ఏసీబీ కస్టడీకి శివబాలకృష్ణ.. ఆ అధికారుల్లో గుబులు..

ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్టయిన హెచ్‌ఎండీఏ మాజీ డైరక్టర్‌ , రెరా సెక్రటరీ శివబాలకృష్ణ కస్టడీకి ఏసీబీ కోర్టు అనుమతించింది.

ఏసీబీ కస్టడీకి శివబాలకృష్ణ.. ఆ అధికారుల్లో గుబులు..
  • ఎనిమిది రోజుల కస్టడికి ఏసీబీ కోర్టు అనుమతి
  • సుదీర్ఘంగా విచారించనున్న అధికారులు


విధాత : ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్టయిన హెచ్‌ఎండీఏ మాజీ డైరక్టర్‌ , రెరా సెక్రటరీ శివబాలకృష్ణ కస్టడీకి ఏసీబీ కోర్టు అనుమతించింది. దీనితో ఎనిమిది రోజుల పాటు శివబాలకృష్ణ ఏసీబీ అధికారుల కస్టడీలో ఉండనున్నారు. ఏసీబీ అధికారులు పది రోజుల కస్టడీ కోరగా కోర్టు ఎనిమిది రోజులకు అనుమతించింది. గత మూడేళ్లలో ఏసీబీ అధికారులు ఒక అధికారిని కస్టడీలోకి తీసుకోవడం ఇదే తొలిసారి కావడం ఈ సందర్భంగా గమనార్హం. 2020లో 1.10 కోట్ల లంచం కేసులో అరెస్టయిన కీసర తహశీల్ధార్‌ నాగరాజు, మరో నిందితుడు ధర్మారెడ్డిని అప్పట్లో ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. నాగరాజు చంచల్‌గూడలో కిటికీ ఇనుప చువ్వలకు ఉరివేసుకోగా, మరో నిందితుడు ధర్మారెడ్డి బెయిల్‌పై బయటకొచ్చాక చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడం అప్పట్లో కలకలం రేపింది. దీంతో ఏసీబీ మూడేళ్లుగా నిందితుల కస్టడీకి దూరంగా ఉంది.


ఇప్పుడు శివబాలకృష్ణను ఏసీబీ కస్టడీలోకి తీసుకుని అక్రమాస్తులకు సంబంధించి సుదీర్ఘంగా విచారించనున్న నేపథ్యంలో ఆయనతో పాటు పనిచేసిన అధికారుల్లో గుబులు మొదలైంది. హెచ్ఎండీఏ టౌన్‌ ప్లానింగ్‌ విభాగంలో గత మూడేళ్లలో ఇచ్చిన అనుమతులకు సంబంధించిన ఫైళ్లను పరిశీలించేందుకు ఏసీబీ ఇప్పటికే సిద్ధమైంది. కన్జర్వేషన్‌ జోన్‌లలో ఉన్న భూములను కమర్షియల్‌, రెసిడెన్షియల్‌ జోన్‌లుగా అనుమతించడం వంటి అక్రమాలకు, మార్టిగేజ్‌ ఫ్లాట్లను బలవంతంగా స్వాధీనం చేసుకోవడం వంటి అక్రమాలకు శివబాలకృష్ణ పాల్పడ్డారు. పారిశ్రామిక ప్రాంతాల్లో నివాస సముదాయాలు, హైరైజ్ భవనాలకు అనుమతులు వంటి వాటిపై ఏసీబీ ఫోకస్‌ పెట్టనుండటంతో ఈ వ్యవహారంలో శివబాలకృష్ణతో పాటు మరింత మంది అధికారుల ప్రమేయం వెలుగులోకి రావచ్చని భావిస్తున్నారు. దీంతో బాలకృష్ణనను ఏసీబీ విచారించనుండటం సహజంగానే అతడి సహచర అధికారుల్లో అలజడి రేపుతున్నది. ఇప్పటికే శివబాలకృష్ణ బాధితులు ఒక్కొక్కరు ఏసీబీకి ఫిర్యాదు చేస్తున్నారు. అటు రెరా సెక్రటరీగా ఉన్న శివబాలకృష్ణను తొలగించేందుకు కూడా ప్రభుత్వం కసరత్తు చేపట్టింది.