Bangalore | రామేశ్వరం కేఫ్ పేలుళ్ల ప్రధాన నిందితుల అరెస్టు

  • By: Somu    latest    Apr 12, 2024 12:42 PM IST
Bangalore | రామేశ్వరం కేఫ్ పేలుళ్ల ప్రధాన నిందితుల అరెస్టు
  • మతీన్ తాహా..షాజిబ్‌లను అరెస్టు చేసిన ఎన్‌ఐ

 

విధాత : రామేశ్వరం కేఫ్ పేలుళ్ల కేసులో ఇద్దరు ప్రధాన నిందితులను ఎన్‌ఐఏ అధికారులు అరెస్టు చేశారు. సూత్రధారి అబ్ధుల్‌ మతీన్ తాహా, బాంబర్ ముసావీర్ హుస్సేన్ షాజిబ్ లను జాతీయ దర్యాప్తు సంస్థ కోల్‌కత్తాలో అరెస్టు చేశారు. దీంతో ఈ కేసు దర్యాప్తులో కీలక ముందడుగు పడింది. పేలుడు జరిగిన నాటి నుంచి పరారీలో ఉన్ననిందితులు ఇద్దరు అస్సాం, పశ్చిమ బెంగాల్‌లో తలదాచుకున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి.

మార్చిలో బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో బాంబు పేలిన ఘటనలో 9 మంది గాయపడ్డారు. ఈ కేసును కర్ణాటక హోంశాఖ ఎన్ఐఏకు అప్పగించింది. నిందితుడు ఆర్డీఎక్స్ ఉపయోగించి టైమర్ బాంబు పేల్చినట్లుగా గుర్తించారు.నిందితులు కేఫ్‌లోకి వచ్చిన వెళ్లిన దృశ్యాలను సీసీ కెమెరాల ఆధారంగా విశ్లేషించి దర్యాప్తు కొనసాగించారు.

ఈ క్రమంలో ఐదు కిలోమీటర్ల పరిధిలోని వందల కొద్దీ సీసీ కెమెరాల దృశ్యాలను విశ్లేషించగా,. టోపీ ధరించిన వ్యక్తి నోటికి మాస్కు కట్టుకుని నల్లబూట్లు, అదే రంగు ప్యాంటు ధరించి ఉన్నట్లు గుర్తించారు. దీంతో టోపీ ఆధారంగా పోలీసులు వేట మొదలు పెట్టగా, నిందితులు టోపీ కొనుగోలు చేస్తున్నప్పటి దృశ్యాలు దర్యాప్తు బృందం చేతికి చిక్కాయి. వాటి ఆధారంగా నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు.