జైలుకెళ్లిన బిల్కిస్ బానో దోషులు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బిల్కిస్ బానో కేసులో దోషులుగా ఉన్న మొత్తం 11 మంది దోషులు తిరిగి జైలుకు వెళ్లారు

- సుప్రీకోర్టు విధించిన గడువులోగా
- లొంగిపోయిన 11 మంది దోషులు
విధాత: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బిల్కిస్ బానో కేసులో దోషులుగా ఉన్న మొత్తం 11 మంది దోషులు తిరిగి జైలుకు వెళ్లారు. సుప్రీం కోర్టు విధించిన గడువుకు అనుగుణంగా గుజరాత్‌లోని పంచమహల్ జిల్లాలోని గోద్రా సబ్ జైలులో ఆదివారం అర్థరాత్రి లొంగిపోయారు. వారు జనవరి 21 అర్ధరాత్రికి ముందే జైలుకు చేరుకున్నారు. అది వారికి లొంగిపోవడానికి సుప్రీంకోర్టు గడువు లోపేనని స్థానిక క్రైమ్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ ఎన్‌ఎల్ దేశాయ్ తెలిపారు.
బిల్కిస్ బానో కేసులో జీవిత ఖైదు శిక్షను ఎదుర్కొంటున్న 11 మంది ఖైదీలను ముందస్తుగా విడుదల చేయాలని 2022 ఆగస్టులో గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీకోర్టు జనవరి 8న రద్దు చేసింది. 2022లో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ముందస్థుగా విడుదలైన దోషులందరినీ రెండు వారాల్లోగా అంటే జనవరి 22వ తేదీలోగా తిరిగి జైలుకు తరలించాలని ఆదేశించింది.
అయితే, విడుదలైన 11 మంది దోషులు లొంగిపోయేందుకు సమయాన్ని పొడిగించాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దోషులు ‘అనారోగ్యం’, ‘శీతాకాలపు పంటలు’, ‘కొడుకు పెళ్లి’ వంటి కారణాలతో లొంగుబాటు సమయాన్ని పొడిగించాలని అత్యున్నత ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. దోషుల విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. నిర్దేశించిన గడువులోగా లొంగిపోవాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో దోషులు అందరూ 21వ తేదీ అర్ధరాత్రి జైలు అధికారుల ఎదుట లొంగిపోయారు.
ఫిబ్రవరి 2002లో గోద్రా రైలు దహనం ఘటన తర్వాత చెలరేగిన మతపరమైన అల్లర్ల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఐదు నెలల గర్భిణి అయిన బిల్కిస్ బానోపై గ్యాంగ్‌రేప్ చేశారు. ఆమె మూడేండ్ల కుమార్తెసహా ఏడుగురిని చంపేశారు. ఈ కేసులో సుదీర్ఘ విచారణ అనంతరం దోషులకు కోర్టు జీవితఖైదు విధించింది.