28 నుంచి కొత్త రేషన్ కార్డులు.. ఇళ్లకు దరఖాస్తులు
ఈనెల 28నుంచి తెలంగాణ ప్రభుత్వం నిర్వహించనున్న గ్రామసభలలో కొత్త రేషన్ కార్డులకు, ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తులు తీసుకోవాలని నిర్ణయించింది.

విధాత: ఈనెల 28నుంచి తెలంగాణ ప్రభుత్వం నిర్వహించనున్న గ్రామసభలలో కొత్త రేషన్ కార్డులకు, ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తులు తీసుకోవాలని నిర్ణయించింది. ఇప్పటికే పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి 28వ తేదీ నుంచి నిర్వహించనున్న గ్రామసభలలో రేషన్ కార్డులకు పేదలు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు.
గ్రామసభల ద్వారా అందిన దరఖాస్తుల ద్వారానే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ జరుగనుందని తెలిపారు. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లతో పాటు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీల పథకాలకు సంబంధించి అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. అయితే ఎన్నికలకు ముందు గత బీఆరెస్ ప్రభుత్వం గృహలక్ష్మి పథకం కింద స్వీకరించిన దరఖాస్తులు రద్దు కానున్నాయి. పేదలు మళ్లీ గ్రామసభల ద్వారా ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకోవాల్సివుంటుంది.
బీఆరెస్ ప్రభుత్వం గృహలక్ష్మి పథకం కింద సొంత జాగ ఉన్న వారికి 3లక్షల సహాయం గృహలక్ష్మి పథకం కింద ఇవ్వాలని నిర్ణయించింది. ఎన్నికలకు ముందు 15లక్షల దరఖాస్తులు స్వీకరించి వడపోత తర్వాతా 11లక్షల మందిని అర్హులుగా తేల్చారు. వాటిలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి 3వేల చొప్పున లబ్ధిదారులను ఎంపిక చేసినప్పటికి ఎన్నికల కోడ్ కారణంగా ఆ పథకం అటకెక్కింది. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గృహలక్ష్మి పథకం రద్దు చేసి 5లక్షలతో అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయనుంది.