ఇది ఈ విశ్వంలోనే ఉండకూడదే… ? శాస్త్రవేత్తలను షాక్‌కు గురిచేసిన ఓ గ్రహం ఉనికి
గతంలో మనం సరైనవి అని అనుకున్న సిద్ధాంతాలు కాలక్రమంలో తప్పు అని నిరూపితమవుతాయి

విధాత: గతంలో మనం సరైనవి అని అనుకున్న సిద్ధాంతాలు కాలక్రమంలో తప్పు అని నిరూపితమవుతాయి. సరైన సమాచారం లేకపోవడం వల్ల గానీ లేదంటే సాంకేతికత అంతగా అభివృద్ధి చెందనప్పుడు కానీ ఇలా తప్పుడు సిద్ధాంతాలనే మనం సరైనవి అనుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతరిక్షం కోణం లోంచి చూస్తే ఇది మరింత నిజం.
ఈ అనంత విశ్వం (Universe) లోపలికి వెళ్లే కొద్దీ.. అంతకు ముందు మనం సరైనవి అనుకున్నవి తప్పు అని తేలుతూ కొత్త విషయాలు తెలుస్తాయి. తాజాగా మనకు సుదూరాన కనపడిన ఒక భారీ గ్రహం.. గ్రహాల జననం (Planets Formation) పై ఇప్పటి వరకు మనం నమ్మిన వాదనను కొట్టిపడేసింది. దీంతో ఈ అంశంలో మనం మళ్లీ మొదటికే వచ్చినట్లు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ అధ్యయనం (Study) వివరాలు ఇటీవల సైన్స్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.
ఎల్‌హెచ్ఎస్ 3154బి అనే పేరుతో పిలుస్తున్న ఓ గ్రహం (Huge Exo Planet).. మన నెప్ట్యూన్ గ్రహం అంత బరువుతో ఉంది. భూమితో పోల్చుకుంటే 13 రెట్లు పెద్దది. అయితే ఇంత పెద్ద గ్రహం విచిత్రంగా ఒక మరుగుజ్జు నక్షత్రం చుట్టూ తిరుగుతోంది. దీనిని ఎల్‌హెచ్ఎస్ 3154 అని పిలుస్తున్నారు. ఇది ఎంత చిన్నదంటే.. ఆ గ్రహానికి ఈ నక్షత్రం చుట్టూ ఒకసారి తిరిగిరావడానికి కేవలం 3.5 రోజులు మాత్రమే పడుతోంది. ఎల్‌హెచ్ఎస్ 3154 అనే ఆ మరుగుజ్జు నక్షత్రం.. సూర్యుని కంటే తొమ్మిది రెట్లు చిన్నది కావడం గమనార్హం.
అత్యంత తక్కువ ఉష్ణోగ్రతతో, చిన్న పరిణామంలో ఉన్న ఈ నక్షత్రం చుట్టూ అంత పెద్ద గ్రహం పరిభ్రమిస్తుండటంతో శాస్త్రవేత్తలు తలలు పట్టుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు ఉన్న సిద్ధాంతం ప్రకారం.. భారీ పరిమాణంలో ఉన్న గ్యాస్, ధూళి ఒక చోట కూడి నక్షత్రం ఏర్పడుతుంది. అందులో కలవని ధూళి అంతా చిన్న చిన్న సమూహాలుగా ఏర్పడి గ్రహాలు ఏర్పడతాయి. ఇలా జరిగినప్పుడు సాధరణంగా నక్షత్రమే పెద్దగా ఉండి.. గ్రహాలు దాని గురుత్వాకర్షణ పరిధిలో ఉంటూ పరిభ్రమిస్తాయి.
కానీ ఎల్‌హెచ్ఎస్ 3154 నక్షత్రాన్ని చూస్తే.. దాని వద్ద ఎల్‌హెచ్ెస్ 3154బి గ్రహాన్ని తయారుచేసేంత పరిమాణంలో గ్యాస్, ధూళి లేవు. నక్షత్రం ఎంత పెద్దగా ఉంటే.. దాని చుట్టూ తిరిగే గ్రహం అంత పెద్దగా ఉంటుందనే మన సిద్ధాంతమే నిజం అనుకుంటే అసలు ఈ గ్రహం ఉనికే విశ్వంలో ఉండకూడదు. దీంతో గ్రహాల జననంపై మనం మరింత లోతుగా.. వేరే కోణంలో పరిశోధనలు చేయాల్సి ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. టెక్సాస్‌లోని మెక్‌డోనాల్డ్ అబ్జర్వేటరీ వాళ్లు ఏర్పాటు చేసిన హాబీ ఎబెర్లీ టెలిస్కోప్ ఈ గ్రహాన్ని, నక్షత్రాన్ని గుర్తించింది. మనకు సుమారు 50 కాంతి సంవత్సరాల దూరంలో ఇవి ఉన్నాయని పరిశోధకులు తెలిపారు.