Bedurulanka 2012 Review | ఎటువంటి బెదురు అవసరం లేదు.. ధైర్యంగా చూడొచ్చు

Bedurulanka 2012 Review | మూవీ పేరు: బెదురులంక 2012 విడుదల తేదీ: 25 ఆగస్ట్, 2023 నటీనటులు: కార్తికేయ గుమ్మకొండ, నేహా శెట్టి, అజయ్‌ ఘోష్‌, ఎల్బీశ్రీరామ్‌, సత్య, వెన్నెల కిశోర్‌, శ్రీకాంత్‌ అయ్యంగార్, ఆటో రాంప్రసాద్‌, గోపరాజు రమణ, గెటప్‌ శ్రీను తదితరులు సినిమాటోగ్రాఫర్స్: సాయిప్రకాష్‌ ఉమ్మడిసింగు, సన్నీ కూరపాటి ఎడిటింగ్: విప్లవ్‌ న్యాసదం సంగీతం: మణిశర్మ నిర్మాత: రవీంద్ర బెనర్జీ ముప్పానేని రచన, దర్శకత్వం: క్లాక్స్ టాలీవుడ్‌లో ఉన్న యంగ్ హీరోలలో కార్తికేయ […]

  • By: krs |    latest |    Published on : Aug 25, 2023 9:39 AM IST
Bedurulanka 2012 Review | ఎటువంటి బెదురు అవసరం లేదు.. ధైర్యంగా చూడొచ్చు

Bedurulanka 2012 Review |

మూవీ పేరు: బెదురులంక 2012
విడుదల తేదీ: 25 ఆగస్ట్, 2023
నటీనటులు: కార్తికేయ గుమ్మకొండ, నేహా శెట్టి, అజయ్‌ ఘోష్‌, ఎల్బీశ్రీరామ్‌, సత్య, వెన్నెల కిశోర్‌, శ్రీకాంత్‌ అయ్యంగార్, ఆటో రాంప్రసాద్‌, గోపరాజు రమణ, గెటప్‌ శ్రీను తదితరులు
సినిమాటోగ్రాఫర్స్: సాయిప్రకాష్‌ ఉమ్మడిసింగు, సన్నీ కూరపాటి
ఎడిటింగ్: విప్లవ్‌ న్యాసదం
సంగీతం: మణిశర్మ
నిర్మాత: రవీంద్ర బెనర్జీ ముప్పానేని
రచన, దర్శకత్వం: క్లాక్స్

టాలీవుడ్‌లో ఉన్న యంగ్ హీరోలలో కార్తికేయ గుమ్మకొండ వెళుతున్న దారి చాలా ప్రత్యేకమైనది, విభిన్నమైనదనే చెప్పుకోవాలి. ‘ఆర్ఎక్స్ 100’ చిత్రంతో హీరోగా మంచి బ్రేక్ అందుకున్న కార్తికేయకు.. మళ్లీ అలాంటి హిట్ అయితే పడలేదు. హీరో అనే కాకుండా.. విలన్‌గాను ఆయన నడుస్తున్న దారి హిట్‌ని ఇవ్వడం లేదు కానీ.. డిఫరెంట్ యాక్టర్ అనే ట్యాగ్‌ని మాత్రం ఇచ్చింది. ముఖ్యంగా అజిత్ ‘వలిమై’ సినిమాలో విలన్‌గా కార్తికేయ నటించిన తీరు, అలాగే ‘నాని గ్యాంగ్‌లీడర్’‌లో విలన్‌గా వైవిధ్యతను చాటిన విధానం.. కార్తికేయను ప్రేక్షకులు మరిచిపోకుండా చేస్తున్నాయ్. క్యారెక్టర్ ఏంటనేది పక్కన పెడితే.. ఒక యంగ్ హీరోకి ఇలాంటి అవకాశాలు రావడం చాలా అరుదుగా జరుగుతుంటుంది.

అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి కూడా ఇలానే హీరోగా, విలన్‌గా చేసి మెగాస్టార్ అయ్యారు. అయితే అప్పుడు రోజులు వేరు.. ఇప్పుడు వేరు. ఇప్పుడు నేమ్ ఎంత త్వరగా వస్తుందో.. అంత త్వరగా కనుమరుగవుతుంది. ఇక్కడ నిత్యం కష్ట పడేవాడికి మాత్రం కొన్నాళ్ల పాటు లైఫ్ ఉంటుంది. అందులో డౌటే లేదు. ఈ బ్యాచ్‌లో కార్తికేయ కూడా ఉంటాడు. అందుకే.. సరైన హిట్ పడి చాలా కాలం అవుతున్నా.. ఇంకా ఆయన పేరు వినబడుతుంది.

