అయోధ్య రైల్వేస్టేషన్ పేరు మార్పు
ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య రైల్వేస్టేషన్ పేరును కేంద్ర సర్కారు మార్చింది. అయోధ్య జంక్షన్ పేరును అయోధ్య ధామ్‌గా మార్చినట్టు స్థానిక ఎంపీ లల్లూ సింగ్ తెలిపారు

- అయోధ్య ధామ్ జంక్షన్‌గా నామకరణం
- 30న ప్రధాని చేతులమీదుగా ప్రారంభం
- రామమందిరం ప్రారంభోత్సవం నేపథ్యంలో
- అత్యాధునిక హంగులతో రైల్వేస్టేషన్ ముస్తాబు
విధాత: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య రైల్వేస్టేషన్ పేరును కేంద్ర సర్కారు మార్చింది. అయోధ్య జంక్షన్ పేరును అయోధ్య ధామ్‌గా మార్చినట్టు స్థానిక ఎంపీ లల్లూ సింగ్ బుధవారం తెలిపారు. అయోధ్యలో త్వరలో రామమందిరం ప్రారంభం కానున్న నేపథ్యంలో రైల్వేస్టేషన్‌ను అభివృద్ధి చేశారు. స్టేషన్‌లో ప్రయాణికులకు అత్యాధునిక వసతులు, హంగులు కల్పించారు. అభివృద్ధి పరిచిన అయోధ్య ధామ్ రైల్వేస్టేషన్ ఫొటోలను ఎంపీ గురువారం ట్విట్టర్‌లో పోస్టు చేశారు. రైల్వే స్టేషన్‌ను ఈ నెల 30న ప్రధాని నరేంద్ర మోదీ చేతులమీదుగా ప్రారంభించనున్నట్టు పేర్కొన్నారు.
నాలుగు గోపురాలతో అయోధ్య ధామ్ జంక్షన్
అయోధ్య ధామ్ జంక్షన్ 11,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్నది. అయోధ్య ధామ్ జంక్షన్ భవనం మధ్య గోపురం రాముడి ‘ముకుట్’ (కిరీటం) నుంచి ప్రేరణతో నిర్మించారు. ‘ముకుట్’ వెనుక ఉన్న ‘చక్రం’ సూర్యుడిని సూచిస్తుంది. రెండు అంతస్థుల భవనంపై రెండు ‘హిఖర్లు’ జానకి ఆలయం నుంచి ప్రేరణ పొందాయి.
‘శిఖరం’ మధ్య ఏడు ‘మండపాలు’ ఉన్నాయి. అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్‌కు తక్కు విద్యుత్తు అవసరమవుతుంది. ఎందుకంటే సమృద్ధిగా సహజ కాంతి పడేలా డిజైన్ చేసి నిర్మించారు. నీటి సామర్థ్యం కోసం స్టేషన్‌లో రెయిన్‌వాటర్ హార్వెస్టింగ్ కోసం సదుపాయం కల్పించారు. ప్రధాన స్టేషన్ టెర్మినల్‌ను హైవే, టెంపుల్‌తో అనుసంధానించే మార్గం రామ మందిరానికి దారి తీస్తుంది.
డిసెంబర్ 30న అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్‌తోపాటు మర్యాద పురుషోత్తం శ్రీరామ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ను ప్రధాని మోదీ ప్రారంభిస్తారని తెలిపారు. ప్రారంభోత్సవం అనంతరం వచ్చే జనవరి 22న అయోధ్యలో జరిగే రామమందిర ప్రారంభోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లను కూడా ప్రధాని పర్యవేక్షిస్తారని వెల్లడించారు. మరోవైపు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవానికి జరుగుతున్న ఏర్పాట్లను సమీక్షిస్తున్నారు.
“మొదటి దశలో సిద్ధం చేసిన విమానాశ్రయం, రైల్వే స్టేషన్‌ను డిసెంబర్ 30న ప్రారంభించబోతున్నారు. అంచనాల ప్రకారం, జనవరి 22 తర్వాత, రోజుకు సుమారు 50,000-55,000 మంది ప్రజలు అయోధ్యకు వస్తారు. భక్తుల రద్దీకు అనుగుణంగా ఏర్పాట్లు చేసేందుకు పాలనా యంత్రాంగం సన్నద్ధమవుతున్నట్లు అయోధ్య కమిషనర్ గౌరవ్ దయాల్ చెప్పారు.