కనువిందు చేసిన చంద్రగ్రహణం..

కనువిందు చేసిన చంద్రగ్రహణం..

ఖగోళ ప్రియులను చంద్రగ్రహణం అలరించింది. ఈ ఏడాది చివరి చంద్రగ్రహణం శుక్రవారం వేకువ జామున 1.05 గంటలకు ప్రారంభమైంది. దాదాపు 1.20 గంటల పాటు కొనసాగింది. 1.44 గంటల సమయంలో గ్రహణఛాయ ఎక్కువగా కనిపించింది. 2.22 గంటలకు గ్రహణం పూర్తయ్యింది. ఈ పాక్షిక చంద్రగ్రహణం తెలంగాణ, ఏపీతో పాటు భారతదేశవ్యాప్తంగా అందరినీ కనువిందు చేసింది.


భారతదేశంతో పాటు ఆసియా, ఆఫ్రికా, యూరప్, నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్, భూటాన్, మంగోలియా, ఆఫ్ఘనిస్తాన్, చైనా, ఇరాన్, టర్కీ, అల్జీరియా, జర్మనీ, పోలాండ్, నైజీరియా, బ్రిటన్, స్పెయిన్, స్వీడెన్, మలేసియా, ఫిలిప్పీన్స్, థాయ్‌లాండ్, ఆస్ట్రేలియా, జపాన్, ఇండోనేసియా, దక్షిణ కొరియా, ఉత్తర కొరియాల్లో చంద్రగ్రహణం దర్శనమిచ్చింది.


వాస్తవానికి సూర్యుడు- భూమి-చంద్రుడు ఒకే సరళరేఖపైకి వచ్చిన సమయంలో గ్రహణం ఏర్పడుతుంది. భూమి నీడ చంద్రుడి కమ్మేస్తుంది. దీన్నే చంద్రగ్రహణంగా పేర్కొంటారు. భూమి నీడ చంద్రుడి కొంత మేరకు కప్పిన సందర్భంలో పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడుతుంది. మొత్తం కప్పివేస్తే సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుందని ఖగోళ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఖగోళ ప్రియులు చంద్రగ్రహణాన్ని వీక్షించారు.


దేశ రాజధానిలోని నెహ్రూ ప్లానిటోరియం చంద్రగ్రహణాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసింది. ఇదిలా ఉండగా.. ఈ ఏడాది నాలుగు గ్రహణాలు ఏర్పడ్డాయి. ఇందులో రెండు సూర్యగ్రహణాలు కాగా.. రెండు చంద్రగ్రహణాలు ఉన్నాయి. శనివారం వేకువ జామున ఏర్పడిన గ్రహణం ఈ ఏడాది చివరిది. ఇక వచ్చే ఏడాది ఐదు గ్రహణాలు కనువిందు చేయబోతున్నాయి. ఇందులో రెండు సూర్య, మూడు చంద్రగ్రహణాలు ఉన్నాయి.