అయితే ఎప్పుడూ సీరియస్ లుక్స్‌తో కనిపించే కార్తికేయ.. ఈసారి మాత్రం కాస్త కామెడీ టచ్‌తో వస్తున్నట్లుగా ‘బెదురులంక 2012’ చిత్ర ప్రమోషనల్ వీడియోస్‌ చెబుతూ వచ్చాయి. టైటిల్ ఆసక్తికరంగా ఉండటం, అలాగే ఓ బర్నింగ్ టాపిక్‌ అయిన ‘యుగాంతం’తో ఈ సినిమా తెరకెక్కిందనే విషయం తెలియడం, ‘డిజె టిల్లు’ హీరోయిన్‌తో రొమాన్స్.. ఇలా అన్నీ ఈ సినిమాపై క్రేజ్‌ని పెంచేశాయి. మరి ఆ క్రేజ్.. హిట్‌గా మారిందా? నేడు థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా అసలు ఎలా ఉందో.. మన రివ్యూలో తెలుసుకుందాం.

కథ:

‘యుగాంతం’ కాన్సెప్ట్‌తో హాలీవుడ్‌లో 2012 అంటూ అప్పట్లో ఓ భారీ సినిమా వచ్చింది. కానీ అది గ్రాఫిక్స్ ప్రధానాంశంగా చాలా సీరియస్‌గా ఉంటుంది. కానీ ఈ సినిమాని దర్శకుడు హాస్య ప్రధానంగా తెరకెక్కిం చారు. కథలోకి వస్తే.. అది 2012వ సంవత్సరం. హైదరాబాద్‌లో గ్రాఫిక్ డిజైనర్‌గా శివశంకర వరప్రసాద్ (కార్తికేయ) జాబ్ చేస్తుంటాడు. ఏదైనా ముఖంమీదే ముక్కుసూటిగా మాట్లాడే స్వభావం ఉన్న శివకి.. అదే లేని పోని సమస్యలు తీసుకొస్తుంటుంది. అలాంటి సమస్యతో జాబ్ మానేసి సొంతం ఊరైన బెదురులంక వచ్చేస్తాడు.

అప్పటికే ఆ ఊరి ప్రెసిడెంట్ (గోపరాజు రమణ) కుమార్తె చిత్ర (నేహా శెట్టి)ని ప్రేమిస్తుంటాడు శివ. తను ఊరు వచ్చేసరికి ఊరంతా 2012 యుగాంతం అనే భయంలో ఉంటుంది. ఈ భయాన్ని క్యాష్ చేసుకోవడా నికి ఆ ఊరి ప్రెసిడెంట్‌తో కలిసి బ్రాహ్మణుడైన బ్రహ్మం (శ్రీకాంత్ అయ్యంగార్), చర్చి ఫాదర్ కొడుకు డేనియల్ (రాంప్రసాద్) ఓ ప్లాన్ చేస్తారు. ఊర్లో అందరి వద్ద ఉన్న బంగారంతో దేవుడి ప్రతిమలు చేయించి.. గంగలో కలిపితే యుగాంతం వచ్చినా.. ఆ ఊరికి ఏం కాదని నమ్మిస్తారు. ప్రాణభయంలో ఉన్న ప్రజలు అందుకు ఒప్పుకుంటారు.

ఇలాంటి మూఢనమ్మకాలను వ్యతిరేకించే శివ.. దానిని అడ్డుకోవాలని ప్రయత్నిస్తే.. ఊరి ప్రజలు అతడిని అవమానపరిచి ఊరి నుంచి గెంటేస్తారు. దీంతో ముళ్లును ముళ్లుతోనే తీయాలని శివ ప్లాన్ చేస్తాడు. శివ చేసిన ప్లాన్ ఏంటి? ఆ ఊరి పెద్దల మోసాన్ని శివ ఎలా తిప్పికొట్టాడు? మూడనమ్మకంలో ఉన్న ప్రజలకు ఎలా కనువిప్పు కలిగించాడు? వంటి ఆసక్తికర ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే.. హిలేరియస్ కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాని థియేటర్లలో చూడాల్సిందే.

