Bhatti Vikramarka | గిరిజనులను ముంచిన సీఎం: భట్టి

Bhatti Vikramarka భద్రాద్రి రాముడినీ మోసం చేసిన కేసీఆర్‌ వెయ్యికోట్లు రాలేదు కానీ వరదలొచ్చాయ్‌ రాజకీయ అవసరాలకే చెక్‌డ్యామ్‌ల నిర్మాణం సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శ విధాత: అనాలోచిత నిర్ణయాలతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ గిరిజనులను ముంచారని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. సోమవారం సీఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వాతావరణ విభాగం హెచ్చరించినా.. ప్రభుత్వం అలర్ట్ కాలేదన్నారు. దీంతో పెద్ద ఎత్తున ప్రాణ, పంట, ఆస్తి నష్టం జరిగిందన్నారు. ఇప్పటి […]

Bhatti Vikramarka | గిరిజనులను ముంచిన సీఎం: భట్టి

Bhatti Vikramarka

  • భద్రాద్రి రాముడినీ మోసం చేసిన కేసీఆర్‌
  • వెయ్యికోట్లు రాలేదు కానీ వరదలొచ్చాయ్‌
  • రాజకీయ అవసరాలకే చెక్‌డ్యామ్‌ల నిర్మాణం
  • సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శ

విధాత: అనాలోచిత నిర్ణయాలతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ గిరిజనులను ముంచారని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. సోమవారం సీఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వాతావరణ విభాగం హెచ్చరించినా.. ప్రభుత్వం అలర్ట్ కాలేదన్నారు. దీంతో పెద్ద ఎత్తున ప్రాణ, పంట, ఆస్తి నష్టం జరిగిందన్నారు. ఇప్పటి వరకు ఎప్పుడూ వర్షాలకు 60 మంది చనిపోలేదని తెలిపారు. యంత్రాంగం అప్రమత్తంగా లేకపోవడం వల్లే సమస్య ఏర్పడిందన్నారు.

మోరంచపల్లి, సున్నం బట్టి గ్రామాలు పూర్తిగా మునిగాయని తెలిపారు. ప్రభుత్వ అశ్రద్ధ, మానవ తప్పిదాల వల్ల పెద్ద నష్టం జరిగిందని, దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. 69 చెరువుల తెగిపోయి వాగులు పొంగడంతోనే మోరంచపల్లి ఊరు మునిగిందని చెప్పారు. చెరువులు, మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టుల మరమ్మత్తులు, నిర్వహణకు నిధులు విడుదల చేయకపోవడం వల్ల మొరంచపల్లి గ్రామంలో పెద్ద ఎత్తున ప్రాణ, ఆస్తి, పంట, పాడి నష్టం జరిగిందన్నారు.

సీఎం కేసీఆర్‌ సాంకేతికపరమైన ఆలోచనలతో కాకుండా రాజకీయపరమైన అవసరాల కోసం చెక్ డ్యాంల నిర్మాణం చేయడంతోనే సమస్య వచ్చిందని భట్టి ఆరోపించారు. రిటైనింగ్ వాల్స్ కట్టకపోవడం వల్ల భూమి కోత జరిగి కిన్నెరసాని నదిపై నాగారం బ్రిడ్జి వద్ద 2 సంవత్సరాల క్రితం కట్టిన చెక్ డ్యాం కొట్టుకుపోయిందన్నారు. వేల కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అయ్యిందన్నారు. రాష్ట్రంలో ఆనేక ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొన్నదని తెలిపారు.

సాంకేతికంగా అధ్యయనం చేయకుండా, శాస్త్రీయంగా ఇంజనీరింగ్ డిజైన్ చేయకుండా సీఎం కేసీఆర్ సొంత ఆలోచనలతో గోదావరిపై చెక్ డ్యామ్‌ల మాదిరిగా సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ ప్రాజెక్టులను నిర్మాణం చేయడం వల్ల బ్యాక్ వాటర్ తో మంథని, చెన్నూరు, మంచిర్యాల నియోజకవర్గాల్లో లక్షల ఎకరాల పంట నీట మునిగిందని భట్టి ఆరోపించారు. కేసీఆర్‌కు టెక్నికల్ నాలెడ్జి ఉందని తాను అనుకోవడం లేదన్నారు.

సీఎం రాత్రి పూట డిజైన్ చేసి కాళేశ్వరం కట్టారన్నారు. అనాలోచితంగా అశాస్త్రీయంగా సీతారామ ప్రాజెక్టు కట్టి గిరిజనుల ముంపునకు సీఎం కేసీఆర్ కారణమయ్యారని భట్టి ఆరోపించారు. లక్షల రూపాయలతో నిర్మించే ఇండ్లను సైతం ఇంజనీరింగ్ ప్లానింగ్ తో కట్టుకుంటామని, వేల కోట్లతో నిర్మించే ప్రాజెక్టులకు ఇంజనీరింగ్ డిజైన్ అవసరం లేదని కేసీఆర్ డిజైన్ చేయడం ఏంటి? అని అడిగారు. మానేరు మీద కట్టిన చెక్ డ్యామ్ కూడా దెబ్బతిన్నదన్నారు.

