పర్యావరణంపై కాఫీ గింజల సాగు దుష్ఫ్రభావం… కృత్రిమ కాఫీకి సిద్ధంకండి..
విధాత: పర్యావరణ మార్పుల కారణంగా అడవులు తరిగిపోతుండగా.. వ్యవసాయమూ ఈ ఉత్పాతానికి ఎంతో కొంత కారణమవుతోంది. మరీ ముఖ్యంగా కొండ వాలు ప్రాంతాల్లోనే సాగు చేసే టీ, కాఫీ పంటల కోసం ఎంతో పెద్ద మొత్తంలో అడవులను నరికేస్తున్నారు.
ఈ సమస్య పరిష్కారానికి పలువురు వ్యాపారవేత్తలు ఇప్పటికే వివిధ మార్గాలను అన్వేషిస్తున్నారు. తాజాగా అమెరికాలోని సియాటెల్‌కు చెందిన అటోమో కాఫీ అనే స్టార్టప్ సంస్థ ఒక ఆలోచనతో ముందుకొచ్చింది. తాము కాఫీ గింజలు లేకుండా కాఫీ (Coffee With out Coffee Beans) తయారు చేస్తామని ప్రకటించింది.
కృత్రిమ మాంసం కోసం నిధులు సమకూరుస్తున్న పర్యావరణ ప్రేమికులే ఈ ప్రాజెక్టుకూ వెన్నుదన్నుగా నిలబడ్డారు. 51.6 మిలియన్ డాలర్ల నిధులతో ఈ పరిశోధనను సాగించిన అటోమో స్టారప్ కాఫీ గింజలు అవసరం లేని కాఫీ మిషన్‌ను రూపొందించింది. ఈ శుక్రవారం జరగనున్న న్యూయార్క్ కాఫీ ఫెస్టివల్‌లో ఈ మిషన్‌ను ప్రదర్శనకు ఉంచుతామని అటొమో కాఫీ సీఈఓ ఆండీ వెల్లడించాడు.
ఏమిటీ అవసరం
కాఫీ పండించడానికి చాలా చల్లనైన వాతావరణం అవసరం. ఉష్ణోగ్రతలు పెరిగేకొద్దీ కాఫీ గింజల రుచిలో చాలా తేడా వస్తుంది. ప్రస్తుతం ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల ఇప్పుడున్న కాఫీ తోటల యజమానులు చల్లటి ప్రాంతాల కోసం కొండల పైకి తమ పంటలను మారుస్తూ పోతున్నారు. దీని వల్ల పెద్ద ఎత్తున అడవుల విధ్వంసం జరుగుతోంది.
అందుకే కాఫీ గింజల అవసరం లేకుండా తక్కువ ధరకు, అదే రుచితో కాఫీని తయారుచేయడం అత్యవసరంగా మారింది. ఒక అంచనా ప్రకారం 2050 నాటికి ఇప్పుడు సాగులో ఉన్న కాఫీ తోటల్లో సగానికి పైగా ఆ పంట సాగుకు పనికిరాకుండా పోతాయి. కాఫీ పంటల వల్ల అడవుల విధ్వంసం ఏ స్థాయిలో ఉందంటే రోజుకు పది న్యూయార్క్ సెంట్రల్ పార్కుల విస్తీర్ణం అంత మొత్తంలో అడవులను కొట్టేస్తున్నారు.
కాఫీ మెషిన్ ఎలా పనిచేస్తుంది?
కొన్ని రకాల సూపర్ ఫుడ్స్, అప్‌సైకిల్ చేసిన దినుసులను ఉపయోగించి కృత్రిమంగా కాఫీ పొడి లాంటి పదార్థాన్ని తయారుచేస్తారు. దీని తయారీలో కాఫీ పంటల సాగుతో పోలిస్తే 93 శాతం తక్కువ కార్బన ఉద్గారాలు తక్కువ స్థాయిలో వెలువడతాయని, 94 శాతం తక్కువ నీరు సరిపోతుందని ఆండీ వెల్లడించారు. తొలుత ఈ కాఫీ బీన్ లెస్ కాఫీ మెషీన్లను చిన్న చిన్న షాపుల్లో ప్రవేశపెడతామని ఆయన అన్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram