17వ లోక్‌సభ పనితీరుపై ఏడీఆర్‌ నివేదికలో ఆసక్తికర విషయాలు!

17వ లోక్‌సభ పదవీకాలం ముగింపునకు వస్తున్నది. ఆలోపే కొత్త లోక్‌సభను ఎన్నుకునేందుకు రంగం సిద్ధమైంది.

  • By: Somu    latest    Mar 27, 2024 12:57 PM IST
17వ లోక్‌సభ పనితీరుపై ఏడీఆర్‌ నివేదికలో ఆసక్తికర విషయాలు!
  • ప్రవేశపెట్టిన రోజే 45 బిల్లులకు ఆమోదం
  • మొత్తం 240 బిల్లులు సభకు..
  • ఆమోదం పొందినవి 222 బిల్లులు
  • ఏడీఆర్‌ నివేదికలో ఆసక్తికర సంగతులు


న్యూఢిల్లీ : 17వ లోక్‌సభ పదవీకాలం ముగింపునకు వస్తున్నది. ఆలోపే కొత్త లోక్‌సభను ఎన్నుకునేందుకు రంగం సిద్ధమైంది. అయితే.. 17వ లోక్‌సభలో ఆసక్తికర అంశాలను అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రైట్స్‌ (ఏడీఆర్‌) సంస్థ, నేషనల్‌ ఎలక్షన్‌ వాచ్‌ (ఎన్‌ఈడబ్ల్యూ) ఒక నివేదికలో పేర్కొన్నాయి. 17వ లోక్‌సభలో మొత్తం 240 బిల్లులను ప్రవేశపెట్టగా.. అందులో 222 బిల్లులు సభ ఆమోదం పొందాయి.


అయితే.. ఇందులో 45 బిల్లులు ప్రవేశపెట్టిన రోజే లోక్‌సభ ఆమోదం పొందటం విశేషం. వీటిలో వోట్‌ ఆన్‌ అకౌంట్‌, జమ్ముకశ్మీర్‌ అప్రాప్రియేషన్‌ (నంబర్‌ 2) బిల్లు, సెంట్రల్‌ గూడ్స్‌ అండ్‌ సర్వీసెస్‌ ట్యాక్స్‌ (సవరణ) బిల్లు 2023, ఎలక్షన్‌ చట్టాలు (సవరణ బిల్లు 2021) వంటివి కూడా ఉన్నాయి. 11 బిల్లులను ప్రభుత్వం ఉపసంహరించుకున్నది. ఆరు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఒక బిల్లుకు మాత్రమే రాష్ట్రపతి ఆమోదం లభించింది.


సగటున ఒక ఎంపీ 165 ప్రశ్నలు అడిగారు. మొత్తం 273 సిటింగ్స్‌ నిర్వహించగా.. సగటున ఒక ఎంపీ 189 సిటింగ్స్‌కు హాజరయ్యారు. ఛత్తీస్‌గఢ్‌ ఎంపీలు హాజరు విషయంలో ఎంతో మెరుగ్గా ఉన్నారు. ఆ రాష్ట్రం నుంచి 11 మంది ఎంపీలు ఉండగా, మొత్తం 273 సిటింగ్స్‌కు 216 సిటింగ్స్‌కు హాజరయ్యారు. దీనికి భిన్నంగా.. అరుణాచల్‌ ప్రదేశ్‌ ఎంపీలు ఉన్నదే ఇద్దరు.. వారు కూడా 127 సిటింగ్స్‌కు మాత్రమే హాజరయ్యారు.


ప్రశ్నలు అడగడంలో మహారాష్ట్ర ఎంపీలు చురుకుగా వ్యవహరించారని ఏడీఆర్‌, ఎన్‌ఈడబ్ల్యూ విశ్లేషణ పేర్కొంటున్నది. ఈ రాష్ట్రానికి చెందిన 49 మంది ఎంపీలు సగటున 315 ప్రశ్నలు అడిగారు. మణిపూర్‌ ఎంపీలు సగటున 25 ప్రశ్నలకు పరిమితమయ్యారు.


పార్టీల విషయానికి వస్తే.. ఎన్సీపీకి చెందిన ఐదుగురు ఎంపీలు సగటున 410 ప్రశ్నలు సంధించారు. అప్నాదళ్‌కు ఉన్న ఇద్దరు ఎంపీలు సగటున చెరొక ఐదు ప్రశ్నలు మాత్రమే వేశారు.

తెలుగు దేశం పార్టీ (టీడీపీ) సభ్యులు మొత్తం 273 సిటింగ్స్‌కు గాను 229 సిటింగ్స్‌కు హాజరయ్యారు. ఆప్‌ సభ్యులు సగటున 57 సిటింగ్స్‌కు మాత్రమే వచ్చారు.


పార్లమెంటరీ ప్రక్రియలో చురుకుగా పాల్గొన్న పదిమంది ఎంపీల పేర్లను ఏడీఆర్‌, ఎన్‌ఈడబ్ల్యూ తమ నివేదికలో తెలిపాయి. వీరు అత్యధిక ప్రశ్నలు అడిగారు. బీజేపీకి చెందిన బలూర్‌ఘాట్‌ ఎంపీ కుకాంత మజుందార్‌ 596 ప్రశ్నలు అడిగి అగ్రస్థానంలో నిలిచారు. ఎక్కువ ప్రశ్నలు ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, వ్యవసాయం, రైతుల సంక్షేమం, రైల్వేస్‌ వంటి అంశాల్లో ఉన్నాయని ఏడీఆర్‌, ఎన్‌ఈడబ్ల్యూ నివేదిక తెలిపింది.