కేసీఆర్ చెంతకు చేరిన ఆరూరి రమేశ్ హైడ్రామా

వర్ధన్నపేట బీఆరెస్ మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ పార్టీ మార్పు వ్యవహారం హైడ్రామాను, సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపిస్తు చివరకు ఆ పార్టీ అధినేత కేసీఆర్ చెంతకు చేరింది

కేసీఆర్ చెంతకు చేరిన ఆరూరి రమేశ్ హైడ్రామా

పార్టీ మారడం లేదంటూ ముక్తాయింపు

విధాత : వర్ధన్నపేట బీఆరెస్ మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ పార్టీ మార్పు వ్యవహారం హైడ్రామాను, సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపిస్తు చివరకు ఆ పార్టీ అధినేత కేసీఆర్ చెంతకు చేరింది. వరంగల్ టికెట్ హామీతో బీజేపీలో చేరేందుకు తన అనుచరులు, కార్యకర్తలతో హన్మకొండలోని తన నివాసంలో బుధవారం ఉదయం ఆరూరి రమేశ్ సమావేశమయ్యారు. ఈ విషయం తెలిసి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, బస్వరాజు సారయ్యలు అక్కడికి వెళ్లి రమేశ్‌ను బుజ్జగించారు. అయినా ఆయన ససేమిరా అనడంతో హరీశ్‌రావు వద్దకు వెళ్లి చర్చిద్దామంటూ బలవంతంగా రమేశ్‌ను ఎర్రబెల్లి తన కారులోఎక్కించుకుని హైదరాబాద్‌కు పయనమయ్యారు.

ఈ సమాచారం తెలుసుకున్న బీజేపీ నేతలు జనగామ జిల్లా పెంబర్తి వద్ద ఎర్రబెల్లి కారును అడ్డుకుని రమేశ్‌ను బలవంతంగా కిందకు దించి తమకారులోకి ఎక్కించారు. అయితే తనను ఎవరు బలవంత పెట్టవద్దని తానే హైదరాబాద్ వస్తానని రమేశ్ స్పష్టం చేశారు. అనంతరం హైదరాబాద్ వచ్చిన రమేశ్‌ను కేసీఆర్ తన వద్దకు పిలిపించుకుని చర్చించారు. కేసీఆర్‌తో చర్చల పిదప తనను ఎవరు కిడ్నాప్ చేయలేదని, తను పార్టీ మారడం లేదని, తాను బీఆరెస్‌లో కొనసాగుతానని మీడియాకు స్పష్టం చేశారు.