ఇంటెలిజెన్స్ అధికారులు ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు: బాల్క సుమన్
బీఆరెస్ ప్రజాప్రతినిధులు, నేతల ఫోన్లను ఇంటెలిజెన్స్ అధికారులు ట్యాప్ చేస్తున్నారని బీఆరెస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆరోపించారు.

విధాత, హైదరాబాద్: బీఆరెస్ ప్రజాప్రతినిధులు, నేతల ఫోన్లను ఇంటెలిజెన్స్ అధికారులు ట్యాప్ చేస్తున్నారని బీఆరెస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆరోపించారు. సోమవారం హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన, గోదావరి పరివాహక ప్రాంత నేతలకు ప్రాణహాని వుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం గన్ మెన్ లను తొలగించిందన్నారు. తుంగతుర్తిలో బీఆర్ఎస్ కార్యకర్త సురేష్, భార్యను కాంగ్రెస్ వాళ్లు కొట్టారని, కొల్లాపూర్ లో బీఆర్ఎస్ కార్యకర్తను హత్య చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందన్నారు.
ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ నేతల బుద్ధి మారడం లేదని, ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్లు వ్యవహరిస్తోందని విమర్శించారు. ప్రజా పాలన మాటల్లో కాకుండా చేతల్లో చూపించాలన్నారు. శాసనమండలిని ఇరానీ కేఫ్, ఎమ్మెల్సీలను రియల్ ఎస్టేట్ వ్యాపారులని సీఎం అగౌరవపరుస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ నేతలపై దుష్ప్రచారాలు మానుకోవాలన్నారు. మాజీ ఎమ్మెల్యేల గన్ మెన్ లను తీసివేశారని తెలిపారు. మాజీ ఎమ్మెల్యేల క్వార్టర్స్ ను ఖాళీ చేసేందుకు సమయం ఇవ్వలేదన్నారు.
అప్పుల కుప్ప అంటూ తెలంగాణ ఇమేజ్ ను కాంగ్రెస్ నాయకులు దెబ్బతీస్తున్నారని, రైతు బంధు నిధులు మంత్రుల కంపెనీలకు మళ్ళించినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోందని అన్నారు. నిధులు ఎటు వెళ్తున్నాయో రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. లోక్ సభ ఎన్నికల పేరుతో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను వాయిదా వేయవద్దని సూచించారు. ఆర్టీసీ బస్సు సర్వీసులను తగ్గించారని, దీంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదన్నారు. రాష్ట్రంలో ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వం స్పందించలేదని తెలిపారు. ఆటో డ్రైవర్లకు నెలకు రూ.15 వేల జీవన భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు.