పాక్ నుంచి బిచ్చగాళ్ల ఎగుమతి!

- మధ్య ఆసియా దేశాలకు పెద్ద సంఖ్యలో వలసలు
- తీర్థయాత్ర పేరిట వీసాలు.. వెళ్లాక వీధుల్లో భిక్షాటన
- సౌదీ అరేబియా, ఇరాక్ దౌత్యవేత్తల ఆందోళన
- పాకిస్థాన్‌లో నానాటికీ పెరుగుతున్న పేదరికం
ఇస్లామాబాద్: పాక్‌నుంచి ఉగ్రవాదం ఎగుమతితో భారత్ ఎంత నష్టపోయిందో.. ఇప్పటికీ ఎంత నష్టపోతున్నదో తెలిసిందే! ఇదే పాకిస్థాన్ గతంలో చైనాకు గాడిదలను ఎగమతి చేసింది! ఇప్పుడు వారి తాజా ఎగమతి.. బిచ్చగాళ్లు! వినటానికి ఆశ్చర్యంగా ఉన్నా.. గణాంకాలను గమనిస్తే తేలుతున్న వాస్తవమిది!
బిచ్చగాళ్లను పాకిస్థాన్ పనిగట్టుకుని ఎగమతి చేయకపోయినా.. పాక్‌ను వదిలిపోతున్న బిచ్చగాళ్లు అధిక సంఖ్యలో ఉంటున్నారట! వీరంతా సౌదీ అరేబియా, ఇరాక్ వంటి దేశాలకు బొచ్చె చేత బట్టుకుని వలస పోతున్నారట! ఇది ఏ స్థాయికి వెళ్లిందంటే.. ఆయా దేశాలు పాకిస్థాన్‌కు ఒక విన్నపం చేస్తూ.. మీ దేశం నుంచి మా దేశానికి వచ్చే బిచ్చగాళ్లను కాస్త కట్టడి చేయండి సాబ్.. అనేంత! మక్కాలోని గ్రాండ్ మసీదులో జేబులు కొట్టేవారిలో అత్యధికులు పాకిస్థానీయులేనట!
పాకిస్థాన్ మునుపెన్నడూ లేనంత ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొంటున్నది. పెరుగుతున్న ఆహార, ఇంధన ధరలతో పేద పాకిస్థానీయుల జీవితాలు అల్లకల్లోలానికి గురవుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో అప్పటికే ఉన్న బిచ్చగాళ్లు, జీవితాలు తలకిందులైన కొత్తగా బిచ్చగాళ్లుగా మారినవారు పెద్ద సంఖ్యలో పశ్చిమాసియా దేశాలకు తరలిపోతున్నారు.
సాక్షాత్తూ పాకిస్థాన్ ఓవర్సీస్ స్థాయీ సంఘమే ఈ పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేయడం గమనార్హం. పశ్చిమాసియా దేశాల్లో అరెస్టయిన బిచ్చగాళ్లలో 90శాతం మంది పాకిస్థానీయులేనని, వీరంతా ఇరాక్, సౌదీ అరేబియా జైళ్లలో మగ్గుతున్నారని పాకిస్థాన్ ఓవర్సీస్ స్థాయీ సంగం కార్యదర్శి జీషాన్ ఖాన్‌జాదా చెప్పారు.
తీర్థయాత్రల పేరిట ఉమ్రా వీసాలపై పాకిస్థాన్ బిచ్చగాళ్లు ప్రయాణాలు చేస్తున్నారని, అనంతరం వీధుల్లో భిక్షం ఎత్తుకుంటున్నారని ఇరాక్, సౌదీ అరేబియా దౌత్యవేత్తలు చెబుతున్నారని పాకిస్థాన్‌కు చెందిన జియో న్యూస్.. ఖాన్‌జాదాను ఉటంకిస్తూ పేర్కొన్నది.
సెనెటర్ మంజూర్ కక్కర్ అధ్యక్షతన జరిగిన స్థాయీ సంఘం సమావేశంలో ఖాన్‌జాదా మాట్లాడుతూ.. దాదాపు కోటి మంది పాకిస్థానీలు ఇతర దేశాల్లో ఉన్నారని చెప్పారు. వీరిలో అత్యధికులు భిక్షాటనపైనే ఆధారపడి ఉన్నారని తెలిపారు. ఏదోవిధంగా వీసా సంపాదించి.. ఇతర దేశాలకు వెళ్లి భిక్షాటన చేస్తున్నారని, మధ్య ఆసియా దేశాలకు వెళ్లే విమానాలు తరచూ భిక్షగాళ్లతోనే నిండిపోతున్నాయని ఆయన వివరించారు.
ప్రస్తుతం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో 16 లక్షల మంది, ఖతార్‌లో 2 లక్షల మంది పాకిస్థానీలు ఉన్నారని ఆ దేశానికి చెందిన ది ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ వెల్లడించింది. తమ జైళ్లు కూడా పాక్ భిక్షగాళ్లతో నిండిపోతున్నాయని కూడా ఇరాక్, సౌదీ అరేబియా దౌత్యాధికారులు చెబుతున్నారని ఖాన్‌జాదా పేర్కొన్నారు. ఈ అంశం ప్రపంచ స్థాయిలో పాకిస్థాన్ పరువు తీస్తున్నదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
గత ఏడాదితో పోల్చితే ఈ సంవత్సరం పాకిస్థాన్‌లో పేదరికం ఏకంగా 39.4 శాతం పెరిగింది. దయనీయమైన ఆర్థిక పరిస్థితుల కారణంగా దాదాపు కోటీ 25 లక్షల మంది ప్రజలు పేదరికంలో కూరుకుపోతున్నారని గతంలో ప్రపంచ బ్యాంకు సైతం పేర్కొన్నది.
ఈ పరిస్థితుల్లో పాకిస్థాన్ ప్రభుత్వం ఇప్పటి వరకూ పన్నుకు దూరంగా ఉంచిన వ్యవసాయం, రియల్ ఎస్టేట్ రంగాలను సైతం పన్ను పరిధిలోకి తేవాలని, దుబారా ఖర్చులను తగ్గించుకుని, ఆర్థిక సుస్థిరతను సాధించాలని ప్రపంచ బ్యాంకు సూచించింది.
గాడిదల సంఖ్య పెరిగింది
గత ఆర్థిక సంవత్సరం 5.70 కోట్లుగా ఉన్న గాడిదల సంఖ్య 2022-23 ఆర్థిక సంవత్సరానికి 5.80 కోట్లకు పెరిగిందని పాక్ ఎకనమిక్ సర్వే పేర్కొంటున్నది. చైనా నుంచి గాడిదలకు భారీ డిమాండ్ ఉండటం వల్లే పాక్‌లో వీటి సంఖ్య గణనీయంగా పెరుగుతున్నదని అంచనా.