రాజీవ్ సాగర్ దుమ్ముగూడెం ప్రాజెక్టులను గాలికి వదిలేసిన బీఆర్ఎస్‌

రాజీవ్ సాగర్ దుమ్ముగూడెం ప్రాజెక్టులను బీఆర్ఎస్‌ ప్రభుత్వం గాలికి వదిలేసిందని భట్టి ఆరోపించారు. రూ. 750 కోట్లతో పూర్తయ్యే ఈ ప్రాజెక్టును సీఎం కేసీఆర్ రీడిజైన్ చేసి సీతమ్మ సాగర్ ప్రాజెక్టుగా మార్చి అడ్డగోలుగా కట్టడం వల్ల బ్యాక్ వాటర్ తో పరిసర ప్రాంతాల్లోని ఆనేక గిరిజనగూడెలు నీట మునిగాయన్నారు. పశువులు కొట్టుకుపోయి, ప్రజలు గల్లంతయ్యారు. ప్రజలు నివసించే ఊర్లలో పడవలు వేసుకొని తిరగాల్సిన దుస్థితిని సీఎం కేసీఆర్ తీసుకొచ్చాడని, ఇందుకు నీట మునిగిన సున్నం బట్టి గ్రామమమే సాక్ష్యం మన్నారు.

కాంగ్రెస్ శాసనసభ్యులు సీతక్క, పొదేం వీరయ్య, శ్రీధర్ బాబు, మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు లు గోదావరి వరదతో తమ నియోజకవర్గాల్లో ముప్పు పొంచి ఉందని వెంటనే రెస్క్యూ టీంలను పంపించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తే ఈ ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని భట్టి ఆరోపించారు. రాజకీయ అవసరాలుంటే.. మహారాష్ట్ర, ఒడిశాలకు ప్రత్యేక విమానాలు దొరుకుతాయి కానీ ప్రజల కోసం హెలికాప్టర్ పెట్టమంటే దొరకవా? అని ప్రభుత్వాన్ని భట్టి ప్రశ్నించారు.

బీఆర్ఎస్‌ రాజకీయ అవసరాల కోసం కేసీఆర్ ప్రత్యేక విమానాలను పొరుగు రాష్ట్రాలకు పంపించి అక్కడి నాయకులను ప్రగతి భవన్ కు పిలిపించుకొని గులాబీ కండులు కప్పారు, కానీ తెలంగాణ ప్రజలు అల్లాడిపోతుంటే మాత్రం పట్టించుకోకుండా పరిపాలన మొత్తం కేసీఆర్ గాలికి వదిలేశారన్నారు. అధికార యంత్రాంగాన్ని బిఆర్ఎస్ అవసరాల కోసం వాడటం వల్ల ఇలాంటి విపత్కర పరిస్థితిలో యంత్రాంగం పూర్తిగా వైఫల్యం చెందిందని ఆరోపించారు.

వరద ముంపు నుంచి తప్పించేందుకు, కాలనీల నిర్మాణానికి భద్రాచలానికి వెయ్యి కోట్లు ఇస్తున్న అని సీఎం కేసీఆర్‌ ఏడాది క్రితం చెప్పారని, ఇప్పటి వరకు నయాపైస ఇవ్వలేదు కానీ.. మళ్లీ వరదలు వచ్చాయని భట్టి అన్నారు. కేసీఆర్‌ ఒక్క ప్రజలనే కాదు.. భద్రాచలం రాముణ్ణి కూడా మోసం చేశాడని ఆరోపించారు. భ్రమలు కల్పించి మోసం చేయడం కేసీఆర్ కు అలవాటైన విద్య అని అన్నారు. ప్రజలను, దేవుడిని మోసం చేసిన సీఎం కేసీఆర్ పాలనకు చరమగీతం పాడాలని భద్రాచలం రాముడికి మొక్కి వచ్చానన్నారు. మంత్రులు కూడా రాష్ట్రాన్ని గాలికి వదిలేశారని విమర్శించారు.

వరదల భీభత్సంపై వెంటనే సీఎస్‌ స్పందించాలి- నష్టపోయిన బాధితులను ఆదుకోవాలి. ఎప్పుడైనా మే నెలలోనే వరదలపై సమీక్షలు జరిపి, విపత్తులను ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగాన్ని సమయాత్తం చేసేవారని, ఈ ఏడాది ఎందుకు సమీక్షలు చేయలేదని భట్టి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ముందస్తుగా పట్టించుకోక పోవడం వల్లనే ఇంత పెద్ద ఎత్తున నష్టం జరిగిందని భట్టి అన్నారు. యుద్ధ ప్రాతిపదికన అధికారులను వరద ముంపు ప్రాంతాలకు పంపించి, పంట ఇండ్లు, ఆస్తి, ప్రాణ నష్టం అంచనా వేయించి వెంటనే పరిహారం ఇచ్చే విధంగా రాష్ట్ర సీఎస్‌ చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

రాష్ట్రంలో జరిగిన వరద బీభత్సం పై కాంగ్రెస్‌ పార్టీ ప్రతినిధి బృందం మంగళవారం రాష్ట్ర గవర్నర్ ను కలిసి వినతిపత్రం ఇస్తామని భట్టి తెలిపారు. వరద బీభత్సం పై రాష్ట్ర గవర్నర్ ఇప్పటికే రివ్యూ చేసి ఉండాల్సిది, కానీ చేయలేదన్నారు. ఇప్పటికైనా సమీక్ష చేసి తగిన నివారణ చర్యలు తీసుకునే విధంగా అధికారులను ఆదేశించాలని గవర్నర్‌ను కోరారు.

వరద బాధితులకు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భట్టి తెలిపారు. సామాజిక బాధ్యతగా భావించి కాంగ్రెస్ శ్రేణులు సహాయక చర్యల్లో పాలుపంచుకోవాలని పిలుపు ఇచ్చారు. సమిష్టిగా వరద బాధితులకు ధైర్యం ఇచ్చి అండగా నిలబడదామన్నారు. వరదల్లో కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసి , సానుభూతిని తెలిపారు. ప్రజలు ఆత్మస్థైర్యంతో నిబ్బరంగా ఉండి, ఈ విపత్కర పరిస్థితిని ఎదుర్కోవడానికి ధైర్యంగా ఉండాలని కోరారు.