నటీనటుల, సాంకేతిక నిపుణుల పనితీరు:

కార్తికేయ సీరియస్ నటన ఎలా ఉంటుందో.. ఇప్పటి వరకు ఆయన నటించిన అన్ని సినిమాలలో తెలుస్తూనే ఉంది. కానీ ఇందులో అలా కనిపిస్తూనే.. కామెడీని ట్రై చేశాడు. అతని పాత్రకు వైవిధ్యతను కనబరిచే అవకాశాన్ని దర్శకుడు కల్పించాడు. దర్శకుడు ఇచ్చిన అవకాశాన్ని కార్తికేయ చక్కగా వినియోగించుకున్నాడు. కామెడీ బ్యాచ్‌తో కలిసి ఆయన కనబరిచిన నటన అందరినీ అలరిస్తుంది. కానీ అతనికి స్టార్‌డమ్ రావాలంటే మాత్రం ఇది సరిపోదనే చెప్పుకోవాలి. అతనికి ఇచ్చిన పాత్రకు మాత్రం పూర్తి స్థాయిలో కార్తికేయ న్యాయం చేశాడు. అతని లవర్ చిత్రగా చేసిన నేహాశెట్టికి పెద్దగా స్కోప్ లేదు కానీ.. కనిపించిన కాసేపు చూపులతో తినేస్తుంది.

ఓ పాటలో అయితే.. ఆమెను చూసిన కుర్రకారుకి మతిపోతుంది. కార్తికేయ, నేహాల మధ్య రొమాన్స్ కూడా బాగుంది. అయితే నటనకు స్కోప్ ఉన్న పాత్ర కాకపోవడంతో.. ఆమె చేయడానికి ఏం లేదు. ఇక ఊరి పెద్దలుగా చేసిన గోపరాజు రమణ, అజయ్ ఘోష్, రామ్ ప్రసాద్, రాజ్ కుమార్ కసిరెడ్డి వారంతా.. వారి పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. వారి పాత్రలకు దర్శకుడు మంచి ఇంపార్టెన్స్ ఇచ్చాడు. గోపరాజు రమణకు ఇది కొత్తరకం పాత్ర అని చెప్పుకోవాలి. ఎల్బీ శ్రీరామ్ కనిపించింది కాసేపే అయినా.. తన అనుభవాన్ని చాటాడు. ఇంకా వెన్నెల కిశోర్, సత్య స్పెషల్ అప్పీరియన్స్ అందరినీ కడుపుబ్బా నవ్విస్తుంది. ఇంకా ఇతర పాత్రలలో నటించిన వారంతా.. వారి పాత్రల పరిధిమేర నటించారు.

సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే..

ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ హైలెట్ అని చెప్పుకోవాలి. నైట్ ఎఫెక్ట్స్‌లో కూడా కెమెరాను కరెక్ట్‌గా వాడారు. విజువల్స్ చాలా న్యాచురల్‌గా బంధించారు. అలాగే నిర్మాణ విలువలు చాలా చాలా ఉన్నత స్థాయిలో ఉన్నాయి. ఈ విషయంలో నిర్మాతలను అభినందించాలి. ఎడిటింగ్ పరంగా మాత్రం ఫస్టాఫ్ చాలా సాగదీతగా ఉంది. అనవసరమైన సీన్లు చాలా ఉన్నట్లుగా అనిపిస్తాయి. వాటన్నింటినీ ఏరేస్తే.. సెకండాఫ్‌లా ఫస్టాఫ్ కూడా స్ట్రాంగ్ అయ్యేది. సినిమా గ్రాఫ్ పడకుండా ఉండేది.

మణిశర్మ సంగీతంలో రెండు పాటలు బాగున్నాయి. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ భారీగా ఏం లేదు కానీ.. సినిమాకు కావాల్సిన విధంగా ఉంది. ఇంకా ఇతర సాంకేతిక నిపుణులంతా తమ ప్రతిభిను కనబరిచారు. ఇది దర్శకుడు క్లాక్స్‌కి తొలి చిత్రం. అయినా కూడా తడబడకుండా.. తను చెప్పాలనుకున్న పాయింట్‌కి కామెడీని కనెక్ట్ చేసిన విధానం అందరినీ అలరిస్తుంది. కాకపోతే.. ఫస్టాఫ్ విషయంలో మాత్రం అతనికి నెగిటివ్ ఫీడ్ బ్యాక్ రావచ్చు. సెకండాఫ్ మాత్రం టెక్నికల్‌గా బ్రిలియంట్‌గా తన కమాండ్‌ని ప్రదర్శించాడు.

