Auto Bandh | మహాలక్ష్మీ పథకానికి నిరసనగా.. రోడ్డు రాష్ట్రవ్యాప్తంగా ఆటో బంద్..!
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు డిసెంబర్ 9 నుంచి మహాలక్ష్మి పథకాన్ని అమలులోకి తీసుకువచ్చింది.

Auto Bandh | ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు డిసెంబర్ 9 నుంచి మహాలక్ష్మి పథకాన్ని అమలులోకి తీసుకువచ్చింది. ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సులతో పాటు హైదరాబాద్ సిటీ బస్సుల్లో విపరీతంగా రద్దీ పెరిగింది. పథకం ప్రారంభానికి ముందు చాలా మంది ఆటోలు, ఇతర ప్రైవేటు వాహనాల్లో వెళ్తూ ఉండేవారు. మహాలక్ష్మీ స్కీమ్ మొదలైనప్పటి నుంచి మహిళలు ఎక్కువగా ఆర్టీసీ బస్సుల్లో వెళ్లేందుకే మొగ్గుచూపుతున్నారు.
ఈ క్రమంలో ఆటోలు ఎక్కుతున్న వారి సంఖ్య భారీగానే తగ్గింది. ఈ క్రమంలో ప్రభుత్వం పథకంపై ఆటో కార్మికులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు ఉపాధి లేకుండాపోతుందని వాపోతున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి ఆందోళనను రాష్ట్రవ్యాప్తంగా ఉధృతం చేసేందుకు నిర్ణయించారు. ఇందులో భాగంగా శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా బంద్‌కు పిలుపునిచ్చారు. జిల్లాల్లో ఎక్కడక్కడ నిరసన తెలుపాలని ఆటో జేసీ పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా శుక్రవారం ఉదయం 10గంటలకు సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి నారాయణగూడ చౌరస్తా వరకు భారీ ఆటో ర్యాలీ చేపట్టేందుకు నిర్ణయించారు.
ఇందులో ఆటో డ్రైవర్లు అందరూ పాల్గొనాలని జేఏసీ పిలుపునిచ్చింది. బంద్ రోజున ఒక్క ఆటో కూడా రోడ్డుపైకి రావొద్దని భీష్మించారు. ప్రభుత్వ నిర్ణయంతో ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడిందని, ఇప్పటికే పలువురు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పథకాన్ని రద్దు చేయాలని కోరుతున్నారు. అయితే, పథకాన్ని రద్దు చేసే పరిస్థితి లేదు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మహాలక్ష్మీ పథకాన్ని కాంగ్రెస్ తీసుకువచ్చింది. అయితే, ప్రత్యామ్నాయంగా చూపాలని డిమాండ్ చేస్తున్నారు. మరో వైపు ఆటోల బంద్ నేపథ్యంలో బస్సుల సంఖ్య పెంచాలని ప్రయాణికులు కోరుతున్నారు.