Adilabad | సర్కారీ నిర్ల్యక్షంతోనే ‘కడెం’ కష్టం

Adilabad ప్రమాదకరంగా ఆనకట్ట భవిష్యత్తు మరమ్మతులకు నోచుకోని దీన స్థితి నిధులే కేటాయించని రాష్ట్ర సర్కార్‌ దేవుడే దిక్కంటున్న మంత్రి ఐకే రెడ్డి వర్షాకాలం మొదలైందంటే చాలు.. కడెం ప్రాజెక్టు గడగడ వణికిపోతుంది. ప్రాజెక్టు దిగువన ఉన్న గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేత పట్టుకుని గడుపుతారు. కట్టుబట్టలతో సురక్షిత ప్రాంతాలకు తరలిపోతారు. ప్రాజెక్టుకు తగిన మరమ్మతులు సకాలంలో చేపట్టక పోవడం దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తున్నది. ఈ ప్రాజెక్టుకు శాపంగా మారిన మరమ్మతులకు నిధులు విడుదల […]

Adilabad  | సర్కారీ నిర్ల్యక్షంతోనే ‘కడెం’ కష్టం

Adilabad

  • ప్రమాదకరంగా ఆనకట్ట భవిష్యత్తు
  • మరమ్మతులకు నోచుకోని దీన స్థితి
  • నిధులే కేటాయించని రాష్ట్ర సర్కార్‌
  • దేవుడే దిక్కంటున్న మంత్రి ఐకే రెడ్డి

వర్షాకాలం మొదలైందంటే చాలు.. కడెం ప్రాజెక్టు గడగడ వణికిపోతుంది. ప్రాజెక్టు దిగువన ఉన్న గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేత పట్టుకుని గడుపుతారు. కట్టుబట్టలతో సురక్షిత ప్రాంతాలకు తరలిపోతారు. ప్రాజెక్టుకు తగిన మరమ్మతులు సకాలంలో చేపట్టక పోవడం దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తున్నది. ఈ ప్రాజెక్టుకు శాపంగా మారిన మరమ్మతులకు నిధులు విడుదల చేయని ప్రభుత్వం నిర్లక్ష్యం.. దాని పర్యవసానాలపై విధాత ప్రత్యేక కథనం.

విధాత ప్రతినిధి, ఉమ్మడి ఆదిలాబాద్: నిర్మల్ జిల్లా కడెం మండలంలోని కడెం ప్రాజెక్టుకు భారీగా వరదనీరు పోటెత్తింది. ప్రాజెక్టు సామర్ధ్యం 700 అడుగులు ఉంటే.. అంతకు మించిన స్థాయిలో వరద రావడంతో అప్రమత్తమైన అధికారులు 14 గేట్లు ఎత్తి నీటిని కిందికి వదిలారు. మరో నాలుగు గేట్లు మొరాయించడంతో రెండు లక్షల క్యూసెక్కుల నీటిని మాత్రమే 14 గేట్ల ద్వారా నీటిని కిందికి వదిలారు.

ఇన్‌ఫ్లో 4 లక్షల క్యూసెక్కులు ఉంటే.. రెండున్నర లక్షల క్యూసెక్కులను మాత్రమే వదిలే అవకాశం ఉండి.. మరో ఒకటిన్నర లక్షల క్యూసెక్కుల నీరు.. ప్రాజెక్టు పై నుంచి గోదావరిలోకి వెళుతున్న దృశ్యం.. ఒళ్లుగగుర్పొడిచేలా చేసింది. 65 ఏళ్ల క్రితం ఈ ప్రాజెక్టును డిజైన్‌ చేసిన ఇంజినీర్ల నైపుణ్యం.. ప్రాజెక్టును కాపాడింది. గేట్ల పైనుంచి వరద నీరు పొంగినా ప్రాజెక్టుకు ఎలాంటి నష్టం వాటిల్లలేదంటే.. వారి పనితనం పుణ్యమేనని స్థానికులు, పలువురు అధికారులు చెబుతున్నారు.

కట్టిన కొంతకాలానికే వరద

ప్రాజెక్టును నిర్మించిన కొంత కాలానికి అంటే 1959లో భారీగా వరద వచ్చింది. అప్పటికి కడెం ప్రాజెక్టుకు 9 గేట్లే ఉండేవి. వరద ఉధృతి తరచూ ఉంటున్న నేపథ్యంలో అప్పటి ప్రభుత్వాలు 9 గేట్లు ఉన్న ప్రాజెక్టును 18 గేట్లతో పునర్నిర్మాణం చేశారు. అప్పటి నుండి కొన్ని సంవత్సరాల వరకు ప్రాజెక్టుకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు. రెండోసారి 1995లో మరోసారి భారీ వరద వచ్చింది. దాని ఫలితంగా ప్రాజెక్టుకు రెండు వైపులా ఉన్న ఆనకట్ట కోతకు గురైంది. కోతకు గురైన ఆనకట్టను పటిష్టంగా పునర్నిర్మించారు.

మూడోసారి 2022 జూలైలో భారీ వర్షాలు రావడంతో ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరింది. ఐదు లక్షల క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లో రావడంతో 18 గేట్లను ఎత్తేందుకు ప్రయత్నించినా.. మూడు గేట్లు మొరాయించాయి. దాంతో 2.30 లక్షల క్యూసెక్కుల నీరు మాత్రమే గేట్ల ద్వారా దిగువకు విడుదలైంది.

మిగిలిన నీళ్లు.. ప్రాజెక్టు గేట్లను మీదుగా పారి.. మరోసారి కలవరం రేపాయి. అయితే.. ప్రాజెక్టు సైడ్ కట్టకు గండిపడటంతో ప్రమాదం తప్పింది. వర్షాలు తగ్గుముఖం పట్టి.. వరద నీరు తగ్గి, ప్రాజెక్టు సేఫ్ జోన్‌లోకి వెళ్ళింది. గత సంవత్సరం కూడా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దేవునిపై భారం వేశారు.

ఇప్పటికీ అదే ముప్పు

ఈ ఏడాది కూడా అదే తరహా ప్రమాదాన్ని కడెం ప్రాజెక్టు ఎదుర్కొన్నది. 5 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. మొత్తం గేట్లు ఎత్తేందుకు ప్రయత్నించినా.. 4 గేట్లు తెరుచుకోలేదు. దీంతో 14 గేట్లతోనే 2 లక్షల 30 వేల క్యూసెక్కుల నీటిని వదిలారు. వరద ఉధృతి పెరిగి.. ప్రాజెక్టు గేట్ల మీద నుంచి ఈసారి కూడా దాదాపు 2 లక్షల క్యూసెక్కుల నీళ్లు పారాయి.

ప్రాజెక్టు పర్యవేక్షణ పేరుతో వెళ్లిన జిల్లా కలెక్టర్‌తోపాటు.. ఎమ్మెల్యే రేఖానాయక్‌.. హుటాహుటిన ప్రాజెక్టు నుంచి పరుగులు తీయాల్సిన పరిస్థితి నెలకొన్నది. ఇన్ని సందర్భాల్లోనూ ప్రకృతి కరుణించడం వల్లే.. ఎలాంటి ఆపద ఎదురు కాలేదు. కానీ.. అదే ధీమాతో ఎన్నేండ్లు?

ఏదైనా.. కడెం ప్రాజెక్టు అత్యంత విషయ స్థితిలో ఉన్నదనే విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నది. ఇది రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం ఫలితమేనని స్థానికులు మండిపడుతున్నారు. గత ఏడాది గేట్ల పై నుంచి నీళ్లు పారిన అనుభవం ఉన్నా.. దాని నుంచి ఎలాంటి గుణపాఠాన్నీ ప్రభుత్వం నేర్చుకోలేదని విమర్శిస్తున్నారు.

మరమ్మతులు చేసేందుకు నిధులు విడుదల చేయకపోవడంతోనే.. మళ్లీ గేట్లు మొరాయించాయని అంటున్నారు. కట్టిన కొంతకాలానికే అవుట్‌ఫ్లో సామర్థ్యం సరిపోదని గుర్తించి, ఏకంగా రెట్టింపు సంఖ్యలో గేట్లు పెంచిన ఆనాటి సర్కారుకు ఉన్న చిత్తశుద్ధి.. ప్రస్తుత ప్రభుత్వంలో కనిపించడం లేదని దుయ్యబడుతున్నారు. దాని వల్లే ప్రతి ఏడాది తాము ప్రాణాలు అరచేతబట్టుకుని సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కనీసం ప్రాజెక్టు నిర్వహణకు కూడా నిధులు మంజూరు చేయడం లేదన్న ఆరోపణలు కూడా వ్యక్తమవుతున్నాయి. తాజా పరిణామాల నేపథ్యంలో పెద్ద సంఖ్యలో స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వారంతా ఎమ్మెల్యే రేఖానాయక్‌కు, మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

వారి నిర్లక్ష్యం కారణంగానే ప్రతి ఏటా తాము ఇబ్బందుల పడుతున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఏడాది అనుభవాలను దృష్టిలో ఉంచుకుని తగిన చర్యలు తీసుకుని ఉంటే.. ఈ భయానక పరిస్థితి ఉండేది కాదని ఆగ్రహిస్తూ ఎమ్మెల్యేను ఘొరావ్‌ చేశారు. మరమ్మతులకు నిధులు కేటాయించకుడా.. దేవుడే దిక్కు అని మంత్రి మాట్లాడటంపై మండిపడ్డారు.

జరగరానిది జరిగి, ఆనకట్ట తెగితే తమ 12 గ్రామాల పరిస్థితి ఏంటని నిలదీశారు. ఇప్పటికి మూడుసార్లు కడెం ప్రాజెక్టు వరద ముప్పు నుండి బయటపడ్డామని, ఆ దేవుడే నాలుగోసారీ ముప్పు నుండి కాపాడాలని కోరుకుంటున్నారు.