విశ్లేషణ:

‘యుగాంతం’ అంటే ఒకప్పుడు అంటే 2012లోనే.. పెద్ద హాట్ టాపిక్. ఈ యుగం ఇంతటితో అయిపోయి.. మళ్లీ కొత్త యుగం వస్తుందని నిజంగా అప్పట్లో వదంతులు వినిపించాయి. సైంటిఫిక్‌గా కూడా ఇది నిజమే అనేలా అప్పట్లో భ్రమలు కల్పించారు. దీంతో చాలా మంది.. ఉన్న ఆస్తులను అమ్మేసి ఎంజాయ్ చేసిన వారున్నారు. తర్వాత రోడ్డున పడి అడుక్కుతిన్నారనుకోండి.. అది వేరే విషయం. అలాంటి భయం మాత్రం ప్రజలలో ఆ సంవత్సరం ఏర్పడింది. హాలీవుడ్‌లో ‘2012’ పేరుతో రూపొందించిన సినిమా కూడా జనాలను మరింత భయానికి గురిచేసింది. ఇప్పుడదే కాన్సెఫ్ట్‌ని దర్శకుడు తీసుకున్నాడు. అయితే సీరియస్‌గా కాకుండా.. ఈ పాయింట్‌ని వినోదభరితంగా తెరకెక్కించి క్లాక్స్ మంచి మార్కులు కొట్టేశాడు.

అది మూఢనమ్మకం అని చెప్పడానికి ఆయన రాసుకున్న కథలో కొత్తదనం లేనప్పటికీ.. ఎంటర్‌టైనింగ్‌గా మాత్రం ఉంది. అయితే ఫస్టాప్ మాత్రం బోరింగ్‌గానే సాగింది. ఆ బోరింగ్‌‌‌ని సెకండాఫ్‌లో ఆయన సినిమాని నడిపిన తీరు దూరం చేస్తుంది. ముఖ్యంగా ఓ మంచి మెసేజ్ కూడా అతను ఇందులో లీనం చేయడం విశేషంగా చెప్పుకోవాలి. జనాల్లో భయాన్ని పెద్దలు ఎలా క్యాష్ చేసుకుంటారో, మతాల పేరుతో ఎలా ఆడుకోవాలని చూస్తుంటారో.. అంటూ ఆయన వివరించిన విధానం ఎప్పటికీ కనెక్టివ్‌గానే ఉంటుంది. ఎవరికోసమో కాదు.. ముందు మనకోసం మనం బతకడం నేర్చుకోవాలనే సందేశం ఇందులో మిళితం చేశాడు.

మరి కొన్ని రోజుల్లో అంతా చనిపోతున్నామని తెలిసినప్పుడు ప్రజలు ఎలా బిహేవ్ చేస్తారనే కోణం.. దర్శకుడు చూపించిన విధానం ప్రేక్షకులను హిలేరియస్‌గా ఎంటర్‌టైన్ చేస్తుంది. అయితే ఫస్టాప్ మాత్రం పాత్రలని పరిచయం చేయడానికి, కథలోకి తీసుకెళ్లడానికి సాగదీసినట్లుగా అనిపిస్తుంది. సెకండాఫ్ మాత్రం పొట్ట చెక్కలవ్వాల్సిందే. అలా నవ్విస్తాడు. ఊరి జనాలను మోసం చేయాలని ఊరి పెద్దలు పన్నే పన్నాగాలు.. చూస్తున్న ప్రేక్షకుడికి నవ్వు ఆపుకోలేని విధంగా ఉంటాయి. అలాగే వారిని దెబ్బ కొట్టేందుకు హీరో చేసే ప్లాన్ కూడా ప్రేక్షకులకు నచ్చుతుంది. మధ్యలో వెన్నెల కిశోర్, సత్య‌ని రప్పించి ఇంకాస్త కామెడీ డోస్ పెంచడంతో.. ఇది హిలేరియస్ ఎంటర్‌టైనర్‌ సినిమాగా మారిపోతుంది.

ఫస్టాఫ్‌పై ఇంకాస్త శ్రద్ధ పెట్టి ఉంటే మాత్రం.. ఈ సినిమా ఈ ఇయర్‌కి మరో ‘సామజవరగమన’ అయ్యి ఉండేది. అలాగే పాటలు కూడా అంతగా ఎక్కవు. కార్తికేయ‌ని అభిమానించే వారు ఆయనని యాక్షన్ కోణంలో చూడాలని అనుకుంటారు. అలాంటి వారు కాస్త డిజప్పాయింట్ అవుతారు. ఇంకా హీరోహీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్ కూడా అంత బలంగా లేదు. ఓవరాల్‌గా అయితే ఈ సినిమా ఓ.. అనేంతగా లేదు కానీ.. డిజప్పాయింట్ మాత్రం చేయదు. మంచి సందేశం కూడా ఇందులో ఉంది కాబట్టి.. బెదురు లేకుండా ధైర్యంగా ఒకసారి అయితే చూసేయవచ్చు.

ట్యాగ్‌లైన్: ఎటువంటి బెదురు అవసరం లేదు.. ధైర్యంగా చూడొచ్చు
రేటింగ్: 3/5