మంత్రులుగా ప్రమాణం చేయబోయేది వీరేనా?

పార్టీలో కాబోయే సీఎం ఎవరు అన్నది నిన్నటివరకు ఉత్కంఠ నెలకొన్నది. దానికి ఆ పార్టీ అధిష్ఠానం తెరదించుతూ రేవంత్‌రెడ్డి పేరును అధికారికంగా ప్రకటించింది.

మంత్రులుగా ప్రమాణం చేయబోయేది వీరేనా?
  • రేవంత్‌రెడ్డితో పాటు 17 మంత్రుల ప్రమాణం


విధాత: పార్టీలో కాబోయే సీఎం ఎవరు అన్నది నిన్నటివరకు ఉత్కంఠ నెలకొన్నది. దానికి ఆ పార్టీ అధిష్ఠానం తెరదించుతూ రేవంత్‌రెడ్డి పేరును అధికారికంగా ప్రకటించింది. గురువారం మధ్యాహ్నం 1.04 గంటలకు ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే. అయితే రేవంత్‌తో పాటు మంత్రులుగా ఎవరు ప్రమాణ స్వీకారం చేయనున్నారనే దానిపై కూడా ఆసక్తి నెలకొన్నది. దీనిపై పార్టీ అధిష్ఠానంతో చర్చించడానికి రేవంత్‌రెడ్డి హస్తిన వెళ్లిన విషయం తెలిసిందే. నేడు రేవంత్‌తో పాటు 17 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. 

 మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉన్న ఎమ్మెల్యేలు ?

మంత్రివర్గ కూర్పులో అన్ని జిల్లాలు, అన్నివర్గాలకు ప్రాధాన్యం ఇచ్చినట్టు సమాచారం. ఉమ్మడి జిల్లాల వారీగా మంత్రి పదవులు దక్కే వారి జాబితా చూస్తే ఖమ్మం జిల్లా నుంచి సీఎం సీటు ఆశించిన సీనియర్‌ నేత భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం దాదాపుగా ఖరారైనట్టే. ఆయనతో పాటు అదే జిల్లాకు చెందిన తుమ్మల నాగేశ్వర్‌రావుకు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిలకు అవకాశం దక్కనున్నది. సంగారెడ్డి జిల్లా నుంచి మరో సీనియర్‌ నేత దామోదర రాజనర్సింహ, మంచిర్యాల జిల్లా నుంచి ఎమ్మెల్యే గడ్డం వివేక్‌, నల్గొండ జిల్లా నుంచి మరో ఇద్దరు సీనియర్‌ నేతలైన ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలకు కూడా మంత్రివర్గంలో చోటు దక్కనున్నది. కరీంనగర్‌ జిల్లా నుంచి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు, పొన్నం ప్రభాకర్‌లకు బెర్త్‌ దక్కొచ్చు. మంత్రివర్గంలో మహిళలకు తగిన ప్రాధాన్యం కల్పించే ఉద్దేశంతో ములుగు జిల్లా నుంచి సీతక్క, హనుమకొండ జిల్లా నుంచి కొండా సురేఖలను క్యాబినెట్‌లోకి తీసుకోనున్నారని తెలుస్తోంది. నారాయణపేట జిల్లా నుంచి శ్రీహరి, నాగర్‌కర్నూల్‌ జిల్లా నుంచి జూపల్లి కృష్ణారావు, నిజామాబాద్‌ జిల్లా నుంచి షబ్బీర్‌ అలీని, రంగారెడ్డి జిల్లా నుంచి మల్‌రెడ్డి రంగారెడ్డి, వీర్లపల్లి శంకరయ్యల మంత్రివర్గంలోకి తీసుకోనున్నారు. అలాగే స్పీకర్‌గా రేవూరి ప్రకాశ్‌రెడ్డి , దుద్దిళ్ల శ్రీధర్‌బాబులలో ఎవరో ఒకరిని ఎన్నుకోనున్నారని కూడా సమాచారం.