు ముగిసిన సీఐడీ విచారణ
విధాత : టీడీపీ అధినేత, మాజీ సీఎం ఎన్. చంద్రబాబునాయుడు జ్యూడిషియల్ రిమాండ్‌ను విజయవాడ ఏసీబీ కోర్టు మరో 11రోజుల పాటు పొడిగించింది. కోర్టు తీర్పుతో ఆక్టోబర్ 5వ తేదీ వరకు బాబు రాజమండ్రి సెంట్రల్ జైలులోనే రిమాండ్‌లో ఉండనున్నారు. రిమాండ్ పొడిగింపు విచారణకు జైలునుంచి వర్చువల్‌గా చంద్రబాబును హాజరుపరిచారు.
జడ్జీ హిమబిందు విచారణ సందర్భంగా సీఐడీ కస్టడీ విచారణ సాగిన తీరుపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. తొలి రోజు ఉదయం 11.30కు సీఐడీ విచారణ ప్రారంభమైంది నిజమేనా అని అడిగారు. థర్డ్ డిగ్రీ ఏమైనా ప్రయోగించారా, వైద్య పరీక్షలు సహా కోర్టు మార్గదర్శకాలను సీఐడీ పాటించిందా.. విచారణ సమయంలో ఏమైనా ఇబ్బంది పెట్టారా అంటూ ప్రశ్నించారు. బదులుగా చంద్రబాబు స్పందిస్తూ తాను సీఐడీ విచారణకు పూర్తిగా సహకరించానన్నారు.
అయితే వారు విచారణలో ఏమైన ప్రాథమిక ఆధారాలు గుర్తించారా అని, వాటిని తనకు తెలుపాలని కోరారు. మీరు రిమాండ్ లో ఉన్నారని, మీ న్యాయవాదుల ద్వారా వివరాలు తెలుసుకోవాలని జడ్జీ సూచించారు. అప్పుడే అంతా అయిపోయిందని భావించవద్దని, సోమవారం మీ బెయిల్ పిటిషన్ విచారణ చేపడుతామని, ఇప్పటికే సీఐడీ స్కిల్ డెవలప్ మెంటు కేసుకు సంబంధించి సీఐడీ ప్రాథమిక సాక్ష్యాలు సమర్పించిందని జడ్జీ చెప్పడం కొంత ఆసక్తి రేపింది.
కాగా విచారణ సమయంలో చంద్రబాబు లీగల్ సెల్ తీరుపై జడ్జీ అసహనం వ్యక్తం చేశారు. ఒకటికి పది వరుస పిటిషన్లతో విచారణ ఎలా అని, కోర్టు సమయం వృధా అవుతుందని వ్యాఖ్యానించారు. బాబు కస్టడి పొడగింపు కోరుతు సీఐడీ న్యాయవాదులు మోమో దాఖలు చేయడంపై బాబు న్యాయవాదులు అభ్యంతరం తెలిపారు. అటు రిమాండ్ పొడిగింపు విచారణ సందర్భంగా సీఐడీ కోరినట్లుగా చంద్రబాబు కస్టడీ పొడిగింపుకు సంబంధించి వాదనలు మాత్రం జరుగలేదు.
అంతకుముందు రాజమండ్రి జైలులో రెండో రోజు చంద్రబాబును సీఐడీ విచారణ కొనసాగించింది. ఉదయం 9.30నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు విచారణ కొనసాగింది. అధికారులు అడిగిన ప్రశ్నలకు చంద్రబాబు స్పష్టమైన సమాధానాలిచ్చినట్లుగా తెలిసింది. స్కిల్ డెవలప్ మెంట్ సంస్థ ఏర్పాటు, శిక్షణ అంతా నిబంధనల మేరకు సక్రమంగానే సాగిందని చంద్రబాబు స్పష్టం చేసినట్లుగా సమాచారం.
ముగిసిన చంద్రబాబు రెండు రోజుల సీఐడీ కస్టడీ
స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబు నాయుడి రెండ్రోజుల సీఐడీ కష్టడీ ముగిసింది. శని, ఆదివారాల్లో ఆయన్ను సీఐడీ అధికారులు దాదాపు 12 గంటలు విచారించింది. అయితే ఈ విచారణలో అయన ఆ కుంభకోణానికి సంబంధించిన సమాచారం ఏదీ చెప్పలేదని తెలుస్తోంది. మరోవైపు అయన జ్యూడిషియల్ కష్టడీని అక్టోబర్ 5వ తేదీ వరకు కోర్టు పొడిగించింది. శని ఆదివారాల్లో ఆరేసి గంటలు చొప్పున చంద్రబాబును సీఐడీ అధికారులు ఆయన్ను విచారించారు.
సెంట్రల్ జైల్లో జరిగిన ఈ విచారణ ప్రక్రియను వీడియో రికార్డింగ్ చేశారు. అయితే రెండు రోజుల విచారణలో అధికారులు అయన నుంచి కుంభకోణానికి సంబంధించిన ఎలాంటి కీలక సమాచారాన్ని రాబట్టలేకపోయారని అంటున్నారు. ఈ విచారణలో ఆయన్ను దాదాపు వంద ప్రశ్నలు అడిగిన అధికారులు సరైన సమాధానాలు రాబట్టలేదని అంటున్నారు.
తన పీఏ శ్రీనివాస్ ద్వారా లార్సన్ అండ్ టూబ్రో, షాపూర్జీ అండ్ పల్లోంజీ వంటి కాంట్రాక్టు సంస్థల నుంచి తీసుకున్న రూ. 118 కోట్ల గురించి కూడా ప్రస్తావించారు. ఇక స్కిల్ కుంభకోణం విషయంలో అప్పటి ఆర్థికశాఖ అధికారులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నా వాటిని తొక్కేసి డిజైన్ టెక్ కు రూ. 371 కోట్లు ఎలా విడుదల చేయించారని ప్రశ్నించారు.
లోకేష్ కు, అయన సన్నిహితుడు కిలారు రాజేష్ కు మధ్య ఉన్న ఆర్థిక సంబంధాల గురించి, అప్పటి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండి గంటా సుబ్బారావు, సీమెన్స్ ఇండియా ఎండి సుమన్ బోస్ తో ఉన్న సంబంధాలు మీద కూడా ప్రశ్నలు అడిగారు. అయితే వీటిలో వేటికీ చంద్రబాబు సరిగా సమాధానాలు ఇవ్వనట్లు తెలుస్తోంది. దీంతో కష్టడీని పొడిగించాలని సీఐడీ అధికారులు పిటిషన్ వేశారు.