Maha Shivratri | వేలంలో రూ.35వేలు పలికిన నిమ్మకాయ..! ఎందుకంత స్పెషల్‌ అంటే..?

నిమ్మకాయలు పదిరూపాయలకు రెండుమూడు వస్తుంటాయి. ఎండకాలమైతే ధర కాస్త ఎక్కువగానే ఉంటుంది. అయితే, నిమ్మకాయను వేలం వేయగా రూ.వేలల్లో ధర పలికింది

Maha Shivratri | వేలంలో రూ.35వేలు పలికిన నిమ్మకాయ..! ఎందుకంత స్పెషల్‌ అంటే..?

Maha Shivratri | నిమ్మకాయలు పదిరూపాయలకు రెండుమూడు వస్తుంటాయి. ఎండకాలమైతే ధర కాస్త ఎక్కువగానే ఉంటుంది. అయితే, నిమ్మకాయను వేలం వేయగా రూ.వేలల్లో ధర పలికింది. అవును మీరు చదివింది నిజమే. పది కాదు.. వంద కాదు ఏకంగా రూ.35వేల ధరకు ఓ వ్యక్తి సొంతం చేసుకున్నాడు. అయితే, ఈ నిమ్మకాయలో అంత స్పెషల్‌ ఏముందోనని ఆలోచిస్తున్నారా..? అసలు నిమ్మకాయ వేలం కథ ఏందో తెలుసుకుందాం రండి..! ఈ ఘటన తమిళనాడులో చోటు చేసుకున్నది. ఈరోడ్‌కు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న శివగిరి మీపంలోని పాతపూసయ్య ఆలయంలో శివరాత్రి పండుగ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.


పర్వదినం సందర్భంగా మహా శివుడి పూజలో పండ్లు, నిమ్మకాయలతో నివేదన చేశారు. అయితే, శివుడి పూజకు వినియోగించిన పండ్లతోపాటు వస్తువులకు వేలం నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. ఇందులో భాగంగా నిమ్మకాయను వేలం వేయగా.. ఓ భక్తుడు ఏకంగా రూ.35వేలకు వేలంపాటపాడి దక్కించుకున్నాడు. సుమారు 15 మంది భక్తులు వేలంలో పాల్గొన్నారు. శివుడి పూజకు వినియోగించిన అన్ని వస్తువులను వేలం వేయగా.. కేవలం నిమ్మకాయ మాత్రమే రూ.35వేలకు అమ్ముడైంది.


ఆ నిమ్మకాయను దక్కించుకున్న భక్తుడికి ఆలయంలో మరోసారి పూజ చేసి.. పూజారి అందజేశారు. అయితే, ఏటా శివరాత్రి సందర్భంగా స్వామివారికి సమర్పించిన నిమ్మకాయను పొందడం తమ అదృష్టంగా భక్తులు భావిస్తారు. నిమ్మకాయను పొందిన భక్తులు అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయని.. ఆయురారోగ్యాలతో ఉంటారని భక్తుల విశ్వాసం. అయితే, ఏటా శివపూజకు వేలం నిర్వహించడం ఈ ఆలయ సంప్రదాయంగా వస్తున్నా.. ఇంత భారీ ధర పలకడం ఇదే తొలిసారి.