Maha Shivaratri | మహా శివరాత్రి.. తెలంగాణలోని ఈ శైవక్షేత్రాలను దర్శిస్తే ఎంతో పుణ్యం..!
Maha Shivaratri | మహా శివరాత్రి పర్వదినానికి తెలంగాణలోని శైవక్షేత్రాలన్నీ ముస్తాబవుతున్నాయి. ఇప్పటికే పలు ఆలయాల్లో శివరాత్రి సందడి మొదలైంది. భక్తులు శివాలయాలను దర్శించుకుంటూ.. మొక్కులు చెల్లించుకుంటున్నారు.
Maha Shivaratri | మహా శివరాత్రి పర్వదినానికి తెలంగాణలోని శైవక్షేత్రాలన్నీ ముస్తాబవుతున్నాయి. ఇప్పటికే పలు ఆలయాల్లో శివరాత్రి సందడి మొదలైంది. భక్తులు శివాలయాలను దర్శించుకుంటూ.. మొక్కులు చెల్లించుకుంటున్నారు. అయితే ఈ నెల 15న శివరాత్రి సందర్భంగా తెలంగాణలోని ఈ శైవక్షేత్రాలను దర్శించుకుంటే ఎంతో పుణ్యం కలుగుతుంది.
వేయి స్తంభాల గుడి
వరంగల్ జిల్లా హనుమకొండలోని వేయి స్తంభాల గుడి దేశవ్యాప్తంగా ప్రసిద్ధి గాంచింది. 12వ శతాబ్దంలో కాకతీయ రాజులు ఈ ఆలయాన్ని నిర్మించారు. త్రికూటాత్మకంగా నిర్మితమైన ఈ ఆలయంలో ఒక కూటంలో శివుడు, మరో కూటంలో విష్ణువు, ఇంకొక కూటంలో సూర్యభగవానుడు కొలువై ఉన్నారు. ఈ ఆలయానికి హైదరాబాద్ నుంచి వెళ్లాలనుకుంటే ఎంజీబీఎస్, ఉప్పల్ నుంచి బస్సులు ఉంటాయి.
వేములవాడ
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ తెలంగాణలోనే అత్యంత ప్రసిద్ధ శైవక్షేత్రం. ఇక్కడ శివుడు రాజరాజేశ్వర స్వామిగా కొలువుదీరాడు. ఈ ఆలయానికి అపారమైన పురాణ ప్రాధాన్యం ఉంది. ఇంద్రుడు బ్రహ్మహత్య పాపం నుంచి విముక్తి పొందిన క్షేత్రంగా వేములవాడకు ప్రత్యేక స్థానం ఉంది. నిత్యం భక్తులతో కళకళలాడే ఈ ఆలయం మహా శివరాత్రి రోజున మరింత వైభవంగా దర్శనమిస్తుంది. వేములవాడ రాజన్న టెంపులు హైదరాబాద్ నగరానికి 150 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయానికి జేబీఎస్ నుంచి బస్సులు అందుబాటులో ఉంటాయి.
కొమురవెల్లి
సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లన్న శివభక్తులకు అత్యంత సుపరిచితం. సుమారు 500 ఏళ్లుగా ఇక్కడ శివుడు మల్లన్న రూపంలో పూజలందుకుంటున్నాడని విశ్వాసం. సంక్రాంతి సమయంలో జరిగే పట్నాలు, మహా శివరాత్రి నాడు జరిగే కల్యాణ మహోత్సవం కనుల పండువగా ఉంటుంది. ఈ వేడుకల కోసం రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తారు. ఈ ఆలయానికి కూడా జేబీఎస్ నుంచి బస్సులు అందుబాటులో ఉంటాయి.
కాళేశ్వరం
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం తెలంగాణ మొత్తం గర్వించదగిన శైవక్షేత్రం. ఇక్కడ శివుడు యముడికి ప్రత్యక్షమైనందున కాళేశ్వరుడిగా ప్రసిద్ధి చెందాడు. కాళేశ్వరుడిని దర్శించిన తర్వాత ముక్తేశ్వరుడిని దర్శించుకోవడం ఆనవాయితీ. ఇక్కడి శివలింగానికి రెండు రంధ్రాలు ఉండటం విశేషం. అందులో పోసిన నీరు ఒక ధార గోదావరిలో, మరో ధార ప్రాణహిత సంగమంలో కలుస్తుందని భక్తుల నమ్మకం. ఎంజీబీఎస్, జేబీఎస్ నుంచి బస్సులు అందుబాటులో ఉంటాయి.
కీసర
హైదరాబాద్‌కు అతి సమీపంలో ఉన్న ప్రసిద్ధ శైవక్షేత్రం కీసర. ఇక్కడ శివుడు రామలింగేశ్వర స్వామిగా దర్శనమిస్తాడు. స్థల పురాణం ప్రకారం వారణాసి నుంచి లింగం తీసుకురావడానికి వెళ్లిన ఆంజనేయుడు 101 లింగాలను తీసుకురావడం, చివరకు శివుడు స్వయంగా రాముడికి లింగం ప్రసాదించడం విశేషంగా చెప్పుకుంటారు. తాను తెచ్చిన లింగాలకు పూజ చేయలేదని ఆగ్రహించిన హనుమంతుడు లింగాలను విసిరి పారేశాడట. అందుకే కీసరలో ఎక్కడ చూసినా లింగాలే దర్శనమిస్తాయి.
రామప్ప
కాకతీయులు నిర్మించిన చారిత్రక శైవక్షేత్రం రామప్ప ఆలయం. హైదరాబాద్ నుంచి సుమారు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయంలో శివుడు రామలింగేశ్వరుడిగా దర్శనమిస్తాడు. అద్భుతమైన శిల్పసంపద, నాట్యశిల్పాలు, నిర్మాణ నైపుణ్యం రామప్ప ఆలయాన్ని ప్రపంచ ప్రసిద్ధిగా నిలిపాయి. ఈ ఆలయానికి ఉప్పల్, ఎంజీబీఎస్ నుంచి బస్సులు అందుబాటులో ఉంటాయి.
పానగల్
నల్లగొండ జిల్లా పానగల్‌లోని ఛాయా సోమేశ్వరాలయం భౌతిక శాస్త్రవేత్తలకే సవాల్ విసురుతుంది. శివలింగం మీద నిత్యం నీడ ఉండటం ఈ ఆలయ ప్రత్యేకత. అదే ప్రాంతంలో ఉన్న పచ్చల సోమేశ్వరాలయంలో నవరత్నాల్లో ఒకటైన పచ్చరాయితో చెక్కిన శివలింగం భక్తులను ఆకట్టుకుంటుంది. ఈ ఆలయానికి ఎల్‌బీనగర్ నుంచి బస్సులు అందుబాటులో ఉంటాయి.
ఐనవోలు
వరంగల్ జిల్లాలోని ఐనవోలు శైవక్షేత్రాన్ని క్రీ.శ. 1076లో మంత్రి అయ్యనదేవుడు నిర్మించాడని చరిత్ర చెబుతోంది. 108 స్తంభాలతో నిర్మితమైన ఈ ఆలయంలో శివుడు మల్లన్న అవతారంలో భీకర రూపంలో దర్శనమిస్తాడు. మహా శివరాత్రి రోజున ఇక్కడ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతాయి.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram