భారత్ సరిహద్దుల్లో పాక్ డ్రోన్లు.. కాల్పులు జరిపిన ఆర్మీ దళాలు
జమ్ముకశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో రెండు వేర్వేరు ప్రదేశాల్లో శుక్రవారం ఉదయం పాక్ డ్రోన్లు కనిపించాయి

- పాక్ వైపు వెళ్లిన ఎరిగే వస్తువులు
- డ్రోన్ల సమాచారం ఇచ్చినవారికి
- రూ.3 లక్షల నగదు బహుమతి
- జమ్మకశ్మీర్ పోలీసుల ప్రకటన
విధాత: జమ్ముకశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో రెండు వేర్వేరు ప్రదేశాల్లో శుక్రవారం ఉదయం పాక్ డ్రోన్లు కనిపించాయి. పాక్ క్వాడ్‌కాప్టర్లను నేలకూల్చేందుకు నియంత్రణ రేఖ (ఎల్‌వోసీ) వద్ద కాపలాగా ఉన్నభారత ఆర్మీ దళాలు కాల్పులు జరిపినట్టు అధికారులు తెలిపారు. బాల్నోయ్-మెంధార్తోపాటు గుల్పూర్ సెక్టార్‌లోని భారత భూభాగంపై కొద్దిసేపు ఎగిరిన డ్రోన్లు తిరిగిన పాకిస్తాన్ వైపు వెళ్లినట్టు పేర్కొన్నారు.
క్వాడ్‌కాప్టర్ల ద్వారా ఆయుధాలు లేదా మాదక ద్రవ్యాలు పడకుండా చూసేందుకు రెండు విభాగాల్లో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించినట్టు ఆర్మీ అధికారులు తెలిపారు. శుక్రవారం ఉదయం 6.30 గంటల ప్రాంతంలో మెంధార్‌లోని బల్నోయి ప్రాంతంలోకి రెండు క్వాడ్‌కాప్టర్లు రావడాన్ని గమనించిన సైనికులు కాల్పులు జరిపారని, రిమోట్‌తో నియంత్రించే ఆ డ్రోన్లు తిరిగి పాక్ భూభాగంలోకి వెళ్లినట్టు అధికారులు పేర్కొన్నారు. గుల్పూర్ సెక్టార్‌పై తిరుగుతున్న రెండు డ్రోన్లపై భారత సైనికుల కాల్పులు జరిపారని, అవి నేల కూలలేదని, పాక్ భూభాగంలోకి వెళ్లిపోయానని వెల్లడించారు.
ఇదే నెలలో 12వ తేదీన కూడా మెంధార్ సెక్టార్‌లోని మాన్‌కోట్ ప్రాంతంలో శత్రు డ్రోన్ కదలికలను గుర్తించిన ఆర్మీ దళాలు దానిపై కాల్పులు జరిపాయి. జమ్ముకశ్మీర్‌లో మాదక ద్రవ్యాలు, ఆయుధాలను విడిచిపెట్టేందుకు పాకిస్థాన్ డ్రోన్‌లను ఉపయోగిస్తున్నది. ఆయుధాలు, మాదక ద్రవ్యాలను జారవిడిచే ఉద్దేశంతో సరిహద్దు ఆవల నుంచి డ్రోన్లు వచ్చేసమాచారం అందించే ఎవరికైనా రూ.3 లక్షల నగదు బహుమతిని ఇస్తామని జమ్ముకశ్మీర్ పోలీసులు ఇటీవల ప్రకటించారు.