WWDC 2024 | కొత్త ఆవిష్కరణలకు సిద్ధమైన యాపిల్.. WWDC 2024 తేదీలు వెల్లడి

WWDC 2024 : ప్రముఖ టెక్ కంపెనీ యాపిల్ కొత్త ఆవిష్కరణలకు సిద్ధమైంది. ప్రతి ఏడాది ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే ‘వరల్డ్ వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ (WWDC)’ 2024 తేదీలను ప్రకటించింది. ఈ కాన్ఫరెన్స్ ద్వారా రానున్న ఏడాదిలో కంపెనీ తీసుకురానున్న కొత్త సాఫ్ట్‌వేర్ ఫీచర్లు, ఉత్పత్తుల గురించి యూజర్లకు పరిచయం చేస్తుంటుంది.
ఈ ఏడాది WWDC కాన్ఫరెన్స్‌ను వర్చువల్ వేదికగా జూన్ 10 నుంచి 14 వరకు నిర్వహించనున్నట్లు యాపిల్ వెల్లడించింది. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఏఐ హవా నడుస్తోంది. ఈ తరుణంలో యాపిల్ తీసుకురానున్న సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్లను కూడా జోడించే అవకాశం ఉందని టెక్ వర్గాలు భావిస్తున్నాయి.
క్లౌడ్ ఆధారిత జెన్‌ఏఐ ఫీచర్‌ను తీసుకొచ్చేందుకు గూగుల్, బైదూ లాంటి ఏఐ సంస్థలతో భాగస్వామ్యం గురించి సమాచారం అందొచ్చని నివేదికలు తెలుపుతున్నాయి. ఇక iOS 18, iPadOS 18, macOS 15, watchOS 11, tvOS 18లో కొత్త ఆపరేటింగ్ సిస్టమ్స్ వివరాలను పరిచయం చేస్తారని తెలుస్తోంది. ఐపాడ్ ఎయిర్, ఓఎల్‌ఈడీ ఐపాడ్ ప్రోలో కొత్త మోడల్స్‌ను లాంచ్ చేసే అవకాశం ఉందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
యాపిల్ నిర్వహించనున్న కాన్ఫరెన్స్ ఆన్‌లైన్ అయినప్పటికీ మొదటి రోజు వ్యక్తిగతంగా వెళ్లి హాజరయ్యే అవకాశం ఉందని సంస్థ తెలిపింది. ఆసక్తి ఉన్నవాళ్లు యాపిల్ డెవలపర్ యాప్, కంపెనీ వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. యాపిల్ స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్ విజేతలు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది.